ఒక ఊళ్లో ధనయ్య అనే షావుకారు ఉండేవాడు. అతని దగ్గర లేని సంపద అంటూ లేదు. అయితే అతను పరమ పిసినారి. ఎడమ చేత్తో కాకిని విదిలించేవాడు కాదు. ఊళ్లో వాళ్ళంతా అతన్ని చాలా అసహ్యించుకునేవాళ్ళు.

ఒక రోజున ధనయ్య వాళ్లతో అన్నాడు "చూడండి, మీరు నన్ను చూసి అసూయ పడుతున్నారల్లే ఉంది- లేకపోతే నేను సంపదను ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు అర్థం కాలేదేమో-నిజం ఆ దేవునికే తెలుసు. అయితే మీరంతా నన్ను ద్వేషిస్తున్నారు- అంతవరకూ నాకు తెలుస్తూనే ఉన్నది. చెప్పేది వినండి- నేను చచ్చిపోయినప్పుడు ఒక్క పైసాకూడా వెంట తీసుకుపోను. నా సంపద మొత్తాన్నీ ఇతరులకే ఇచ్చేసి పోతాను. నన్ను అర్థం చేసుకోండి"అని.

అయినప్పటికీ జనాలు అతన్ని ద్వేషించటం మానలేదు. అతని ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాళ్లు ఎగతాళిగా నవ్వేవాళ్ళు. "మీకేమైంది? నేను చచ్చిపోయాక నా సంపదనంతా మీకే ఇచ్చేస్తానని చెబుతున్నాకూడా నన్ను అలా చిన్న చూపు చూస్తారెందుకు?" అని ధనయ్య ఎంత వాపోయినా జనాలెవరూ అతన్ని నమ్మేవాళ్ళు కాదు.

"నేనేమైనా దేవుడినా? అందరిలాగే నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు పోయేవాడినే. అప్పుడు నా డబ్బంతా నిజంగానే దాన ధర్మాలకు వినియోగింపబడుతుంది. అప్పటివరకూనే గదా, నేను దీన్ని ఎవ్వరికీ ఇవ్వనిది?" అనేవాడు ధనయ్య.

ఒకరోజు సాయంత్రం దుకాణం కట్టేశాక, అతను నడుచుకొని పోతుంటే, గబుక్కున వాన మొదలైంది. ధనయ్య పరుగెత్తి, దగ్గర్లో ఉన్న ఒక చెట్టు క్రింద తలదాచుకున్నాడు. ఆ చెట్టు క్రిందే ఒక ఆవు, ఒక పంది నిలబడి ఉన్నై. అవి ఏదో మాట్లాడుకుంటున్నట్లనిపిస్తే, ధనయ్య వాటి మాటలు వింటూ నిల్చున్నాడు:

పంది అంటోంది, ఆవుతో-"అందరూ నిన్ను మెచ్చుకుంటారు; నన్నెవరూ మెచ్చుకోరు, ఎందుకు? నేను చచ్చిపోయాక నా మాంసం, క్రొవ్వు, నరాలు- చివరికి నా తోలు-వెంట్రుకలు కూడా జనాలకు ఉపయోగపడతాయి. ఇట్లా నా వల్ల అన్నన్ని ఉపయోగాలుంటాయి. మరి, నువ్వు ఇచ్చేది ఒక్క పాలు మాత్రమే- అయినా జనాలు నిన్నెప్పుడూ పొగుడుతుంటారు, నన్నేమో ద్వేషిస్తారు- ఎందుకిలాగ?" అని.

ఆవు దానితో అన్నది- "చూడు, చనిపోయాక నా శరీరం కూడా జనాలకు ఎంతో కొంత ఉపయోగ పడుతుంది. కానీ నేను బ్రతికుండగానే వాళ్లకు పాలను ఇస్తుంటాను. నా దగ్గర ఉన్నదాన్ని పది మంది తోటీ పంచుకోవటం నా నైజం. ఆ గుణాన్ని అందరూ గుర్తిస్తారు. కానీ, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏమీ ఇవ్వవు- నువ్వు చచ్చిపోతే తప్ప, ఎవరికీ నీతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. జనాలు ఎప్పుడూ చూసేది ప్రస్తుతాన్నే. 'ప్రస్తుతం మనం ఎలాంటివాళ్ళం' అన్నదే ముఖ్యం. నువ్వు బ్రతికుండగా చేసే మేలే నీకు అక్కరకు వస్తుంది" అని.

ధనయ్యకు కనువిప్పైంది. ఆ నాటినుండే అతని నైజం మారిపోయింది. అతని పిసినారితనం దూరమైనందుకు ఊళ్లో జనాలు ఎంతో సంతోషించారు. క్రమంగా ధనయ్యకు 'మంచి మనిషి' అని పేరు వచ్చింది!