అనగా అనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో విష్ణు అనే పిల్లవాడు ఉండేవాడు. అతను రోజూ గొర్రెల్ని తోలుకొని కొండమీదికి వెళ్ళేవాడు. ఒక రోజున అతను ఎప్పటిలాగే గొర్రెల్ని వెంట బెట్టుకొని కొండ ఎక్కుతుండగా, అకస్మాత్తుగా ఒక ఎలుగు బంటి ఎదురయింది. ఏంచేయాలో అర్థం కాని విష్ణు గాభరా పడి, ఎటు తోస్తే అటు పరుగెత్తాడు.

ఒకసారి ఎలుగుబంటినుండి తప్పించుకున్న తర్వాతగానీ అతని ప్రాణం కుదుట పడలేదు. ఇక అలా పోతా పోతా ఉంటే అతనికి ఒక కుందేలు ఎదురైంది. ఎలాగైనా ఆ కుందేలును పట్టుకుందామని, అతను దాని వెంట పడ్డాడు. విష్ణును చూసి అది మరింత వేగంగా దుముక్కుంటూ పోయింది- చివరికి ఏవో పొదల్లోకి దూరి ఇక కనిపించలేదు.

ఆ సరికి సాయంత్రం అయ్యింది. "చూడు, ఎలుగు బంటిని చూసి నేను పారిపోయాను, నన్ను చూసి కుందేలు పారిపోయింది" అని నవ్వుకుంటూ విష్ణు ఇల్లు చేరుకున్నాడు.

ఇల్లు చేరుకున్నాక, వాళ్ళ నాన్న అడిగాడు- "ఒరే, విష్ణూ! గొర్రెలు ఏవిరా?" అని! అప్పుడు గానీ విష్ణుకు తమ గొర్రెలు గుర్తుకు రాలేదు! వాడు బిక్క ముఖం వేసుకొని, వాళ్ళ నాన్నకు జరిగిన సంగతంతా చెప్పాడు. అప్పుడు వాళ్ల నాన్న నిట్టూర్చి, "సరే, ఏంచేస్తాం, ఇప్పుడు మనిద్దరం వెళ్ళి గొర్రెల్ని వెతికి, వెనక్కి తోలుకు రావలసిందే, పద!" అని టార్చిలైటు పట్టుకొని బయలు దేరాడు.

"ఎలాగో ఒకలాగా గొర్రెలు దొరికితే చాలు దేవుడా! ఈసారినుండీ ఎప్పుడూ భయపడను, అపాయం ఎదురైతే ఉపాయం ఆలోచిస్తాను గానీ, ఇట్లా పిరికి వాడిలాగా పారిపోను" అనుకుంటూ, వాళ్ల నాన్నతోబాటు నడక సాగించాడు విష్ణు.

తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి కొండను చేరుకునే సరికి, అప్పుడప్పుడే చీకటి పడుతున్నది. కొండ ఎక్కటం మొదలెట్టారు ఇద్దరూ. "ఎలుగు బంట్లు ఒక చోటును అంటి పెట్టుకొని ఉండవు. ఇంతకు ముందు కనబడ్డ చోట ఇప్పుడు అది ఉంటుందని భయపడనక్కర్లేదు" అని చెప్పుతూ పోతున్నాడు విష్ణు వాళ్ళ నాన్న.

అయితే ఎలుగుబంటి అక్కడే ఉన్నది! ఒక్కసారిగా అది వీళ్ళ ముందుకు దూకింది! అప్పటి వరకూ ధైర్యంగా ఏవేవో చెబుతున్న విష్ణువాళ్ళ నాన్న, ఆ ఎలుగు బంటిని ఎదురుగా చూడగానే భయంతో కళ్ళు తిరిగి పడిపోయాడు! విష్ణుకైతే నోరు ఎండిపోయింది.. ప్రాణం‌ గడ్డకట్టుకుపోయింది. పారిపోయేందుకు కూడా అడుగులు రాలేదీసారి.

అయితే వెంటనే తేరుకున్న విష్ణు చురుకుగా ఆలోచించాడు. గబుక్కున వంగి, వాళ్ల నాన్న జేబులోంచి అగ్గిపెట్టె తీసుకున్నాడు. అగ్గిపుల్లను అంటించాడు. అగ్గిపుల్ల "బుస్" మని వెలగ్గానే ఎలుగుబంటి వింతగా చూసింది. వెంటనే విష్ణు దగ్గర్లో పడి ఉన్న ఒక కాయితాన్ని ముట్టించాడు. కాయితం అంటుకుని మంట రాగానే, ఎలుగుబంటి ఒక అడుగు వెనక్కి వేసింది.

మరుక్షణం విష్ణు క్రిందికి వంగి, టార్చిలైటును చేతిలోకి తీసుకున్నాడు- దాన్ని ఆన్ చేసి, వెలుతురు సరిగ్గా ఎలుగుబంటి కళ్ళల్లో పడేట్లు పట్టుకున్నాడు. ఎలుగుబంటికి కొద్ది సేపు కళ్ళు కనబడలేదు. ఆ లోగా విష్ణు క్రింద పడేసిన కాగితం చుట్టు ప్రక్కల ఉన్న గడ్డి అంటుకోనారంభించింది. నిప్పును చూసిన ఎలుగుబంటి భయపడి, వెనక్కి తిరిగి పారిపోయింది!

అలా ప్రమాదం తప్పాకగానీ విష్ణు వాళ్ళ నాన్నకు తెలివి రాలేదు. ఆపైన వాళ్ళిద్దరూ నేలమీద పరుచుకుంటున్న నిప్పును ఆర్పేసి, టార్చి వెలుగులో తమ గొర్రెల్ని వెతుక్కొని, మెల్లగా ఇల్లు చేరుకున్నారు! సంగతి తెలిసి, ఊళ్ళో జనాలంతా వచ్చారు. అందరూ విష్ణు ధైర్యాన్నీ, సమయస్ఫూర్తినీ మెచ్చుకున్నారు.