అనగనగా ఒక ఊరిలో సురేష్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. వాటి కోసం రోజూ ఊరి చివర ఉన్న ఒక తోటలోకి వెళ్ళి, దొంగతనంగా మామిడి పండ్లు కోసేవాడు. వాళ్ల అమ్మ ఎంత వారించినా వినేవాడు కాదు.

ఒక రోజున అలా తోటలోకి వెళ్ళి మామిడి పండ్లు కోస్తుంటే తోట మాలి చూసాడు. వెంటనే పరుగున వచ్చి, కర్ర అందుకున్నాడు. భయపడిన సురేష్ వెంటనే చెట్టునుండి క్రిందికి దూకి పరుగెత్తాడు. తోటమాలి "ఒరే! ఆగరా! నీ పని చెబుతాను!" అని అరుస్తూ అతని వెంట పడ్డాడు.

అలా పారిపోతున్న సురేష్ కు అక్కడ ఒక చెట్టు కింద అందమైన శంఖం ఒకటి కనిపించింది. వాడు పరుగెత్తుతూనే, వంగి దానిని తీసుకొని, సంచిలో‌ వేసుకున్నాడు. ఇంకా పరుగుపెడుతూనే, వెనక వస్తున్న తోటమాలిని చూసి- "ఈ తోట మాలి నుండి తప్పించుకోవడం కోసం నేను మామిడి చెట్టును అయిపోతే ఎంత బాగుంటుందో!" అని అతనికి ఒక ఆలోచన వచ్చింది.

అయితే సురేష్ చేతిలో ఉన్నది మామూలు శంఖం కాదు- మాయా శంఖం! అది ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు, ఏది కోరితే అది జరుగుతుంది! అందువల్ల, అలా కోరుకున్న వెంటనే సురేష్ కాస్తా, నిలబడ్డవాడు నిలబడ్డట్టు- మామిడిచెట్టు అయిపోయాడు! వెంటబడి వస్తున్న తోటమాలి- "అరే! ఆ పిల్లవాడు ఎటు పోయాడు, ఇటే వచ్చాడే?" అనుకొని మరలిపోయాడు. సురేషు కు చాలా సంతోషం వేసింది.

అయితే 'మళ్ళీ మనిషిగా మారేదెట్లా?' అది తెలీని సురేష్ అట్లాగే చెట్టులా నిలబడిపోయి ఉన్నాడు. మరుసటి రోజున యజమాని కూలీలను వెంటబెట్టుకొని, మామిడిపండ్లు కోయడానికి వచ్చాడు. అందరూ మామిడి చెట్లెక్కి కాయలు కోయసాగారు . వాళ్ళు తనమీద కూడా ఎక్కుతుంటే సురేషుకు చాలానొప్పిగా అనిపించింది. తనకున్న పండ్లు కోస్తున్నప్పుడు అతనికి ఇంకా చాలానొప్పి పుట్టింది- "అయ్యో! నేను కాయలు కోసినప్పుడు ఈ చెట్లకి ఎంత నొప్పి కలిగించానో!" అనుకున్నాడు చెట్టుగా మారిన సురేష్.

మామిడి పండ్లు తీసుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు- సురేష్ చెట్టుగా అలా ఒంటరిగా నిలబడి ఉన్నాడు. చీకటి పడుతోంది. -ఆ సమయంలో‌ ఒక ముసలాయన అటుగా పోతూ, చెట్టుగా మారిన సురేష్ క్రింద నిలబడి, అక్కడ కనబడ్డ శంఖాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అయితే ఆ ముసలాయనది వేరే ఊరు. "నాకు దార్లు సరిగ్గా తెలీవు- తెలిసినవాళ్ళు ఎవరైనా నాకు తోడుగా వస్తే బాగుండును కదా?" అనుకున్నాడాయన. శంఖం ప్రభావంవల్ల మామిడి చెట్టు రూపంలో ఉన్న సురేష్ కు వెంటనే మానవ రూపం వచ్చేసింది. అతను ఆ ముసలాయనికి తోడుగా వెళ్ళి, శంఖాన్ని తిరిగి సంపాదించుకున్నాడు.

మరునాడు తోటకు వచ్చిన సురేషుకు దొంగతనం చేయబుద్ధి కాలేదు. ఆ సమయంలో అక్కడ తోటమాలి లేడు. "నేనే గనక తోటమాలినైతే- ఎవ్వరికీ దొంగతనం చేయవలసిన అవసరం రాదు- నేనే స్వయంగా అందరినీ‌ పిలిచి మామిడి పండ్లు ఇచ్చేవాడిని! " అనుకున్నాడు సురేష్ . అంతే!- మరుక్షణం‌ నుండీ అతనే తోట మాలి అయ్యాడు!

ఆనాటి రాత్రి సురేష్ తోటమాలి అక్కడ పడుకొని హాయిగా నిద్రపోతున్నాడు- అతని రాత కొద్దీ, ఆరోజే అర్ధ రాత్రి సమయంలో దొంగలు వచ్చి పడ్డారు. తోటలో‌ మిగిలిన మామిడి పండ్లన్నీ దొంగలు కోసుకెళ్ళారు.

ఉదయం ఇంకా సురేష్ నిద్ర లేవకనే వచ్చాడు, యజమాని. వచ్చీరాగానే అక్కడ తోటమాలి ఒళ్ళు మరిచి నిద్రపోతూ కనిపించాడు! "మామిడి పండ్లు దొంగలెత్తుకెళ్తుంటే చూస్తూ‌ ఊరుకుంటావా?" అని యజమాని వాడిని లేపి, రెండు తగిలించాడు .

సురేష్ తోటమాలికి దిక్కు తెలీలేదు. ఏదో- 'తోటమాలి పని బాగుంటుంది' అనుకున్నాడు గానీ, దానిలో ఇట్లాంటి కష్టాలుంటాయని అనుకోలేదు అతను. దొంగగా పండ్లు కోసుకెళ్ళడం వల్ల యజమానికి నష్టం- తోటమాలికి చాలా చెడ్డపేరు వస్తుంది; అంతేకాక మామిడి చెట్టూ చాలా బాధ పడుతుంది! దొంగతనం వల్ల ఎంత మందికి కష్టమో తెలుసుకొన్నాక సురేష్ ఇక దొంగతనం చేయడం మానేశాడు. అటుపైన అతను 'మంచి పిల్లవాడు' అని పేరు తెచ్చుకున్నాడు!