జయంకొండ అనే పల్లెటూరు పచ్చని పొలాలలో, పైరు పంటలతో చాలా అందంగా, చూడముచ్చటగా ఉండేది. ఆ పల్లెలో రవి అనే‌ పేద పిల్లవాడొకడు, 10వ తరగతి చదువుతూ ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి తెలివితేటలు, ఆలోచనా శక్తి, పట్టుదల చాలా ఎక్కువ. కొత్తగా ఏదో చేయాలని తపన, చదువంటే ఆసక్తి, శ్రద్ధ ఉండేవి. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉండేది.

'తను 10వ తరగతి పాసై, పెద్ద పెద్ద చదువులు చదివి ఓ గొప్ప శాస్త్రవేత్త కావాల'ని కలలు కనేవాడు రవి. అదే విషయాన్ని అతను ఒక రోజున వాళ్ళ నాన్నకు చెప్పాడు- కానీ వాళ్ళ నాన్న "బాబూ! మనకు పై చదువులు చదివే స్థోమత లేదు. నీ చదువు ఇంతటితో ముగించి, మాతో బాటే కూలికి వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించు" అన్నాడు.

రవి మనసు విరిగినట్లైంది. అయినా అతను నిరాశ చెందలేదు. వాళ్ళ అమ్మను అడిగితే ఆమె "నాయనా! చదువు నీకు అంత ఇష్టమైతే- చదువుకో. ఇల్లు తాకట్టు పెట్టయినా నిన్ను చదివిస్తాను" అని చెప్పింది.

ఆరోజు రాత్రి రవికి నిద్ర పట్టలేదు. "చదువు మానేద్దాంలే" అనిపించింది. "తల్లిదండ్రులను అంత కష్టపెడుతూ చదివేదెందుకు?" అనుకున్నాడు.

అంతలో అతనికి తాను చదివిన పాత పుస్తకంలోని సాలెపురుగు కథ గుర్తుకు వచ్చింది. ఆ కథలో ఒక సాలెపురుగు చెట్టును ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతిసారీ తన ప్రయత్నంలో విఫలమవుతుంది. అయినా పట్టుదలతో మళ్ళీ ఎక్కేందుకు ప్రయత్నం చేస్తూ పోతుంది. తన ఆత్మబలాన్ని కోల్పోదు. అనేక ప్రయత్నాల తరువాత, చాలా కష్టపడి, చివరికి చెట్టు పైకి చేరుకుంటుంది. తను కూడా ఆ సాలెపురుగు లాగే తన కల నిజం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు రవి.

"అమ్మ, నాన్నలను ఇంతగా ఇబ్బంది పెట్టి చదవటం కంటే, ఈ సంవత్సరం నేను కూడా వాళ్లతోపాటు కూలికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాను. తరువాతి సంవత్సరం నుంచీ చదువుకుంటానులే" అని రవి నిర్ణయించు-కున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే మరునాటి నుండీ కూలి పనికి వెళ్ళసాగాడు. అదే సమయానికి కూలి రేట్లు పెరిగాయి. రవి రోజుకు వంద రూపాయల వరకూ సంపాదించగల్గాడు! నెల తిరిగేసరికి, మూడు వేల రూపాయలు కూడబెట్టగల్గాడు. తరువాతి నెలకు మరో మూడు వేలు! శలవలు పూర్తయ్యేసరికే రవి దగ్గర ఆరువేల రూపాయలు జమ అయ్యాయి!!

"ఈ డబ్బుతో నేను ఇంటర్ చదువుకుంటాను. ఉదయం వేళల్లో పేపరు వేస్తే కొన్ని డబ్బులు వస్తాయి. వాటితో నెల ఖర్చులు గడుస్తాయి" అనుకున్నాడు రవి.

అయితే అనుకోకుండా అతనికి అదృష్టం కలిసి వచ్చింది: పదవతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అతనికి ప్రభుత్వ కళాశాలలో సీటు దొరికింది! అలా పై చదువులకు మార్గం సుగమమైంది. ప్రతి సంవత్సరమూ శలవలు ఇచ్చినప్పుడు రవి ఏదో ఒక పని చేసి, ఖర్చులకు అవసరమయ్యేన్ని డబ్బులు సంపాదించు-కునేవాడు.

ఈ విధంగా కష్టపడి చదివిన రవి ఇప్పుడు శాస్త్రవేత్త కాబోతున్నాడు- తను అనుకున్న లక్ష్యానికి అతనిప్పుడు చేరువలో ఉన్నాడు. మనందరికీ అతను ఆదర్శం కావాలి. శ్రద్ధ, పట్టుదల ఉంటే వేటినైనా సాధించవచ్చు.