అనగా అనగా ఒక ఊళ్లో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. బంగారు వ్యాపారం చేసేవాడు; ఎంతో కూడ బెట్టాడు-కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే కూడా చాలా ఇష్టం.

ఒక రోజున, భూపతి దేవుణ్ని ప్రార్థిస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఆ దేవుడే ప్రత్యక్షమయ్యాడు: "భూపతీ! నీ భక్తి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరంకావాలో కోరుకో" అన్నాడు దేవుడు.

భూపతి సంతోషంతో పులకించి పోయాడు. "ఏం వరం అడిగినాఇస్తారు కదా స్వామీ!" అని అడిగాడు, ముందస్తుగా.

"వరాన్ని బట్టి ఉంటుంది. కోరుకో, ముందు" అన్నాడు దేవుడు.

"నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా"అని కోరుకున్నాడు భూపతి.

"సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను మరి- జాగ్రత్తగా ఉపయోగించుకో " అని చెప్పి దేవుడు మాయమయిపోయాడు.

భూపతికి చాలా సంతోషం వేసింది. 'ప్రయత్నించి చూద్దాం' అని చెప్పి ఒక గాజు బొమ్మను ముట్టుకున్నాడు- తక్షణం ఆ గాజుబొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది!

మంచాలనీ, కుర్చీలనీ ముట్టుకున్నాడు. అవికూడా వెంటనే బంగారు మంచాలు, బంగారు కుర్చీలు అయిపోయాయి. భూపతికి మహదానందం అయ్యింది. తన ఇంట్లోని ఒక్కొక్క వస్తువునీ గుర్తు చేసుకొని, వెళ్ళి వాటిని ముట్టుకున్నాడు. అవన్నీ బంగారం అయిపోయాయి!

అప్పటికి ఇక మధ్యాహ్నం అయ్యింది. భూపతికి ఆకలయ్యింది. భోజనం చేద్దామని వంట గదిలోకి వెళ్ళి, ప్లేటును ముట్టుకున్నాడు. వెంటనే ఆ ప్లేటు కాస్తా బంగారమైపోయింది. భూపతి సంతోషంగా నవ్వుకుంటూ అన్నం గిన్నెను ముట్టుకొని చూశాడు- అదీ బంగారం అయిపోయింది.

'సరేలే, ఇప్పటికి ఈ ఆట చాలు. ఆకలి బాగావేస్తోంది. అన్నం తిందాం' అని అన్నం పెట్టుకొని తినబోయాడు. ముద్ద నోటిని చేరేలోగా బంగారు ముద్ద అయిపోయింది! బంగారాన్ని ఎవరైనా ఎట్లా తింటారు?

భూపతి అప్పుడు కొంచెం కంగారు పడ్డాడు. "పోనీలే, కనీసం మంచినీళ్ళైనా తాగుదాం" అని గ్లాసును చేతిలోకి తీసుకున్నాడు. నీళ్లు పెదాలను తాకాయో లేదో- బంగారం అయిపోయాయి!

భూపతికి ఇక ఏంచేయాలో తోచలేదు. ఒక వైపున ఆనందం, మరోవైపు బాధ- "ఇందులో ఏదో కిటుకు ఉంటుంది- నిదానంగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది" అనుకున్నాడు.

అంతలోనే భూపతి కూతురు బడి నుంచి వచ్చింది- భూపతిని చూడగానే ఆ పాప "నాన్నా!" అని అరుచుకుంటూ దగ్గరికి వచ్చింది. భూపతి ఒక్క క్షణం పాటు తన బాధను మరిచిపోయి, ఆ పాపను ఎత్తుకుని ముద్దు చేయబోయాడు- అంతే- ఆ పాప కూడా బంగారు బొమ్మ అయిపోయింది- ఎంత పిలిచినా ఉలకదు, పలకదు!

భూపతికి పిచ్చెక్కినట్లు అయ్యింది. "పాపా! పాపా!" అని విపరీతంగా ఏడ్చాడు. "ఈ దరిద్రపు వరం నాకొద్దు- నా పాప ఉంటే చాలు నాకు- దేవుడా, ఈ వరం వెనక్కు తీసేసుకో, ప్లీజ్! రా ఒక్కసారి. నాకీ బంగారం అవసరం లేదు" అని ఏడ్చాడు.

ఆ ఏడుపు చూసి దేవుడికి కూడా జాలి వేసింది. వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు దేవుడు- "ఏల? వరాన్ని ఇంత తొందరగా వద్దంటున్నావు? నువ్వు ముట్టిందల్లా బంగారం అవుతున్నది గద!" అని అడిగాడు అమాయకంగా.

భూపతి చెంపలు వేసుకుని దేవుడి కాళ్ళమీద పడ్డాడు- "స్వామీ! నాకు బుద్ధొచ్చింది. ఇక ఎప్పుడూ అత్యాశకు పోను. ఈ వరం నాకు వద్దు. నా జీవితం మునుపటి మాదిరి ఉంటే చాలు. ఉన్నదాంట్లో సంతృప్తి పడతాను. ఇంకా ఇతరులకూ సాయం చేస్తాను. ప్లీజ్! ఇది వరంకాదు; శాపం. ఈ శాపాన్ని వెనక్కి తీసేసుకో" అని వేడుకున్నాడు. దేవుడు చిరునవ్వుతో "తథాస్తు" అని మాయమైపోయాడు.

భూపతి చెయ్యి తగిలి బంగారం అయిపోయినవన్నీ వెంటనే మళ్లీ మామూలుగా అయిపోయాయి. బంగారు బొమ్మగా మారిన బిడ్డకూడా మామూలుగా అయిపోయి కిలకిలలాడింది. భూపతి సంతోషంతో ఆ పాపను ఎత్తుకొని ముద్దాడి, తృప్తిగా కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు.