ఈ బొమ్మను చూస్తుంటే చాలా భయం వేస్తున్నది. దీనిలో‌నాకు పెద్ద పెద్ద రాక్షసి బల్లులు, వాటి నీడలు కనిపిస్తున్నాయి. అమ్మో! ఇంత భయంకరమైన జంతువుల్ని ఎన్నడూ చూడలేదు. ఒక్కొక్కసారి ఈ బొమ్మను చూస్తుంటే 'అవన్నీ నిజంగానే నాదగ్గరికి వస్తున్నాయేమో' అనిపించి భయం వేస్తుంది.

ఒక్కొక్కసారి 'నేను ఇంత పెద్ద జంతువుల్ని నా కళ్ళారా ఎప్పుడూ చూడలేదు గదా, వీటిని ఒకసారైనా చూస్తే బాగుండు గదా' అనిపిస్తుంది. కానీ 'చూస్తే ఏమైపోతానో' అని ఒక ప్రక్క భయం! అయితే, ఈ బొమ్మను చూశాక, నేను మా చెల్లికి, తమ్ముడికి ఒక దెయ్యం కథ చెప్పాను. 'అలా చెబితే వాళ్ళిక నా జోలికి రారు, చూద్దాం' అని. నేను అనుకున్నట్లుగానే వాళ్ళు భయపడ్డారు. నా జోలికి రావటం మానుకున్నారు. వాళ్ల భయం చూసి నాకు చాలా నవ్వు వచ్చింది.

'భయానికి నిజంగా అర్థం ఉండదు' అని నాకు అర్థమైంది. "భయం అనే మాటను ఎవరు కనిపెట్టారు, అసలు భయం అంటే ఏమిటి?" అని చాలా మందిని అడగటం మొదలు పెట్టాను. కానీ ఎవరిని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. నేనే సొంతగా కష్టపడి, చాలా పుస్తకాలు చదివి, ఎలాగో ఒకలా తెలుసుకున్నా.

అసలు భయం అంటే ఏంటో తెలుసా? భయం అనేది ఒక అలజడి. మనసులో రేగే ఒక చిచ్చు. మనసులో టపాకాయ పేలినట్లు పేలి, దాన్ని అల్ల కల్లోలం చేస్తుంది. భయం అనేది మన మనసులో రేగే ఒక కలకలం అన్నమాట. మనసులో ఆ కలకలం రేగినప్పుడు, శరీరంలో కూడా దానికి అనుగుణంగా చాలా మార్పులు వస్తాయి. మన ముఖంలోని హావభావాలు మారిపోతాయి. కనుపాపలు పెద్దవౌతాయి. నోరు తెరుచుకుంటుంది. గాలి పీల్చుకునే వేగం మారుతుంది. శరీరంలో హార్మోన్ల వ్యవస్థలో‌ పెను మార్పులు సంభవిస్తాయి. ఇవన్నీ తెలుసుకునే సరికి, 'భయానికి ఇంత చరిత్ర ఉందా' అని ఆశ్చర్యం వేసింది. అప్పటినుండి నేను దేనికీ‌ భయపడటం మానేశాను.

అంతేకాదు, నేను సొంతగా 'భయం' అనే పదాన్ని వాడటమే మానేసి, ఇతరుల్ని భయపెట్టి చూడటం మొదలుపెట్టాను! మా ఇంటికి ఏ పిల్లవాడు వచ్చినా ఈ బొమ్మను చూపించి, ఏదేదో చెప్పేసి, భయ పెట్టిస్తున్నాను.

దాంతో వాళ్ళు మా యింటికి రావటం మానేశారనుకోండి, వాళ్ళు పిరికి వాళ్ళన్నమాట. వాళ్ల ధైర్యానికి ఇది ఒక పరీక్ష !

అందుకని, ఇప్పుడే చెప్పేస్తున్నాను- మా ఇంటికి వచ్చేవాళ్ళు కొండంత ధైర్యంతో రండి మరి- సరేనా?