అనగనగా ఒక జంతువులశాల ఉంది. అక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి- ఏనుగు, జిరాఫీ మొదలైనవి. అవన్నీ ఒకదానితో ఒకటి చాలా స్నేహంగా ఉంటాయి. ఏ ఒక్కదానికి ఆ పద వచ్చినా మిగిలినవన్నీ ఆదుకుంటాయి.

ఒకరోజు ముళ్ళపందికి ఆకలి వేసింది. ఎందుకనో జూ వాళ్ళు దానికి ఆహారం వేయటం మరచి పోయారు. అది అటూ ఇటూ ఎంత తిరిగినా దానికి సరిపోయే ఆహారం దొరకలేదు. అప్పుడు అది అందరినీ పిలిచి, 'నాకు ఆకలి వేస్తోంది- మీ దగ్గర తినేందుకు ఏమైనా ఉన్నాయా?' అని అడిగింది.

"అయ్యో ! పాపం, ముళ్ళపందికి ఆకలి వేస్తోందట" అని ఒక్కొక్క జంతువూ తన దగ్గర మిగిలిన ఆహారం తీసుకొచ్చింది. కోతి పచ్చి అరటి కాయలు తెచ్చి ఇచ్చింది. కుందేలు కొన్ని గెన్సుగడ్డలను, బీట్రూటు ముక్కలనూ తెచ్చి ఇచ్చింది. రామచిలుక క్యారట్ ముక్కలు తెచ్చింది. వాటితో ముళ్ళపంది ఆకలి తీర్చుకున్నది. ఇట్లా ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మిగిలిన జంతువులన్నీ సాయానికి ముందుకు వచ్చేవి.

ఒక రోజు ఆ జంతువుల శాలను చూసేందుకు ఒక తుంటరి యువకుడు వచ్చాడు. జంతుశాలలో ఉన్న జంతువులన్నిటినీ వేధించటమే తన పనిగా పెట్టుకున్నాడు వాడు. ఊరికే ఉండక, తాబేలు మీదా, మొసలి మీదా రాళ్ళు వేశాడు. అనుకోకుండా వాడికి దారివెంట వస్తున్న కుందేలు కనబడింది.

'హేయ్! కుందేలూ!‌ ఆగాగు! నిన్ను పట్టుకుపోతా!' అంటూ వాడు దాని వెంట పడ్డాడు.

కుందేలుకు పాపం, చాలా భయం వేసింది. అది తొందర తొందరగా పరుగు తీసింది. అయినా ఆ తుంటరి వాడు దాన్ని వదలక వెంబడించాడు.

పరుగు పెడుతున్న కుందేలుకు దారిలో నడచుకుంటూ వస్తున్న ఏనుగు ఎదురైంది. కుందేలు పరుగెడుతూనే దాని దగ్గరికి వెళ్ళి, "ఏనుగూ, కాపాడు! వాడు నన్ను పట్టుకుపోతాడట! కాపాడు!" అని మొత్తుకున్నది.

అప్పుడు ఏనుగు నవ్వి, "నీకేం కాదు. నేనున్నానుగా" అని ధైర్యం చెప్పి, ఆ కుందేలును తొండంతో ఎత్తి తన వీపు పైన కూర్చోబెట్టుకున్నది; కోపంతో ఘీంకరిస్తూ ఆ తుంటరివాడి వైపు అడుగులు వేసింది. అప్పటివరకూ ఏనుగును గమనించని తుంటరివాడు, దాని అరుపును వినగానే భయంతో కంపించిపోయి, మరుక్షణంలో కాలికి బుద్ధి చెప్పాడు.

ఇట్లా ఆ జూలోని జంతువులన్నీ ఒకదాని కష్ట సుఖాలలో ఒకటి పాలు పంచుకుంటూ సంతోషంగా ఉన్నాయి!