చిరు చిరు చేతుల పాపల్లారా
పట్టండి పలకా బలపం-
విద్యనేర్వగా చుట్టండి శ్రీకారం! “చిరు చిరు”

ఓం నమ: శివాయ అంటూ
తొలిగా మీ చేతులు పట్టి
నల్లపలకపై దిద్దించే
తెల్లనైన ఆ అక్షరాలే
తెలుసుకోమనీ‌చెప్పుచున్నవీ
విద్యంటే వెలుగనీ
ఆ వెలుగు చూపే గురువంటే
ఎదుట కనపడే దేవుడనీ! "చిరు చిరు"

వెన్నెలనిచ్చే చందమామ-
కొన్నాళ్ళే ఉంటాడెందుకు?
ఎండా వానలు కలసినప్పుడే
ఎందుకేర్పడును ఇంద్రధనస్సు?
దూరానెచటో జరిగేవి-
ఎలా కనపడును టీవీ‌ తెరపై?
ఉదయించే ఈ ప్రశ్నలకు
చదువే చెప్పును సమాధానం "చిరు చిరు"

అటునిటు అంచులు ఉన్నటుల
అగుపడుతుంది ఆకాశం
ఒక ఒడ్డైనా ఉందికదా-
ఉప్పొంగే ఆ సముద్రానికి?
ఏ అంచులు హద్దులు లేని
అనంతమైన విద్యను
చారెడు మెదడున చేర్చవచ్చు-
కృషితోనే ప్రతి మనిషీ "చిరు చిరు"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song