అనగా అనగా ఒక పల్లెటూరు. అక్కడ ఓ చిన్న పాప. ఆ పాప పేరు లీల. లీలకు పక్షులంటే చాలా ఇష్టం. తోటలో తిరుగుతూ, పక్షుల్ని చూస్తూ, వాటి శబ్దాల్ని అనుకరిస్తూ ఎంత సేపైనా గడిపేసేది. ఒక రోజున ఆ తోటలోకి మూడు వింత పక్షులు వచ్చాయి. ఇంద్రధనసులోని రంగులన్నీ వాటిలో ఉన్నాయి! చాలా వింతగా అనిపించినై, ఆ పక్షులు! వాటిని చూసి, లీల చాలా ముచ్చట పడింది. అవి వాలి ఉన్న పొద దగ్గరకు వెళ్ళింది, నెమ్మదిగా.

ఆశ్చర్యం! అవి మనుషుల భాషలో మాట్లాడుకుంటున్నాయి! నిజానికి అవి దేవ కన్యలట. వాటికి ఇంద్రధనసు అంటే ఎంతో ఇష్టమట. అందుకని, ఒక రోజు వాన లేకున్నా, అవి తమ మాయతో ఆకాశంలో ఇంద్రధనసును సృష్టించి, జారుడు బల్లలాగా దాని మీద ఎక్కి, జారుతూ ఆడుకోసాగాయిట. దాంతో వాన దేవుడికి కోపం వచ్చి "మీకు ఇష్టమైన ఇంద్రధనసు పిట్టలుగా మారిపోండి" అని, పిట్టలుగా మార్చేసి భూలోకానికి పంపించేశాడుట. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని పక్షుల రూపంలో ఉన్న దేవకన్యలు బాధపడుతున్నారు. ఇది విని లీలకు వాటి పైన చాలా జాలి వేసింది.

అ తర్వాత పిట్టలు ఇంకేమీ మాట్లాడలేదు. కాసేపు అలాగే ఎదురు చూసిన లీల, ఇంక ఆగలేక, మెల్లగా పిట్టలను పిలిచింది. వెంటనే అవి మామూలు పిట్టలలానే కూస్తూ అక్కడి నించి ఎగిరి పోబోయాయి. కానీ, లీల "నేను అంతా విన్నాను. మీకు ఏమైనా సాయం చెయ్యగలనా?" అని అడిగేసరికి, "అలా ఇంకొకరి మాటలు వినడం తప్పు కాదా?" అని అడిగాయవి.

లీల అన్నది- "మీరు మనుషులలాగా మాట్లాడుతుంటే కుతూహలం కొద్దీ విన్నాను. మీరు కష్టంలో ఉన్నారని తెలిసి, 'సాయం చెయ్యగలనేమో' అని అడుగుతున్నాను" అంది. అప్పుడా పిట్టలు కాసేపు ఒక దానిని ఒకటి చూసుకుని, "సరే చెప్తాము. చెయ్యగలవేమో చూడు," అన్నాయి.

ఆ పిట్టలు చెప్పిన దాని ప్రకారం, జరగ వలసినది ఇదీ: రోజూ సాయంత్రం పిట్టలు చెప్పిన సమయానికి తోటకు వచ్చి, అవి నేర్పే పాటను నేర్చుకోవాలి లీల. పాటను పూర్తిగా నేర్చుకునేందుకు నెలరోజులు పడుతుంది. అయితే ఆ పాటను ఇంకెవ్వరి ముందూ పాడకూడదు. నెల పూర్తయినాక లీల పాటను వినిపించగానే, పిట్టలు మళ్లీ దేవకన్యలుగా మారిపోతాయి. అయితే ఆ తర్వాత ఇంకెప్పుడూ లీల ఆ పాటను పాడకూడదు. పాడిందంటే వాళ్లు మళ్ళీ పిట్టలుగా మారిపోవాల్సి వస్తుంది!

లీల అలా చెయ్యడానికి ఒప్పుకుంది. పిట్టలు నేర్పిన ఆ పాట ఎంతో బావుంది. ఇంట్లో ఆ పాటను పైకి పాడకుండా ఉండటం కష్టంగానే ఉంది. మొత్తానికి నెల గడిచింది. లీల పాటను పూర్తిగా నేర్చుకుంది. ఇక తను పాట పాడి, పిట్టలకు మళ్ళీ దేవకన్యల రూపం తెప్పించటమే మిగిలి ఉంది.
ఆ రోజున లీల చాలా ఉత్సాహంగా వెళ్ళింది తోటకు. కానీ ఎందుకనో, ఆ రోజున పిట్టలు రాలేదు! లీల అక్కడే కూర్చొని చాలా సేపు ఎదురు చూసింది. చివరికి బాధగా ఇంటికి వెళ్ళింది. అలా వరసగా కొన్ని రోజులపాటు లీల రోజూ తోటకు వచ్చి, పిట్టల కోసం వెతికేది. తను నేర్చుకున్న పాటను మర్చిపోకుండా ఉండాలని, ప్రతిరోజూ ఒంటరిగా పాడుకునేది.

ఒకరోజున వాళ్ళ ఊళ్ళో జాతర జరిగింది. లీల కూడా వెళ్ళింది, జాతర చూసేందుకు. అక్కడ ఒక చోట చాలామంది జనాలు పోగయి ఉన్నారు. లీల కుతూహలం కొద్దీ అక్కడకి వెళ్ళి చూసేసరికి, ఒక పెద్ద పంజరంలో కనిపించాయి ఆ మూడూ పిట్టలూ! పిట్టలని పట్టుకున్న వాడు వాటి చేత మాట్లాడిస్తూ, ప్రదర్శిస్తున్నాడు. జనాలందరూ ఆ వింతను చూసి ఆనందిస్తున్నారు!

లీలకు చాలా బాధ వేసింది. వెంటనే పిట్టలు తనకి నేర్పించిన పాటను గొంతెత్తి పాడడం మొదలు పెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అద్భుతమైన ఆ పాటను విని మైమరచిపోయారు. పాట అయిపోయే సరికి పంజరంలో ఉన్న పిట్టలు కాస్తా మాయమయ్యాయి. పాటను విన్నవాళ్లు కొట్టే చప్పట్లలో పిట్టలవాడి అరుపులు ఎవ్వరికీ వినిపించలేదు. సందడి తగ్గే సరికి అందరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు!

అయితే ఇప్పుడు లీలకి ఇంకొక చిక్కొచ్చి పడింది. ఇంటికి వెళ్ళాక, అందరూ లీలను ఆ పాటే పాడమని బలవంతం చేయసాగారు. వాళ్ళకు లొంగి, చివరికి లీల ఒక్క సారి ఆ పాటను పాడేసరికి, దేవకన్యలు మళ్ళీ పిట్టలుగా మారి, లీల ఉన్న చోటికి వచ్చేసాయి!

లీల వాటిని చూసి చాలా సిగ్గుపడింది. అయితే అవి నవ్వి, " ఏమీ నష్టం జరగలేదులే! మేము వెళ్ళాక వాన దేవుడికి జరిగిందంతా చెప్పాము. అందరి ముందూ పాట పాడవలసి వచ్చినందుకు ఇక లీల మళ్ళీ పాడకుండా ఉండడం కష్టమనీ, అందువల్ల ఆ పాటను లీల ఎప్పుడైనా ఎక్కడైనా పాడుకునేలా ఒప్పుకోమనీ వాన దేవుడిని ప్రాధేయ పడ్డాము. వాన దేవుడు ఒప్పుకుని, ఆ విషయం చెప్పి రమ్మని మమ్మల్ని మళ్ళీ ఇలా పంపించాడు" అని చెప్పాయి!

ఆ సంగతి తెలుసుకొని లీల ఎంతో సంతోషించింది. ఇక తనకు ఎప్పుడు తోస్తే అప్పుడు అద్భుతమైన ఆ పాటను మనసారా పాడుకుంటూ ఉండచ్చు!

అయితే ఎవ్వరికీ తెలీని రహస్యం ఒకటుంది: ఎప్పుడైనా, తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు- లీల గనక ఆ పాట పాడితే, ఇంద్రధనసు పిట్టలు వచ్చి, లీలను అలా ఆకాశంలోకి తీసుకుని వెళ్ళి, మబ్బులలో తిప్పి తీసుకు వస్తాయి!