అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో చాలా పేదరికం ఉండేది. అక్కడ ఒక కుటుంబంలోని వాళ్ళకు ఆరుగురు పిల్లలు- అందులో ఒక మగ పిల్లవాడు ఉండేవాడు. మిగిలిన ఐదుగురూ ఆడపిల్లలే. వాళ్ల అమ్మనాన్నలు ఐదుగురు ఆడపిల్లల్నీ చదవనిచ్చేవాళ్ళు కారు- మగ పిల్లవాడిని మాత్రం బడికి పంపి చదివించేవాళ్ళు. ఆడపిల్లలను ఇంట్లో పనికి, చేన్లో పనికి ఉపయోగించుకొనేవారు. అంత చేసినా వాళ్ళకు సరిగా అన్నం పెట్టేవాళ్ళు కాదు- మగవాళ్ళు తిన్నాకనే ఆడపిల్లలకు పెట్టేవాళ్ళు.

కొద్ది రోజుల తర్వాత ఆడపిల్లల్ని ఐదుగురినీ అలాగే వదిలేసి అమ్మా-నాన్న ఎక్కడికో వెళ్ళిపోయారు. మగ పిల్లవాడిని మాత్రం అదే ఊళ్ళో హాస్టల్లో చేర్పించారు.

ఆడపిల్లలు ఐదుగురూ తోచిన పనులు చేసుకుంటూ కాలం గడిపారు. వాళ్ళలో‌ ఇద్దరు ఆడపిల్లలు, చిన్నవాళ్ళు- "మనం మాత్రం ఎందుకు చదవకూడదు" అని, వాళ్ళు కొందరితో పుస్తకాలు తెప్పించుకొని చదివారు. బడికి కూడా వెళ్ళలేదు- ఇంట్లోనే చదువుకుంటూ, కూలిపని చేసుకుంటూ తమ చదువును కూడా కొనసాగించారు.

కొన్ని నెలలకు వాళ్ళ అమ్మానాన్నలు తిరిగి వచ్చారు. ఆడపిల్లలు అందరినీ 'ఏమేం చేస్తున్నారు?' అని అడిగారు. "మీరు చెప్పినట్లుగానే పనులకు వెళ్తున్నాం" అని చెప్పారు అందరూ. చిన్నవాళ్ళు ఇద్దరూ తాము చదువుకుంటున్న సంగతి చెప్పలేదు- చెబితే తిడతారని. "అయితే మీరు సంపాదించిన డబ్బులు ఇటు ఇవ్వండి" అని అడిగారు వాళ్ళ అమ్మా, నాన్న. అందరూ తాము సంపాదించిన డబ్బుల్ని కలిపేసి తెచ్చి ఇచ్చారు. వాళ్ళ అమ్మ ఆ డబ్బుల్ని చూసి "ఇంతేనా" అని ఐదుగురినీ‌ తిట్టింది, కొట్టింది. కానీ వాళ్ళు మాత్రం "చెల్లెళ్ళు చదువుకుంటున్నారు" అని చెప్పలేదు. అమ్మానాన్నలు వెంటనే వెళ్ళి హాస్టలులో ఉన్న కొడుకుని ఇంటికి పిలిపించారు- వాడికి కొత్తబట్టలు అవీ తెచ్చి ఇచ్చారు. అప్పటినుండి ప్రతినెలా వాడికి ఒక కొత్త వస్తువు కొనిపెట్టారు.

ఆ పిల్లవాడు హాస్టలులో ఉండి చదువుకోకుండా అల్లరిపనులు చేస్తున్నాడు- కానీ‌ వాడు ఏమి చేసినా ఇంట్లోవాళ్ళు వాడిని ఏమీ‌ అనలేదు. కానీ ఆడపిల్లలని మాత్రం ఏమీ చేయకుండానే తిడుతుండేవాళ్ళు. ఆలోగా పదోతరగతి పరీక్షలు వచ్చాయి. అక్కలంతా కలిసి ఇచ్చిన డబ్బులతో పరీక్ష ఫీజులు కట్టారు, ఆడపిల్లలిద్దరూ. పక్కవాళ్ళింట్లో టివి చూడటానికి పోయినట్లు పోయి, చదువుకునేవాళ్ళు రాత్రిపూట. అలా చాలా కష్టపడి ఎలాగో ఒకలాగ పరీక్షలు రాసారు.

ఫలితాలు వచ్చాక చూస్తే, వాళ్ళిద్దరికీ‌ జిల్లా మొత్తంలోకే మొదటి ర్యాంకులు వచ్చాయి! అందరూ ఆ సంగతే చెప్పుకుంటుంటే అమ్మానాన్నలకు తెలిసింది: "మేం‌ పనికి పొమ్మంటే మీరు చదువుకున్నారా" అని వాళ్ళు ఆ పిల్లలిద్దరినీ తిట్టారు; కొట్టారు; చంపేసేందుకు పూనుకున్నారు.

ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు వచ్చి పిల్లల్ని కాపాడితే వాళ్ళనూ కసురుకున్నారు. అంతలో వాళ్ళ కొడుకు వచ్చాడు-ఏడుపు ముఖంతో, పేపరు పట్టుకొని- వాడు పరీక్షలో ఫెయిలయినాడట!

అంతలో అటువైపు వచ్చిన వాళ్ళ సారు "వీడు ఎప్పుడో‌ తప్పాల్సింది- చాలా అతి చేస్తున్నాడు బడిలోనూ, హాస్టలులోనూ. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరూ పట్టించుకోలేదు. అందుకే ఈ‌పరిస్థితి. ఇప్పుడు వాడిని ఏదో‌ఒక పనిలో పెట్టాల్సిందే!" అన్నారు. ఆడపిల్లల్నిద్దరినీ ఆయన దగ్గరికి తీసుకొని, చాలా మెచ్చుకున్నాడు- "మీరు ఇంకా బాగా చదవండమ్మా! మీ చదువులకయ్యే ఖర్చుని నేను భరిస్తాను- మీ తల్లిదండ్రులకు ఎలాగూ‌ బుద్ధిలేదు" అన్నారు సారు. ఆయన మాటలు విన్నాక వాళ్ళ అమ్మానాన్నల కళ్ళు తెరుచుకున్నాయి. ఆనాటినుండీ తమ పిల్లల్ని అందరినీ‌ సమానంగా చూసుకున్నారు.