చాలా కాలం క్రితం విజన్యు అనే పట్టణంలో చాంగ్ అనే యువకుడొకడు ఉండేవాడు. వాడికి కూడా ఆనాటి యుద్ధవిద్యలన్నిటిలోనూ ప్రవేశం ఉండేది. అయితే వాడికి తన శక్తిసామర్ధ్యాలమీదా, తెలివి తేటల మీదా విపరీతమైన నమ్మకం ఉండటం చేత, అంత తొందరగా ఎవరిమాటా వినేవాడు కాదు.

ఒక సారి వాడికొక కల వచ్చింది. ఆ కలలో వాడు ఆ దేశపు యువరాణిని పెళ్ళాడాడు! ఆ తర్వాత యువరాణికి వాడొక బంగారు ఉంగరం తొడిగాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా కొన్నేళ్ళు గడిపిన తర్వాత, యువరాణి ఎటో వెళ్లిపోయింది. అంతలోనే వాడికి మెలకువ వచ్చేసింది కూడాను! తీరా చూసుకుంటే యువరాణి లేదు!!

దాంతో వాడు కనిపించిన వాడికల్లా తన కష్టం చెప్పుకోవటం‌ మొదలుపెట్టాడు. "యువరాణి తనను వరించటం మాత్రమే కాదు, తనతో కాపురం కూడా చేసింది! అయితే ఆ తర్వాత తనిచ్చిన బంగారు ఉంగరం‌ఎత్తుకెళ్లిపోయింది!"

"అయితే ఇకనేమి? రాజధానికి వెళ్ళు! అక్కడ మహల్లో‌ఉంటుంది, నీ‌భార్య. వెళ్తే కనీసం నీ ఉంగరం నీకు దక్కుతుంది" అన్నారు కొందరు, వెటకారంగా.

ఆలోచించగా అది సరైన సలహానే అనిపించింది వాడికి. అయితే విజన్యు నుండి రాజధాని చాలా దూరం! అంతదూరం నడిచి వెళ్లాలంటే కాళ్ళు నొప్పులు పుడతాయి. అంత శ్రమపడి తను వెళ్తే, 'యువరాణి కనీసం కాళ్లైనా వత్తుతుందో లేదో' అని అనుమానం కలిగింది వాడికి. 'దీనికంటే నయం, విజన్యులోనే ఉన్న రాజప్రతినిధిని గుర్రం సమకూర్చమంటే పోలేదూ?' అని, వాడు రాజ ప్రతినిధి దగ్గరికి వెళ్లాడు.

వాడు వెళ్లే సరికి రాజ ప్రతినిధి రకరకాల వివాదాల్ని పరిష్కరిస్తూ వ్యస్తంగా ఉన్నాడు. ఆయనముందు ఒక పెద్ద పుస్తకం- రాజ్య పరిపాలనా నియమావళి- శిక్షాస్మృతి తెరచి ఉంది. వరసల్లో నిలబడి ఆరేడుగురు న్యాయవేత్తలు ఆయన చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. కొంచెం దూరంగా కూర్చొని రకరకాల కక్షిదారులు దస్తావేజులు తయారు చేసుకుంటున్నారు. ప్రక్కనే ఒక చిన్న బల్లమీద ఘుమఘుమలాడే టీ పాత్ర, కప్పులు పెట్టి ఉన్నై.

చాంగ్ నేరుగా రాజ ప్రతినిధి దగ్గరికి వెళ్లి "ఇదిగో చూడండి! నేను చక్రవర్తిగారి అల్లుడిని. హడావిడిగా రాజధానికి వెళ్ళాల్సిన పని పడింది. మీరు నాకోసం మీదగ్గరున్న మంచి గుర్రాల్లో ఒకదాన్ని వెంటనే సిద్ధం చేయండి. ఆలోగా నేను ఇక్కడే నిలబడి టీ త్రాగుతుంటాను "అన్నాడు, టీ కప్పును చేతిలోకి తీసుకుంటూ.

రాజ ప్రతినిధి ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు: "చక్రవర్తిగారి అల్లుడు! తన కార్యాలయానికి రావటమేమిటి!? అల్లుడుగారు తన పనితీరును అంతా గమనించేసి ఉంటారు. తన లోపాలన్నీ‌ఇప్పుడు ఇక చక్రవర్తిని చేరుకుంటాయి కాబోలు!" అని, ఆయన గబుక్కున లేచి నిలబడి, మిగతా వాళ్ళు ఏం చెప్తున్నదీ పట్టించుకోకుండానే చాంగ్ చేతులు పట్టుకొని, "అల్లుడుగారూ! తమరు నా యీ చిన్న ఊరిని సందర్శించ రావటం అద్భుతం! తమరి ఆజ్ఞను అమలు చేయటం నా ధర్మం. వెంటనే గుర్రాన్ని సిద్ధం చేస్తాను" అని, గబగబా గుర్రాన్నొకదాన్ని తెప్పించి, చాంగ్ ను స్వయంగా చెయ్యిపట్టుకొని గుర్రం ఎక్కించి పంపేసి, తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

చాంగ్ ఆ గుర్రాన్నెక్కి రాజధానికి చేరుకునేసరికి చాలా అలసిపోయి ఉన్నాదు. "ఎంత దూరం వచ్చింది, నా భార్య?! ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడినుండి రమ్మన్నా వస్తుందో, రాదో" అనుకుంటూ వాడు అక్కడ ఒక టీ దుకాణం ముందు గుర్రాన్ని నిలిపాడు.

దుకాణంలో అవ్వ వాడికోసం‌ టీ తయారు చేసి ఇస్తుండగా వాడు అమెను యువరాణి గురించి అడిగాడు. "ఏం చెప్పాలి నాయనా! ఆమె అసలు పెళ్లి చేసుకోనంటున్నది. చక్రవర్తి బ్రతిమాలగా బ్రతిమాలగా, నిన్ననే స్వయంవరానికి అంగీకరించిందట!" అన్నది అవ్వ.

"ఆఁ! అంత పని చేస్తున్నదా, నేనుండగానే!?" అని చాంగ్ ఉన్నపళాన లేచి, రాజభవనం చేరుకొని, నేరుగా లోనికి దూసుకెళ్ళాడు. అక్కడున్న సైనికులు వాడిని ఆపేవాళ్లేగానీ, వాడెక్కిన గుర్రాన్ని చూసి, వాడి ముఖంలో వ్యక్తమౌతున్న భావాల్ని చూసీ వాళ్లకు వాడిని ఆపేందుకు ధైర్యం చాలలేదు. వాడు రాకుమారి మందిరం ముందున్న గంటను కొట్టగానే సైనికులు వాడిని రాకుమారి ముందు ప్రవేశపెట్టారు. "అంతా సరేగానీ, నువ్వు నన్ను వదిలి ఎందుకొచ్చేశావు? మళ్లీ స్వయంవరం‌ ఏమిటి? చెప్పు, ముందు!?" అని వాడు రాకుమారిని నిలదీశాడు.

ఆ మాట వినగానే రాకుమారి కళ్లనీళ్ల పర్యంతం అయిపోయింది. జరిగిందేమిటంటే, ఆమె చిన్నపిల్లగా ఉండగా ముసలమ్మలంతా కలిసి , తోటి పిల్లవాడొకడితో బొమ్మల పెళ్లి జరిపించారు. ఒకవైపున ఆ పెళ్లి జరుగుతుండగానే పిల్లలిద్దరూ పోట్లాడుకున్నారు. కోపం కొద్దీ పిల్లవాడు పీటలమీదినుండి లేచి వెళ్లిపోయాడు! ఆ జ్ఞాపకాలు మనసులో పెట్టుకున్న రాకుమారి పెద్దైనా పెళ్లికి ఒప్పుకోవటం లేదు.

"'నువ్వు నువ్వే' అని నాకేంటి, గుర్తు?" అని అడిగిందామె, వాడిని.

"నీ చేతికున్న ఉంగరం నాదే గద!" అన్నాడు చాంగ్ కోపంగా.

“నీకూ నాకూ ఇష్టమయినది ఏంటి చెప్పు?” అన్నది రాకుమారి చివరి పరీక్షగా.

"ఊరికే నిలబెట్టి మాట్లాడుతున్నావు, కొంచెం టీ నీళ్లు తెచ్చిపోస్తే ఏమౌతుంది? నీకోసం ఎంతదూరం నుండి వచ్చాననుకున్నావు?" అని వాడు అనేసరికి, రాకుమారి సిగ్గులమొగ్గే అయ్యింది.

"కుమార్తె ఇన్నాళ్లకుగదా, ఎవరినో ఒకరిని ఇష్టపడింది?" అనుకున్న చక్రవర్తి వాళ్లిద్దరికీ ఘనంగా పెళ్లి జరిపించాడు.

"మాకు ఎప్పుడో పెళ్లైంది గదా, మళ్ళీ పెళ్ళేంటి?" అని చికాకు పడుతున్న చాంగ్ ను చూపులతోనే వారించింది యువరాణి.

అటు తర్వాత వాడికి రాజధాని బాగానే అనిపించింది.