అనగా అనగా కళింగ రాజ్యాన్ని విజయ వర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే వాడు. కానీ ఆయనకు ఒకటే చింత. సంతానం లేదు. సంతానం కోసం రాజు-రాణి నోచని నోము లేదు, తిరగని చోటు లేదు. చివరకు ఒక సన్యాసి "నువ్వు మహారాజువు. రాజన్నవాడు స్వార్థాన్ని పక్కన పెట్టి, ప్రజలకోసం జీవించాలి. నువ్వు ఇలా సమయాన్ని వృధా చేసుకోనవసరంలేదు. నీ పరిపాలనను నువ్వు సరిగా చేస్తే, నీ కుటుంబ బాధ్యతను ఆ భగవంతుడు తీసుకుంటాడు" అని ఉపదేశించాడు.

రాజు రాణి వెనక్కి తిరిగి వచ్చేసరికి, రాజ్యంలో తెలీని అంటువ్యాధి ఒకటి ప్రబలింది. ఒక్కరొక్కరుగా ప్రజలు అందరూ చనిపోసాగారు. రాజ్యంలోని వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండింది. రాజుగారు వైద్యుల సమావేశం ఏర్పరచి, రోగానికి నివారణను సూచించమన్నాడు.

వైద్యులు అన్నారు -"ప్రభూ! ఇది చాలా విచిత్రమైన వ్యాధి. ఇది నయం అవ్వాలంటే 'అమృత వల్లి' అనే మూలిక కావాలి. కానీ ఆ మూలిక అన్ని చోట్లా దొరకదు. భయంకర నిశారణ్యంలో ఉంటుంది అది. ఆ అరణ్యంలో ఒక రాక్షసుడు ఉంటాడు. అతను చాలా క్రూరుడు. ఆ అరణ్యం లోపలికి వెళ్ళిన మానవుడెవ్వడూ ఇంతవరకు బయటికి రాలేదు. సాహసయోధులెవరైనా ఆ రాక్షసుడిని చంపి, మూలికను ఏ కొంచెం తెచ్చినా సరే, మన రాజ్యంలోని ప్రజలందరికీ శాంతి లభించగలదు. ఇది తప్ప మాకు వేరే మార్గం ఏదీ తోచటం లేదు" అని.

వెంటనే విజయవర్మ రాజ్యమంతటా దండోరా వేయించాడు- "నిశారణ్యంలోకి వెళ్ళి 'అమృత వల్లి'మూలికను ఎవరైతే తెస్తారో, వాళ్లకు వెంటనే రాజ్యంలో సగభాగం దక్కుతుంది. అంతేకాక వాళ్లే రాజ్యానికి వారసులుగా గుర్తింపబడతారహో!" అని.

ఈ ప్రకటనను విని ఎంతో మంది వీర యువకులు నిశారణ్యానికి వెళ్ళారు. కానీ అలా వెళ్ళిన వాళ్లలో ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. సమయం గడిచే కొద్దీ రాజ్యంలో‌ వ్యాధి ప్రబలుతున్నది.

ఇదంతా చూసి విజయ వర్మకు సన్యాసి బోధన గుర్తుకు వచ్చింది. అతను భార్యతో "రాణీ! కాలం గడిచిపోతున్నది- కానీ అమృతవల్లి దొరకటం లేదు. వెతికేందుకు వెళ్ళిన వీరయోధుల జాడ తెలియటం లేదు. ఇక నేనే స్వయంగా వెళ్ళి, ఆ మూలికను తీసుకు వస్తాను" అన్నాడు. రాణి అతన్ని వారించింది. కానీ విజయవర్మ పట్టు వీడలేదు. "రాణీ! ప్రజలు సుఖంగా లేనప్పుడు రాజు సుఖంగా ఉండడు. 'ప్రజల్ని రాజు పట్టించుకుంటే, రాజును భగవంతుడు పట్టించుకుంటాడు' అని గురువాక్యం- గుర్తులేదా? ఇది ఆ భగవంతుడు మనకు పెడుతున్న పరీక్ష అనుకుందాం" అని చెప్పి, ఆమెను ఒప్పించాడు.

తన వెంట ఒక తెల్ల గుర్రాన్ని తీసుకొని, అందరూ నిద్రపోయేంత వరకూ ఆగి, అప్పుడు తన ప్రయాణం మొదలుపెట్టాడు. గుర్రాన్ని తూర్పు దిశగా పోనిచ్చాడు. సూర్యోదయం కావస్తున్నది. విజయవర్మ నేరుగా నిశారణ్యాన్ని చేరుకొని, గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి, మూలికను వెతుకుతూ తిరుగసాగాడు. అల్లంత దూరంలో రాక్షసుడు తపస్సు చేస్తూ కనిపించాడు.

రాజుకు ఆశ్చర్యం వేసింది. "రాక్షసులు దుర్మార్గులంటారు కదా, ఇలా తపస్సు చేస్తున్న వీడు, రాక్షసుడు అయి ఉండడు- ఈ అడవిని కాపాడే ఏ వనదేవతో ఈ రూపంలో కనబడుతున్నట్లుంది" అనుకున్నాడు. వనదేవతలపైకి కత్తిని ఎత్తకూడదు- కనుక రాజు ఆ రాక్షసుడి ముందుకు వెళ్ళి నిర్భయంగా కూర్చున్నాడు. ఇంతలో రాక్షసుడు "నరవాసన- నరవాసన!" అంటూ కళ్ళు తెరిచాడు. వికృతంగా నవ్వుతూ "నీకెంత ధైర్యంరా!? ప్రాణాల మీద ఆశ ఉన్నట్లు లేదు. ఏకంగా నాముందుకే వచ్చి కూర్చున్నావు!?" అన్నాడు.

అప్పుడు రాజు వినయంగా "అయ్యా! ఈ వనంలో అమృత వల్లి అనే మూలిక ఒకటి ఉన్నదట. ఆ మూలిక సర్వరోగాలనూ హరిస్తుందట. నేను ఈ రాజ్యానికి రాజును. మా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆ మూలిక తప్ప వేరే దారి లేదు. దయచేసి ఆ మూలికను నాకు ఇవ్వండి" అన్నాడు.

"ఓహో! నువ్వేనా, రాజువు!? ఇంతమంది ప్రాణాలతో‌ఆడుకున్నావే? వీరులట, వీరులు- నాముందు ఎవ్వరి శక్తులూ పనిచెయ్యవు- మూలికకోసం వచ్చినవాళ్ళందరూ నా పాలబడ్డారు. ఇప్పుడు ఇక నీవంతు వచ్చింది. నాకు బాగా‌ ఆకలిగా ఉంది. సరైన సమయానికే వచ్చావు!" అన్నాడు రాక్షసుడు అడుగు ముందుకు వేస్తూ.

"అయ్యా! మా ప్రజలకు మూలిక చాలా అవసరం. దాన్ని ఎలాగైనా సాధించే బాధ్యత, రాజుగా- నాదే. మీరు నన్ను నమ్మి, దాన్ని నాకు ఇవ్వండి. కావాలంటే, దాన్ని మా రాజ్య ప్రజలకు ఇచ్చి, తిరిగి వచ్చాక మీకు ఆహారమౌతాను" అన్నాడు విజయవర్మ.

రాక్షసుడు నవ్వి "నీ మాటలు నేను నమ్మాలా !?"అన్నాడు వెటకారంగా. అయినా రాజు ఓపికగా తను చెప్పాల్సింది తను చెబుతూ వచ్చాడు. చివరికి రాక్షసుడు ఒప్పుకున్నాడు- "నీకు కేవలం 5గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ లోపు నువ్వు తిరిగి రాకపోతే నీ రాజ్యంలోని ప్రజలందరినీ తినేసి, నీ రాజ్యాన్ని నాశనం చేస్తాను" అని బెదిరించి, తానే స్వయంగా మూలికను తెచ్చి రాజుకు ఇచ్చాడు.

విజయవర్మ వెంటనే ఆ మూలికను తీసుకొని వెళ్ళి, రాజ్య వైద్యులకు ఇచ్చాడు. జరిగిందంతా తన భార్యకు చెప్పి, "మనకు ఎలాగూ సంతానం లేదు. నేను ఆ రాక్షసుడికి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అడవికి వెళ్ళవలసి ఉంది. నువ్వు రాజ్యానికి ఉత్తరాధికారిగా తగినవారిని నియమించి, ఆ తరువాత వనాలకు పో" అని వేగంగా నిశారణ్యం చేరుకున్నాడు.

రాక్షసుడు అక్కడే రాజు కోసం‌ ఎదురు చూస్తున్నాడు. విజయవర్మ అతన్ని చేరుకొని, అతను తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు చెప్పి, "ఇప్పుడు మీరు నన్ను భుజించండి, నేను సిద్ధం"అన్నాడు.

ఆ మాటలు వినగానే రాక్షసుడు బిగ్గరగా నవ్వాడు. "రాజా! మీ మనుషులు అడవుల్ని అనేక రకాలుగా నాశనం చేస్తున్నారు. ఆరోగ్యాల్ని ప్రసాదించే మూలికలపేరుతో కూడా అడవుల్ని కొల్లగొడుతున్నారు. దుష్ట మానవులనుండి అడవుల్ని కాపాడేందుకు, మేం- వనదేవతలం- ఇలా రాక్షసుల లాగాను, పులులు-సింహాల రూపంలోను తిరుగాడుతూ ఉన్నాం- కనీసం మమ్మల్ని చూసి భయపడి అయినా, మనుషులు అడవుల్ని వాటి మానాన వాటిని ఉండనిస్తారేమోనని! నువ్వు చక్కని రాజువు. నీలాంటి మంచిరాజులు వనసంరక్షణకు నడుం బిగిస్తే, మాకు పని తగ్గుతుంది. ఏమంటావు?" అన్నాడు.

విజయవర్మ అందుకు ఒప్పుకున్నమీదట, అంతకుముందు తను బందీలుగా ఉంచుకున్న వీరయోధులనందరినీ వదిలిపెట్టి, రాక్షసుడు అంతర్ధానం అయిపోయాడు. తిరిగి వచ్చిన విజయవర్మను, వీరయోధులను చూసి రాజ్యప్రజలందరూ ఎంతో సంతోషించారు. రాజు వనదేవతకు ఇచ్చిన మాటను నిలిపేందుకు గాను, వాళ్లంతా ఆ రోజునుండే వనసంరక్షణకు పూనుకున్నారు.

ఆపైన కళింగ రాజ్యం అంతటా చెట్లు,చేమల రూపంలో‌ ఆరోగ్యం వెల్లివిరిసింది. త్వరలోనే రాణికి పండంటి బిడ్డడు కూడా పుట్టాడు!