తలమీద చేపల తట్ట పెట్టుకొని, ఒకామె చేపలమ్ముకుంటూ పోతున్నది- రాజు గారి కోట పక్కనుండే. అంత:పురానికి చాలా కిటికీలున్నై. ఒక కిటికీలోంచి తల బయటికి పెట్టి చూస్తున్నారు, రాణి గారు. చేపలమ్మే మనిషిని దగ్గరికి రమ్మని సైగ చేసారు. ఆమె కిటికీ దగ్గరికి వచ్చి, తట్టను దింపుకుంటున్నది- సరిగ్గా అదే సమయానికి, తట్టలో అడుగున ఉన్న ఒక పెద్ద చేప కదిలి, పైకి ఎగిరి, మళ్ళీ తట్టలో పడింది.

'అది మగదా, ఆడదా?" అడిగారు రాణీగారు -"ఇది రాణివాసం కదా, ఇక్కడ ఉండేవాళ్ళంతా ఆడవాళ్ళే. అందుకని నేను ఆడ చేపను ఒక దాన్ని కొందామనుకుంటున్నాను".

రాణిగారి మాటలు వినగానే ఆ చేప గట్టిగా నవ్వింది.

"ఇది మగది" అని చెప్పి, చేపలామె తట్టను తిరిగి తలమీద పెట్టుకొని, వెళ్ళిపోయింది.

రాణీగారు కోపంగా వెనుదిరిగారు- ఒక మామూలు చేప , తనను చూసి ఎందుకు నవ్వాలి?" అని ఆమెకు ఉక్రోషం కలిగింది. సాయంత్రం అయినా ఆమె కోపం చల్లారలేదు.

సాయంత్రం రాణి వాసానికి వచ్చిన రాజుగారికి, అంత:పురం అంతా బోసిగా కనబడ్డది. "ఏంటి సంగతి, ఏమైంది? నీ ఆరోగ్యం బాగా లేదా?" అడిగారు ఆయన.

"నా ఆరోగ్యానికేం, నిక్షేపంగాఉన్నది. కానీ ఒక చేప వింత ప్రవర్తన వల్ల, నాకు తట్టుకోలేని కోపం వచ్చింది. ఇవాళ్ళ ప్రొద్దున ఒకామె నాకు చేపలు అమ్మ జూపింది- అయితే నేను 'అది ఆడచేపనా, మగచేపనా?' అని అడిగేసరికి, అది నన్ను చూసి వెకిలిగా నవ్వింది!"

"నిజమా! చేప మిమ్మల్ని చూసి నవ్విందా? మీరేమీ భ్రాంతి చెందలేదు గద?" అడిగారు రాజుగారు, ఏమనాలో తోచక.

"నాకు ఆమాత్రం తెలివి, జ్ఞానం ఉన్నాయిలెండి. నేను నా యీ సొంత కళ్ళు పెట్టుకొని చూశాను దాన్ని! నా యీ సొంత చెవులతో విన్నాను- దాని వెకిలి నవ్వును!"

"చాలా ఆశ్చర్యం! సరే కానివ్వండి, నేను ఈ అంశంపైన విచారణ జరిపిస్తాను " అన్నారు రాజుగారు.

మరునాడు తెల్లవారగానే ఆయన మంత్రిని పిలిపించారు. ఆయనకు సంగతినంతా వివరించారు. చేప అలా 'అమర్యాదగా ఎందుకు నవ్వింది?' అన్న అంశం మీద విచారణ చేపట్టమన్నారు. ఆరు నెలలలోగా ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం తేలేకపోతే మరణదండన తప్పదని భయపెట్టారు.

ఆ లోగానే వాస్తవాన్ని బయట పెడతానని నమ్మబలికి, మంత్రి అక్కడి నుండి తప్పుకున్నాడు. కానీ పనిని ఎక్కడి నుండి మొదలు పెట్టాలో ఆయనకు ఏమాత్రం అర్థం కాలేదు. చేపలమ్మకూ ఏమీ తెలియలేదు, మరి!

తర్వాత ఐదు నెలల పాటు మంత్రి నిరంతరం అదే ధ్యాసలో గడిపాడు-"చేప ఎందుకు నవ్వింది?" అని. దానికి కారణం కనుగొనేందుకు ఆయన వెళ్ళని చోటూ లేదు; అడగని మనిషీ లేడు- జ్ఞానుల్ని , మంత్రగాళ్ళనీ- అందర్నీ అడిగాడు మంత్రి. అయినా వాళ్ళు ఎవ్వరూ చేప నవ్వులోని అంతరార్థాన్ని వివరించలేకపోయారు.

మంత్రిగారికి గుండె పగిలి నట్లయింది. తిండి , నిద్ర కరువయ్యాయి. తనకి ఇక చావు తప్పదని తేల్చుకొని, ఆయన నిరాశగా వెనుతిరిగి, తన ఇల్లు చేరుకున్నాడు. తన ఇంటి వ్య వహారాలను చక్కబరచుకున్నాడు. రాజుగారి శాసనానికి తిరుగు ఉండదని, ఆయన తన మాటపై నుండి వెనక్కి తగ్గే అవకాశం లేదని- ఆయనకు తెలుసు. 'రాజుగారికి కోపం వస్తుంది- తను మరణించటమే కాదు; తన కుటుంబం మొత్తం ఆయన కోపాగ్నికి బలవుతుంది.'

మంత్రిగారు తన కొడుకుకు విషయం అంతా చెప్పేశారు. రాజుగారి కోపం చల్లారేంత వరకు అతన్ని దేశాలు పట్టి పొమ్మన్నారు. ఆపైన క్షణాలు లెక్కపెట్టుకుంటూ ఇంట్లో కూర్చున్నారు.

మంత్రి కొడుకు కుర్రవాడు , బాగా తెలివైన వాడున్నూ. అతను బయలుదేరి, నడుచుకుంటూ తన కాళ్ళు, అదృష్టం తనని ఎటువైపు తీసుకువెళ్తే అటువైపు పోసాగాడు. కొన్ని రోజులు అలా నడిచిన తర్వాత, అతనికి ఇంకొక బాటసారి కనబడ్డాడు. అతనొక రైతు. యాత్రలు ముగించుకొని తన ఊరికి తిరిగిపోతున్నాడతను.

మంత్రి కొడుక్కి ఆ రైతు తీరు నచ్చింది. రైతు ఒప్పుకున్న మీదట,మంత్రికొడుకు అతనితో కలిసి నడవటం మొదలెట్టాడు. ఎండ మండిపోతున్నది. నడక కష్టంగా ఉన్నది. ఇద్దరూ బాగా అలసిపోయి ఉన్నారు.

"మనం ఒకళ్లనొకళ్లం ఎత్తుకొని పోగలిగితే చాలా బాగుంటుందనిపిస్తోంది నాకు. ఏమంటావు?" అన్నాడు మంత్రికొడుకు అతనితో, ఉత్సాహంగా.

"మనిషిని చూస్తే బాగున్నాడు. కానీ పాపం, పిచ్చివాడు లాగున్నాడు" అనుకున్నాడు రైతు. కొంతసేపటికి వాళ్లొక వరిమడిని దాటుకొని పోవలసి వచ్చింది. కోతకు సిద్ధంగా ఉంది, పొలం. బంగారు రంగులో మెరుస్తున్న కంకులు చల్లగా వీచే గాలికి అటు ఇటూ ఊగుతున్నై.

"ఈ పంట అంతా తినేదేనా,కాదా?" అడిగాడు మంత్రికొడుకు.

రైతుకు ఏం చెప్పాలో అర్థం కాక, "ఏమో నాకు తెలీదు" అనేశాడు.

కొంచెసేపటికి బాటసారులిద్దరూ ఒక పెద్ద ఊళ్లోకి వచ్చారు. జేబులో పెట్టుకొనే చిన్న కత్తిని ఒకదాన్ని రైతుకు ఇచ్చాడు మంత్రి కొడుకు : "తీసుకో, మిత్రమా! దీంతో రెండు గుర్రాలను తీసుకురా. కానీ దయచేసి దీన్ని కూడా వెనక్కి తీసుకురా- ఇది చాలా విలువైనది" అన్నాడు.

రైతుకు కొంచెం కోపమూ, కొంచెం నవ్వూ ఒకేసారి వచ్చాయి. అతను కత్తిని పక్కకు పెట్టేసి, "వీడు తిక్కవాడైనా అయి వుండాలి, లేకపోతే తెలివిగా నన్ను పిచ్చోడిని చేస్తూనైనా ఉండాలి!" అని గొణుకున్నాడు. మంత్రి కొడుకు ఆ మాటలు వినికూడా విననట్లు నటించి, చాలాసేపు ఇక ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు.

ఆ పైన వాళ్లిద్దరూ ఒక పెద్ద పట్టణం చేరుకున్నారు. ఆ పట్టణం దాటాక కొద్ది దూరంలోనే రైతు ఉండే గ్రామం వస్తుంది. పట్టణం మొదట్లోనే వాళ్లకొక పెద్ద గుడి ఎదురైంది. దానికొక విశాలమైన అరుగు, ఆవరణ ఉన్నై. అయితే అక్కడున్న వాళ్లు ఎవ్వరూ వీళ్లను పలకరించలేదు; కనీసం ఆ చావడిలో చెట్టు నీడన కూర్చుని సేదదీరి పొమ్మని కూడా అనలేదు.

"ఎంత పెద్ద స్మశానం !" అన్నాడు మంత్రికొడుకు, ఆశ్చర్యపోతున్నట్లు.

"వీడి ఉద్దేశ్యం ఏంటి? ఇంత పెద్ద జనాభాతో, ఇం‌త గొప్పగా ఉన్న పట్టణాన్ని వీడు స్మశానం అంటున్నాడు?" అనుకున్నాడు రైతు.

పట్టణం దాటాక, అవతలి వైపున వాళ్లొక స్మశానాన్ని దాటిపోతున్నారు. అక్కడ కొందరు మనుషులు ఒక సమాధి ముందు నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్లలో కొందరు మరణించిన తమ పెద్దల్ని గుర్తుచేసుకుంటూ దారిన వచ్చే-పోయే వాళ్లందరికీ రొట్టెలు పంచి పెడుతున్నారు. వాళ్ళు ఈ బాటసారులిద్దరినీ పిలిచి, తినగలిగినన్ని రొట్టెలు ఉచితంగా ఇచ్చారు.

"ఎంత అద్భుతమైన పట్టణం కదా, ఇది!"అన్నాడు మంత్రికొడుకు, మురిసిపోతూ.

"వీడు నిజంగా పిచ్చివాడే- సందేహం లేదు" అనుకున్నాడు రైతు."ఇకపైన ఏం చేస్తాడో చూడాలి. నేలను నీళ్లంటాడేమో-నీళ్లను నేలంటాడు; బహుశ: చీకటిని వెలుగని, వెలుగుని చీకటని అంటాడేమో!"

అప్పుడు వాళ్లొక చిన్నవాగును దాటాల్సి వచ్చింది. వాగు వేగంగా ప్రవహిస్తున్నది. దాని లోతు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నది. రైతు చెప్పులు వదిలి, పంచెను పైకి ఎత్తి పట్టుకొని దాన్ని దాటాడు. కాని మంత్రికొడుకు తను వేసుకున్న చెప్పులు, పైజామా అలాగే ఉంచుకొని వాగును దాటుకున్నాడు.

"అబ్బ!నిజంగా ఇంత పిచ్చోడిని ఎక్కడా చూడలేదు!"అనుకున్నాడు రైతు తనలో తాను.

అయినా రైతుకి ఈ కుర్రవాడు నచ్చాడు.అతన్ని చూస్తే మంచి కుటుంబీకుడి లాగాను, మర్యాదస్తుడి లాగాను ఉన్నాడు.ఇలాంటి వాడి పిచ్చి మాటలు విని తన భార్య , కూతురు బాగానే సంతోష పడొచ్చు! అందుకని,అతను మంత్రి కొడుకుతో "ఎలాగూ ఇంత దూరం వచ్చావు- అలాగే పనిలో పనిగా మా ఇంటికీ వచ్చి పోరాదూ? కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నట్లుంటుంది!" అన్నాడు మర్యాదకొద్దీ.

మంత్రి కొడుకు అతనికి ధన్యవాదాలు చెప్పి, "కానీ, మీరేమీ అనుకోకపోతే, ఓ సంగతి అడుగుతాను, చెప్పండి- మీ ఇంటి దూలమైతే గట్టిగా ఉంది గద?" అని అడిగాడు.

రైతు తన నోటికి ఏది తోస్తే అది మాట్లాడాడు.

అంతలో వాళ్ళ ఊరు వచ్చింది. మంత్రి కొడుకును ఒక తోపులో ఉండమని, తనొక్కడే ముందుగా ఇల్లు చేరుకున్నాడు రైతు. ఇంట్లో వాళ్ళతో అతను "నేనూ, ఒక కుర్రవాడూ చాలా దూరం నుండి కలిసి నడుస్తూ వచ్చాం. నేను అతన్ని మన ఇంట్లో కొద్ది రోజులు ఉండిపొమ్మన్నాను. కానీ వాడు ఎంత వెర్రివాడంటే- వాడు చేసేదీ, అనేదీ ఒక్కటీ అర్థం కాలేదు నాకు. 'మా ఇంటికి రా నాయనా' అంటే, 'మనింటి దూలం గట్టిదేనా?' అని అడిగాడు వాడు! హ హ్హ హ్హ ! గొప్ప పిచ్చోడు!" అన్నాడు.

రైతు కూతురు చాలా తెలివైన పిల్ల; బాగా చురుకైనది కూడాను. ఆమె రైతుతో అన్నది-"అతనెవరో,ఏమిటో తెలీదుగాని, నువ్వన్నట్లు అతను వెర్రివాడైతే కాదు. 'తను మీ ఇంటికి వస్తే, ఆ ఖర్చును భరించే శక్తి మీకున్నదా?' అని అడిగాడు అతను: 'మీ ఇంటి వాసం గట్టిదేనా?' అంటే అర్థం అది!" అన్నదాపిల్ల.

"ఓహో! అదా!" అన్నాడు రైతు- "ఇప్పుడు అర్థమైంది. అతని పిచ్చి మాటలు కొన్నింటికి బహుశ: నువ్వు అర్థం చెప్పగలవేమో చూడు. మేమిద్దరం నడిచివస్తుంటే "మనం ఒకళ్లనొకళ్లం ఎత్తుకొని నడిస్తే ఎంత బాగుటుంది?!" అన్నాడు వాడు! అలా ప్రయాణం చాలా బాగుంటుందట."

"అవును, నిజం! మీరు కథలు చెప్పుకుంటూ నడవాలని అతని ఉద్దేశం! అలా నడిస్తే ప్రయాణం తేలిక అవుతుంది కదా, అని"

"ఓహో,నిజమే. మేం ఒక వరి మడి లోంచి వస్తుంటే "ఈ పంటంతా తిన్నదా,ఇంకా ఉన్నదేనా?" అని అడిగాడు వాడు!"

"అయినా మీకు అర్థం కాలేదా,నాన్నా!? 'ఆ పొలపు యజమాని పరిస్థితి ఏంటి?'అని అడిగాడతను.

"యజమాని అప్పుల్లో ఉంటే, పంటంతా అప్పులవాళ్లకు పోతుంది. నిండుగా కనబడుతున్నా, నిజానికి అది తినేసిన పంట క్రిందే లెక్క. అలా కాకుండా అతనికి ఎలాంటి అప్పూ లేకపోతేనే కద, పంట నిలిచి ఇల్లు చేరేదీ, రైతు దాన్ని తినేదీ?"

"అవునవును, బాగానే ఉంది. మేం ఒక ఊర్లోకి పోతుండగా, వాడు నాకు ఒక చిన్న కత్తిని ఇచ్చి, దాంతో రెండు గుర్రాల్ని తెమ్మన్నాడు- గుర్రాలతో బాటూ కత్తినీ వెనక్కితేవాలట!"

"రోడ్డు వెంబడి నడిచీ నడిచీ అలసిన వారికి కట్టెలు ఎంత సాయం చేస్తాయంటే, అవి గుర్రాలకు ఏ మాత్రం తీసిపోవు. అతను ఆ కత్తిని నీకిచ్చి, రెండు గట్టి కట్టెలు ఊతానికి, కొట్టుకొని రమ్మన్నాడు. కత్తిని పొగొట్టద్దని చెప్పాడు."

"అలాగా" అన్నాడు రైతు. "మేం నగరంలోంచి వస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు ఒక్కరూ కనబడలేదు. చివరికి స్మశానం దగ్గరికి చేరుకునేంతవరకూ, ఆకలితో‌ఉన్న మాకు ఒక్క రొట్టె ముక్క పెట్టినవాళ్ళు లేరు. అక్కడ ఎవరో కొందరు మమ్మల్ని పిలిచి మరీ రొట్టెలు పెట్టారు! అప్పుడు మన వాడు నగరాన్ని స్మశానం అనీ, స్మశానాన్ని నగరం అనీ అన్నాడు."

"చూడండి నాన్నా, అతిథుల్ని ఆదరించటం తెలీని వాళ్లు చనిపోయిన వాళ్లకంటే నీచం. అలాంటి వాళ్లతో నిండిన స్థలాన్ని స్మశానం అనటం తప్పుకాదు. మరి, చనిపోయిన వాళ్లు ఉండాల్సిన స్మశానంలో మిమ్మల్ని ఆదరించి, రొట్టెముక్కలిచ్చే దయగల మనుషులు ఎదురయ్యారు మీకు. అలాంటివాళ్లు ఉండే స్థలం ఏ నగరానికి తీసిపోతుంది, చెప్పు?" అన్నది రైతు కూతురు.

"అవునవును,నిజమే"అన్నాడు రైతు,నిర్ఘాంతపోతూ."కానీ,మరి ఇందాక,మన వాగును దాటేటపుడు. అతను కనీసం బూట్లు కూడా విప్పలేదు!"

"నాకు అతని తెలివి తేటలు చాలా నచ్చినై" అన్నది రైతు కూతురు-"మామూలు జనాలు అందరూ 'అంత వేగంగా ప్రవహించే వాగులోకి చెప్పులు లేకుండా దిగుతారెందుకా', అని నేనే ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఏ ముల్లో గుచ్చుకున్నదంటే, తర్వాత అన్నీ కష్టాలే గద!" ఈ మనిషి ఎవరో చాలా తెలివి గలవాడి లాగున్నాడు. నాకు అతన్ని కలిసి మాట్లాడాలని బాగా కోరికగా ఉన్నది." అన్నదాపిల్ల.

"సరే, అయితే. నేను వెళ్ళి అతన్ని పిలుచుకు వస్తాను" అన్నాడు రైతు. "అతనికి చెప్పండి- మన ఇంటి వాసాలన్నీ గట్టిగానే ఉన్నాయని. అప్పుడు అతను మన ఇంటికి వస్తాడు- ఆగండి ఒకసారి- నేను ముందుగా అతని కోసం కొన్ని కానుకలిచ్చి, ఒక మనిషిని పంపిస్తాను. దాంతో మనం అతిథుల్ని ఆదరించే సమర్థత ఉన్నవాళ్ళమేనని అతనికి అర్థమౌతుంది." అన్నది రైతు కూతురు.

ఆపైన ఆపిల్ల ఇంట్లో పనిచేస్తున్న మనిషినొకడిని పిలిచి, అతనికి ఒక పాయసపు గిన్నె, పన్నెండు రొట్టెలు, ఒక పాల జగ్గు ఇచ్చి పంపిస్తూ, ఇలా చెప్పమన్నది: "మిత్రమా! పున్నమి చంద్రుడు బాగున్నాడు. పన్నెండు నెలలు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది. మరి, సముద్రం నీళ్ళతో పొంగి పొర్లుతున్నది" అని.

పనివాడు మంత్రికొడుకు కోసం ఆ కానుకలు తీసుకుపోతుంటే, దారిలో వాడికి తన కొడుకు- ఆరేళ్ళవాడు- ఎదురయ్యాడు. బుట్టలో ఏమున్నాయో చూసి, పిల్లవాడు వాటికోసం మారాం చేయటం మొదలు పెట్టాడు. తెలివిలేని ఆ పనివాడు పిల్లవాడికి చాలా పాయసమూ, ఒక రొట్టె, కొన్ని పాలు ఇచ్చి, మిగిలిన వాటిని తీసుకెళ్ళి మంత్రికొడుక్కి ఇచ్చాడు, యజమాని కూతురు ఏం చెప్పమన్నదో అది చెబుతూ.

"మీ యజమానురాలికి నా ధన్యవాదాలు, శుభాకాంక్షలూ అందజెయ్యి. ఆమెకి చెప్పు- 'చంద్రుడు పాడ్యమి కళన ఉన్నాడనీ, నాకు సంవత్సరంలో పదకొండు నెలలే కనబడుతున్నాయనీ, సముద్రం ఏమాత్రం నిండలేదనీ' చెప్పు!" అన్నాడు మంత్రికొడుకు , పని వాడితో.

పని వాడికి ఈ సంకేతాల భాష ఏమాత్రంఅర్థంకాలేదు. అయినా వాడు దీనిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని, ఏ పదానికి ఆ పదం- ఉన్నదున్నట్టు- అప్పజెప్పాడు రైతు కూతురుకు. ఆమె వెంటనే వాడి దొంగపనిని గుర్తు ప ట్టి నిలదీస్తే, వాస్తవం బయటపడ్డది.

అంతలోనేమంత్రికొడుకు, రైతు కలిసి ఇంటికి వచ్చారు. రైతు కూతురు అతనికి రాజోచితంగా అతిథి సత్కారాలు చేసింది. రైతుకు అతని పుట్టు పూర్వోత్తరాలేవీ తెలీక పోయినా , బిడ్డ అలా చేయటానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలని ఊరుకున్నాడు.

ఆతర్వాత మాటల క్రమంలో మంత్రి కొడుకు వాళ్లకు తన గురించి అంతాచెప్పాడు- చేప నవ్వటమూ, తన తండ్రి కారణం కోసం వెతకటమూ, కాలాతీతం అవుతున్నదని శిరఛ్ఛేద శిక్షకు సిద్ధపడటమూ, ముందుగా తనని రాజ్యం విడచి పొమ్మనటమూ- అన్నీ చెప్పాడు వాళ్లకు. చెప్పి, తనని ఇప్పుడు ఏం చేయమంటారో సలహా అడిగాడు వాళ్ళను.

రైతు కూతురు నవ్వి, "సమస్య మొత్తానికీ మూలం చేప నవ్వులోనే గదా, ఉన్నది? అంత:పురంలో- అందరూ ఆడవాళ్ళే ఉండాల్సిన చోట- ఒక మగవాడు కూడాఎవరో దాక్కొనిఉండాలి. ఆ విషయం చేపకు తెలిసి ఉంటుంది. అంత:పురంలోనే ఉన్న మగవాడిని పట్టుకోలేని రాణీగారు చేపల్లో కూడా ఆడ చేపే కావాలంటున్నారని విని, అది నవ్వి ఉంటుంది. రాజుగారికి ఈసంగతి తెలిసేఅవకాశం లేదు"అన్నది.

"ఓహ్,అద్భుతం ! సరిగ్గా చెప్పావు! నేనువెనక్కి వెళ్తే మా నాన్నగారి ప్రాణాల్ని కాపాడుకోవచ్చు- ఇంకా చాలా సమయం ఉన్నది" అని మంత్రికొడుకు సంతోషంగా అరిచాడు. మరుసటి రోజున తెల్లవారుతుండగానే అతడు రైతు కూతురుతో సహా గుర్రం మీద వెనక్కి బయకు దేరిపోయి, చేప ఎందుకు నవ్విందో చెప్పేసాడు తండ్రికి. చావు భయంతో చిక్కి శల్యమైన మంత్రిగారికి దాంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన వెళ్ళి, రాజు గారిముందు నిలబడి ధైర్యంగా ఈసంగతి చెప్పేసాడు.

"రాణిగారి అంత:పురంలో మగవాడా!? అసంభవం!"అన్నారు రాజుగారు.

"కానీ అది వాస్తవం, మహారాజా! ఈసంగతి రాణీవారికి కూడా తెలిసి ఉండదు. అంత:పుర స్త్రీలలో దాక్కున్న మగవాడిని పట్టుకోటం కోసం నేనొక పరీక్ష పెడతాను. ఒక పొడవాటి గుంతను త్రవ్వించండి. అంత:పురంలోని స్త్రీలందర్నీ దాని ఇవతలి నుండి అవతలికి దూకమనండి. మగవాడెవరో ఇట్టే తెలిసిపోతుంది" అన్నాడు మంత్రి.

రాజుగారు సరేనని ఒక పొడవాటి గుంత తవ్వించి, అంత:పురంలోని వాళ్ళందర్నీ దానిపైనుంచి దూకమన్నాడు. ఎవ్వరూ దూకలేకపోయారు- ఒక్కరు తప్ప! చూడగా, ఆవ్యక్తి నిజంగానే మగవాడు! ఆవిధంగా రాణి గారికి తృప్తి కలిగింది. రాజుగారు సంతోషపడ్డారు. ముసలిమంత్రికి ప్రాణాలు నిలవటమేకాక, చక్కని బహుమతి లభించింది.

అనతికాలంలోనే మంత్రి కొడుకు రైతు కూతురిని పెళ్ళి చేసుకున్నాడు. తెలివితేటలు, సూక్ష్మ బుద్ధి గల ఆ జంటసంతోషం ఆపైన రాజ్యమంతటా విస్తరించింది!