బారిస్టరు చదువుకోసం ఇంగ్లాండు వెళ్ళేసరికి గాంధీకి 18ఏళ్ళు. ఆయన పూర్తిగా శాకాహారి- మాంసం అస్సలు తినేవాడు కాదు. అయితే ఆ రోజుల్లో ఇంగ్లాండులో శాకాహారులంటూ చాలా తక్కువమంది మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు తమకోసం ప్రత్యేకంగా కొన్ని హోటళ్ళు పెట్టుకున్నారు. ఆ హోటళ్లవాళ్ళు గాంధీకి బ్రెడ్డు, వెన్న, జాం, ఉడకబెట్టిన కూరముక్కలు ఇచ్చేవాళ్ళు. ఆ కూరముక్కలపైన తిరగమోత కూడా ఉండేది కాదు. తల్లి చేతివంటకు అలవాటు పడ్డ గాంధీకి ఆ చప్పిడి తిండి అస్సలు రుచించేది కాదు.

ఇట్లా శాకాహార హోటళ్లలో కొన్ని నెలలపాటు తిన్న తరువాత, 'ఖర్చు తగ్గించుకోవాలి' అనిపించింది గాంధీకి. గది అద్దెకు తీసుకొని, స్టౌ మీద సొంతగా వండుకొని తినటం మొదలు పెట్టాడు. రోజూ ఇరవై నిముషాల్లో వంట ముగించేవాడు. వంట లెక్కలు ప్రత్యేకంగా రాసి పెట్టుకునేవాడు. భోజనం కోసం రోజుకు ఒక రూపాయి ఖర్చయ్యేదట.

లండన్ శాకాహార సమాజం వారితో పరిచయం పెరిగాక, 'శాకాహారమే ఎందుకు తినాలి, మాంసం ఎందుకు తినకూడదు?' అని రాసిన పుస్తకాలు చదివాడు గాంధీ. ఆపైన ఆయన తన వంటల్లో చాలా ప్రయోగాలు చేశాడు; చాలా మార్పులు తెచ్చుకున్నాడు.

గాంధీ ఆశ్రమాల్లో ఎక్కడా ప్రత్యేకంగా వంటవాళ్లను జీతాలిచ్చి పెట్టుకోలేదు. "ఒక్క భోజనంలో అన్ని రకాల వంటలెందుకు? సమయం వృధా" అని, గాంధీ వంటపనిని మొత్తాన్నీ సరళం చేసేందుకు ప్రయత్నించాడు. "ఆశ్రమంలో పదిమందికీ పది రుచులు కుదరదు" అని, అందరికీ ఒకే రకం వంట ఉండే ఏర్పాట్లు చేశాడు. అందరికీ వంట ఒకేచోట. అందరూ కలిసి తినాలి.

'జోనాధన్ జస్టు' అనే ఆయన రాసిన పుస్తకం "ప్రకృతిలోకి మళ్ళీ.." చదివాక, గాంధీకి అనిపించింది- "రుచికోసం కాదు; శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తినాలి" అని. అటు తర్వాత ఆయన భోజనం పరంగా చాలా ప్రయోగాలు చేశాడు. ఒకసారి ఐదేళ్ళపాటు కేవలం పండ్లు తిని బ్రతికాడు. ఒకసారి నాలుగు నెలలపాటు కేవలం మొలకెత్తిన విత్తనాలు, పచ్చి కాయగూరలు తిని, నీళ్ల విరేచనాలు తెచ్చుకున్నాడు!

దక్షిణాఫ్రికాలో గాంధీ ఆశ్రమంనుండి సత్యాగ్రహులు జట్లు జట్లుగా వెళ్ళి నిరసన వ్యక్తం చేసి, పోలీసుల చేత దెబ్బలు తినేవాళ్ళు. అలా జట్టు బయలుదేరిన ప్రతిసారీ, వాళ్లకు స్వయంగా తన చేతుల్తో కాల్చిన రొట్టెలు, టమేటా పచ్చడి, అన్నం, కూర, ఖర్జూరాలు పెట్టేవాడు గాంధీ. ఒకవైపున ఆయన చేతులు చకచకా వంట పని చేస్తుంటే, అయన నోరు మాత్రం వాళ్లకు 'సత్యాగ్రహి జీవితం ఎట్లా ఉండాలి, జైల్లో ఎట్లా జీవించాలి'-అని పాఠాలు చెబుతుండేది.

ఆ సందర్భంలో, ఒకసారి 2500మంది సత్యాగ్రహులున్నప్పుడు, పప్పులో నీళ్ళు ఎక్కువైపోయాయి. ఇంకో రోజున అన్నం సరిగ్గా ఉడకనే లేదు- అయినా, పాపం, ఆ సత్యాగ్రహులు గాంధీ మీది గౌరవం కొద్దీ ఏమీ అనకుండా తినేశారు!

'వంటపని నేర్వటం' అనేది 'విద్య'లో అతి ముఖ్యమైన అంశం అని గాంధీకి నమ్మకం. తన 'టాల్‌స్టాయ్ పొలం లో ఉన్న అందరు పిల్లలకూ వంట చెయ్యటం వచ్చు' అని చాలా గర్వంగా చెప్పుకునేవాడు. భారతదేశానికి రాగానే, తన ఈ పిచ్చిని శాంతి నికేతన్‌లో ఉన్న పిల్లలకు కూడా అంటించాడు గాంధీ. వాళ్ళు కూడా, వెంటనే ఓ "సామూహిక వంటశాల" కట్టుకొని, వంతుల వారీగా వంట చేయటం మొదలు పెట్టారు!

మద్రాసులోని ఒక హాస్టలులో వేరువేరు కులాల పిల్లలకు వేరు వేరు వంటగదులుండటం చూసి, గాంధీ చలించి పోయాడు. అవి పిల్లలకు వేర్వేరు రుచుల్లో వడ్డిస్తాయని వాళ్ళు వివరించారు గాంధీకి. అదే సమయంలో ఒక బెంగాలీ ధనికుడు గాంధీ కోసం పెద్ద విందొకటి ఏర్పాటు చేశాడు. ఆ విందులో లెక్కలేనన్ని వంటకాల్ని చూశాక, గాంధీకి వెగటు వేసింది. ఆనాటినుండీ గాంధీ 'ఐదుదినుసుల నియమం' ఒకటి పెట్టుకున్నాడు: "తను ఏ పూటనైనా తినే భోజనంలో ఏవైనా సరే-కేవలం ఐదు దినుసుల్నే వాడాలి" అని.

గాంధీ తినే ఆహారంలో చిత్రాలు చాలానే ఉండేవి. ఒక్కోసారి వేప చిగుర్ల చట్నీ ఉండేది- ఘోరమైన చేదుగా! నూనె మిల్లు లోంచి వచ్చిన తాజా చెక్కకు పెరుగు కలిపి తినటం, చింతపండుకు బెల్లం కలిపి చేసిన షర్బత్, ఉడికించి నలిపిన సోయా చిక్కుడు గింజలు (ఎలాంటి తిరగమోతా లేకుండా), ఎండిపోయిన చపాతీలను మెత్తగా పిండిచేసి తయారుచేసిన పాయసం, వేయించిన గోధుమల పొడితో చేసిన కాఫీ- ఇవి ఆ వరసలో కొన్ని వింతలే.

గాంధీకి వంటకాలపైన మక్కువ చాలా ఉండేది- ఒకసారి ఇంగ్లాండుకు పడవలో ప్రయాణిస్తూ ఆయన తన మేనల్లుడికి ఉత్తరం రాశాడు- "రెండువంతుల అరటిపండ్ల పొడికి, ఒక వంతు గోధుమ పిండి కలిపి, మేం బిస్కెట్లు, రొట్టెలు చేస్తాం" అని!

గాంధీకి కేకులు చేయటం కూడా వచ్చు. అన్నం, పప్పు, కూర, చారు, సలాడ్లు; కమలాపండ్లతోటీ-వాటి తొక్కులతోటీ పానీయాలు; యీస్టునుగాని, బేకింగ్ పౌడరును గాని వాడకుండా బ్రెడ్ చెయ్యటం- ఇవన్నీ బాగా వచ్చు. గాంధీ ఆశ్రమాలన్నింటిలోనూ బ్రెడ్లు, బిస్కెట్లు చేయటాన్ని ఆయనే స్వయంగా నేర్పాడు.

గాంధీ అనుచరుడొకడన్నాడు:"మామూలు గడ్డిలో చాలా ప్రత్యేకమైన విటమిన్లు, పోషక విలువలు ఉన్నాయని ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. నిజంగా ఇది మా అదృష్టం- ఈ సంగతి తెలిసేటప్పటికి గాంధీ గారు ఆశ్రమంలో లేరు. లేకపోతే ఆయన తక్షణమే వంటగదిని మూయించేసి, మా అందరిచేతా ఆశ్రమం బయట గడ్డి మేయించేవాడు" అని!

దీన్ని బట్టి గాంధీ ఎంత గొప్ప వంటవాడో అర్థం అవుతున్నది, కదూ?