కొత్తపల్లిలో నరసమ్మ అనే ఒక పేద ముసలమ్మ ఉండేది. ఆమె భర్త నరసప్ప వ్యసనాలకు బానిస. కూలికి వెళ్ళి సంపాదించిన డబ్బంతా నరసప్ప తాగుడుకు, పేకాటలకు సరిపోయింది. ఆ ముసలి వయస్సులో నరసమ్మ రోజూ తిండికి వెతుక్కునే పరిస్థితి దాపురించింది. దానికి తోడు నరసప్ప బరువు ఎలాగూ ఉన్నది! ఆ దిగులుతో నరసమ్మ చిక్కి శల్యమైంది.

అంత గడ్డు పరిస్థితుల్లోనూ ఆమెకు ఆసరా, ఒక కుక్క. ఐదేళ్ల క్రితం నరసమ్మ రోడ్డుమీద పోతూ ఉంటే, కాళ్ళకు చుట్టుకుని 'కుయ్ కుయ్' మన్నది అది. 'చిన్నపిల్ల ఎలా బ్రతుక్కుంటుంది?' అని జాలిపడి, నరసమ్మ దాన్ని ఇంటికి తీసుకొచ్చి సాకింది. తనకు లేకపోయినా దానికి పెట్టి పెంచింది దాన్ని. ఇప్పుడు ఆకుక్కే నరసమ్మకు ఆసరా అయ్యింది. రోజూ నరసమ్మకోసం అది ఒక్కటొక్కటిగా కట్టెపుల్లల్ని ఏరుకొచ్చేది. నరసమ్మకు ఒంట్లో‌బాగుండక పడుకొని ఉంటే, అది సొంతంగా దుకాణానికి పోయి, ఏ వస్తువుకావాలో దుకాణాదారుకు చూపించి మరీ తెచ్చిపెట్టేది.

నరసమ్మ ఆ కుక్కను ఎప్పుడూ కట్టేయలేదు. దాన్ని స్వేచ్ఛగా తిరగనిచ్చింది. పెద్దయ్యేకొద్దీ అది తన ఆహారాన్ని తనే సంపాదించుకోవటం మొదలుపెట్టింది. అడవిలో పక్షుల్నీ, చిన్న చిన్న జంతువుల్నీ వేటాడి తిని వచ్చేది. ఆపైన నరసమ్మకు సహాయం చేసేది. నిండా జుట్టుతో, సింహంలాగా బలంగా ఉండే ఆ కుక్కను చూస్తే ఊళ్ళోవాళ్ళకు ఒక వంక భయం, మరొక వంక ఆశ్చర్యం కలిగేవి.

అలా చాలా రోజులు గడిచాయి. ఒక రోజు ప్రొద్దున్నే కుక్క ఇంటికి వచ్చేసరికి నరసమ్మ లేవలేదు. తీవ్రమైన జ్వరం వచ్చిందామెకు. కుక్క తనకు చేతనైన సపర్యలు చేసింది. కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. నరసప్ప అయితే ఆమెను అసలు పట్టించుకోనేలేదు! అలా మంచం పట్టిన నరసమ్మ ఇక లేవలేదు. నాలుగు రోజులు బాధపడి, చివరికి చనిపోయింది. నరసప్ప యధావిధిగా తన బ్రతుకు తాను బ్రతకసాగాడు.

కానీ కుక్కకు మాత్రం చాలా బాధ వేసింది. నరసమ్మ పడుకున్న మంచం ప్రక్కనే పడుకొని, అది చాలా రోజుల పాటు అసలు లేవనేలేదు. చివరికి నరసప్ప దాన్ని చీదరించుకొని తరిమేసరికి, అది లేచి ఊరంతా తిరిగింది. అంత లావుగా, బలంగా, సింహంలాగా ఉన్న కుక్క ఇప్పుడు సన్నగా, బలహీనంగా అయిపోయింది. జాలికొద్దీ ఎవరైనా ఏమైనా పెట్టినా అది కనీసం ఆ తిండిని వాసనైనా చూడలేదు. అలా కొద్ది రోజులు ఊరంతా తిరిగిన తర్వాత అది నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. తర్వాత మరెప్పుడూ ఎవ్వరికీ కానరాలేదు.

'మూగప్రాణి- దానికి నరసమ్మ అంటే ఎంత ప్రేమో' అనుకున్నారు ఊళ్ళోవాళ్ళు.