నిరంజన్ అల్లరి పిల్లవాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు అవ్వటంతో వాడిని చాలా గారాబంగా పెంచారు. వాడు అడిగిన వస్తువునల్లా లేదనకుండా తెచ్చి ఇచ్చేవాళ్ళు. నిరంజన్ అంతరంగంలో నిజానికి ఒక మంచితనం‌ ఉండేది; అయితే స్నేహితుల ప్రభావం వల్ల కావచ్చు, అతనికి జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏర్పడలేదు. కొడుకు అల్లరి చిల్లరగా తిరుగుతూ, డబ్బులు ఖర్చుచేయటం చూసి తల్లిదండ్రులు చాలా బాధ పడేవాళ్ళు.

ఒక రోజు నిరంజన్ బడినుండి ఇంటికి వస్తుంటే ఒక బండి ఎదురైంది. బండివాడు గులాబి మొక్కలు అమ్ముకుంటున్నాడు. ఒక్కో గులాబి అంటుకూ ఒక్కో పువ్వుంది. వాటిలో ఒక గులాబి మొక్క నిరంజన్‌ను బాగా ఆకర్షించింది.

వాడు వెంటనే దాన్ని కొనేసి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కోకనే, దానికోసం ఇంటి పెరడులో ఒక గుంత త్రవ్వి, దాన్ని నాటి నీళ్ళు పోశాడు. ఆనాటినుండీ వాడు రోజూ కొంతసేపు ఆ మొక్క దగ్గర కూర్చొని, దానికి నీళ్ళు పోయటం, ఎరువు తెచ్చి వెయ్యటం, దాని మొదలు దగ్గర కలుపు తీసేసి శుభ్రం చేయటం మొదలు పెట్టాడు.

నిరంజన్ వాళ్ళ అమ్మానాన్నలు వాడిలో వచ్చిన ఈ మార్పును శ్రద్ధగా గమనిస్తున్నారు.

చూస్తూండగానే ఆ గులాబీ మొక్కకు ఒక చిన్న గులాబీ పువ్వు పూచింది. దాన్ని చూడగానే నిరంజన్‌కు చాలా సంతోషం వేసింది. ఆ సంతోషాన్ని వాడు తన అమ్మానాన్నలతోనే కాదు, స్నేహితులతోటీ, చివరికి టీచర్లతోటీ కూడా పంచుకున్నాడు. వాడిని ఇష్టపడే టీచరు ఒకాయన నేరుగా ఇంటికే వచ్చాడు, దాన్ని చూసేందుకు!

ఆయన నిరంజన్ తల్లిదండ్రులను అభినందిస్తూ "నిరంజన్ గురించి మీరు ఇక ఏ బెంగా పెట్టుకోనక్కరలేదు. ఒక మొక్కను అంత జాగ్రత్తగా సంరక్షించి, అందులో ఆనందాన్ని చూడగలిగాడంటే, నిరంజన్ తన ఇష్టాన్ని గుర్తించినట్లే. ఒక మొక్కను పెంచాలంటే ఎంతో మనసు పెట్టాలి. ఆరోగ్యంగా నవ్వే ఈ గులాబి పువ్వు నిరంజన్ కృషి ఫలం. ఒకసారి తన కృషిలో సంతోషాన్ని చూడగల్గిన నిరంజన్, ఇకపైన చూడండి- ఎన్ని గులాబులు పూయిస్తాడో" అన్నాడు. ఆయన మాటల్ని నిజం చేస్తూ నిరంజన్ ఆ తర్వాత ఎన్నో మొక్కలు నాటాడు . తోటపనిలో వాడికి ఏర్పడిన ఇష్టం, ఆపైన వాడి చదువుల్లోనూ ప్రతిఫలించింది!