బింబిసార చక్రవర్తికి సంతానం లేదు. ఆయనా, ఆయన భార్య వైదేహి ఇద్దరూ సంతానంకోసం అనేక క్షేత్రాలు సందర్శించారు; తీర్థాల్లో స్నానం చేశారు. ఆ సమయంలో వాళ్ళకు ఒక దైవజ్ఞుడు ఎదురయ్యాడు.

"రాజా, నీకు ఒక కొడుకు పుడతాడు, తప్పనిసరిగా! ప్రస్తుతం వాడు ఫలానా కొండల్లో ఋషిగా తపస్సు చేసుకుంటూ‌ ఉన్నాడు. ఆ ఋషే, తన తదుపరి జన్మలో‌ నీకు కొడుకుగా పుట్టనున్నాడు. అయితే మరీ ఎక్కువ ఆశపడకు- ఏమంటే నీ కొడుకువల్ల నీకు సంతోషం కంటే దు:ఖమే ఎక్కువ కలుగుతుంది" అని చెప్పాడు దైవజ్ఞుడు.

బింబిసారుడి ఆలోచనలు వేగంగా పరుగులు తీశాయి. దైవజ్ఞుడు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. స్వయంగా బయలు దేరి వెళ్ళాడు కొండల్లోకి. దైవజ్ఞుడు చెప్పినట్లు, అక్కడ నిజంగానే తపస్సులో మునిగి ఉన్నాడొక ఋషి. చూడగా పెద్దగా వయసు ఉన్నట్లు కూడా లేదు- "ఎప్పటికి, ఇతను చనిపోయేది, ఎప్పటికి, నాకు కొడుకుగా పుట్టేది?" అని చాలా విచారం వేసింది బింబిసారుడికి.

మనిషిలో నీతి అడుగంటితే, బలహీనత ఆవరిస్తే ఏమేమి అవుతుందో‌చూడండి- వెనుతిరిగిన బింబిసారుడికి ఆ క్షణంలోనే బుద్ధి వికటించింది. ఠకాలున వెనుదిరిగి, కత్తి దూసి, ఆ ఋషిని చంపేశాడు!

త్వరలోనే‌ వైదేహి గర్భం దాల్చింది. నవమాసాలూ నిండాక పండంటి కొడుకును ప్రసవించింది. అందరూ పిల్లవాడిని చూసి మురిసిపోయారు- బింబిసారుడికి మాత్రం సంతోషం లేదు. ""దైవజ్ఞుడి మాట నిజం అవుతున్నది- వీడు, వాడే- నా పాలిటి మృత్యువు! నన్ను బాధ పెట్టేందుకే పుట్టాడు వీడు. ఎలాగైనా వీడిని వదిలించుకోవాలి" అనిపించసాగింది.

వైదేహి నిద్రపోతున్నప్పుడు, పొత్తిళ్ళలో ఉన్న పిల్లవాడిని ఎత్తుకెళ్ళి, ఒకరోజు రాత్రిపూట, మేడపైనుండి క్రిందపడేశాడు!

అయితే ఆశ్చర్యం! పిల్లవాడికి ఏమీ కాలేదు! బింబిసారుడి దొంగ అరుపులకు పరుగెత్తుకొచ్చిన సేవకులకు, క్రింద పూపొదలో కేరింతలు కొడుతున్న పిల్లవాడు కనిపించాడు!

వైదేహి పిల్లవాడికి 'అజాత శత్రువు' అని పేరుపెట్టి, కంటికి రెప్పలాగా కాపాడుతూ పెంచుకున్నది. బింబిసారుడికి మాత్రం, వాడిని చూస్తే ఒంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్లు అనిపించేది. తండ్రి ఆప్యాయతకు నోచుకోని అజాత శత్రువు చిన్ననాటినుండే చెడ్డపనులు చేయటం మొదలు పెట్టాడు. చెడుస్నేహాలు పట్టి తిరిగాడు; రాజకుమారులు చేయని పనులెన్నో చేశాడు. ప్రతిసారీ, తనని దండించేందుకు వచ్చిన తండ్రిని ఎదిరించేవాడు. వైదేహికూడా వాడినే వెనకేసుకొచ్చేది. వాడి చేష్ఠలతో బింబిసారుడి తలప్రాణం తోకకు వచ్చేది.

నూనూగు మీసాల వయసు వచ్చేసింది అజాతశత్రువుకు. వాడికి దేవదత్తుడనే మరొక దుర్మార్గుడు తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ఒకనాడు బింబిసారుడినీ, వైదేహినీ బంధించి, కారాగారంలో‌ పడేశారు. తండ్రిని విపరీతంగా ద్వేషించిన అజాత శత్రువు తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. జైల్లో‌ పెట్టిన తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చి చంపాడు.

అజాత శత్రువు పాపం కూడా ఊరికే పోలేదు. బింబిసారుడు జైల్లో మృతిచెందిన తర్వాత అజాతశత్రువుకు పిచ్చి పట్టిందని చెబుతారు. మానసికంగా దెబ్బతిని, విపరీతమైన అభద్రతాభావంతో‌ ప్రవర్తించే అజాతశత్రువు, అటుపైన బుద్ధభగవానుడి శరణుజొచ్చి, తీవ్రమైన ధ్యానం ద్వారా తన మనసును సన్మార్గంలోకి మళ్ళించుకున్నాడని చెబుతారు.

పాపపు పనులకు దూరంగా ఉండటమే మేలు.