గంగా నదిలో పడవ నడిపిస్తారు సుబ్బన్న, సుబ్బన్న కొడుకు రాముడు. తరతరాలుగా వాళ్ల కుటుంబానిది అదే వృత్తి. పడవలో ప్రయాణీకుల్ని, సామాన్లనీ అన్నిటినీ ఒక ఊరునుండి ఒక ఊరికి చేరుస్తుంటారు వాళ్లు.

ఒకసారి వాళ్ళు ఇద్దరూ పడవ నిండుగా సామాన్లు వేసుకొని పోతున్నారు. ప్రవాహానికి ఎదురుగా సాగుతున్నది ప్రయాణం. తెడ్డు వేయటం చాలా కష్టంగా ఉంది.

తండ్రి కొడుకులు ఇద్దరూ బలమైన వాళ్లే -కండలు తిరిగిన వాళ్లే. అయినా చాలా గంటల పాటు తెడ్డు వేసీ వేసీ అలసి పోయారు ఇద్దరూ. చేతులు బాగా నొప్పి పెడుతున్నాయి.

అంతలో ఒక రేవు- పట్టణం వచ్చింది. రేవులో పడవను ఆపుకొని, ఇద్దరూ కొంచెం సేదతీరారు. రాముడు ఊళ్ళోకి వెళ్లి డజను కమలా పండ్లు కొనుక్కొచ్చాడు, ప్రయాణం మొదలు పెట్టారు మళ్ళీ. రాముడు తెడ్డు వేస్తూండగా తండ్రి విశ్రాంతిగా కూర్చుని తన వంతుగా వచ్చిన ఆరు పండ్లూ తినేశాడు- అయినా ఇంకా కడుపు నిండినట్లు లేదు: ఇంకొకటి తిందామని-పించింది! కానీ ఎట్లాగ? ఒక చిన్న ఉపాయం తట్టింది.

"ఏమో ఇంకా ఎన్నిరోజులు బతుకుతానో, ఏమో!" అని మూలిగాడు గట్టిగా, కొడుక్కి వినబడేట్లు. ఆ పైన కొడుకు వాటాలోంచి ఒక పండును తీసుకొని తినేసాడు.

రాముడికి తండ్రి చేసిన పని నచ్చలేదు- అయినా ఏమీ అనలేదు; ఊరుకున్నాడు. తర్వాత సుబ్బన్న వచ్చి తెడ్డునందుకున్నాడు. ఇప్పుడు పండ్లు తినటం రాముడి వంతు. రాముడు చాలా మెల్లగా తిన్నాడు - ఒక్కో తొననూ చప్పరించుకుంటూ. తినటం పూర్తి కాగానే పడవకు చేరగిలబడి, ప్రశాంతంగా కళ్లు మూసుకున్నాడు.

సుబ్బన్నకు ఒక్కడికే తెడ్డు వేయటం కష్టంగా‌ ఉంది. పిలవకపోతే కొడుకు వచ్చేట్లు లేడు! చివరికి ఉండ బట్టలేక అరిచాడు , ' ఒరేయ్ రాముడూ! రా రా, ఇంక ! నేనొక్కడినే తెడ్డు వేయలేను, చేతులు నొప్పిపెడున్నై...రారా! అని.

రాముడు బదులిచ్చాడు కూర్చొనే- "తెడ్డు నువ్వే వెయ్యి నాన్నా! ఏమో ?! ఇంకా ఎన్నిరోజులు బతుకుతావో, ఏమో? ఎవరికెరుక?!" అని!