అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రంగాపురం. ఆ ఊరి బయట ఒక అందమైన అడవి ఉండేది. రంగాపురంలో రాజు అనే పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు. రాజు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. రాజు, అతని తల్లిదండ్రులు అందరూ సంగీతం అంటే చెవి కోసుకునేవాళ్ళు. రంగాపురానికి ఎలాంటి సంగీత కళాకారులు వచ్చినా, వాళ్లంతా తప్పనిసరిగా పోయి ఆ సంగీతం వినేవాళ్ళు.

ఒకరోజున రాజు బడినుండి వస్తుంటే రోడ్డుమీద జనాలంతా గుమిగూడి సంతోషంగా అరుస్తుండటం‌ కనబడింది. 'ఏమిటా' అని అతను కూడా పోయి చూశాడు. అక్కడ, రాజు అంతే ఉన్న పిల్లవాడొకడు, పిల్లనగ్రోవి ఊదుతూ సంతోషంగా నాట్యం చేస్తున్నాడు. ఊళ్ళో ఉండే కుర్రవాళ్ళు కొందరు వాడితో కలిసి పాడుతూ, గంతులు వేస్తున్నారు. రాజుకు వాడి సంగీతం చాలా నచ్చింది. వాడు అక్కడే నిలబడి ఆ కార్యక్రమం ముగిసేంతవరకూ చూశాడు. కార్యక్రమం అవ్వగానే జనాలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి వెనుతిరిగారు. కొందరు ఆ పిల్లవాడి మీదికి కొన్ని డబ్బులు విసిరారు. అందరూ వెళ్ళిపోయాక, ఆ పిల్లవాడు వంగి, నేల మీది డబ్బులు ఏరుకోసాగాడు.

అప్పుడు గానీ రాజుకు సమయం గుర్తుకు రాలేదు. ఆ సరికే చీకటి పడవస్తున్నది. రాజు గబుక్కున ఇంటికి పరుగు తీశాడు. ఇంట్లో హోంవర్కు చేస్తున్నాడు గానీ, వాడి మనస్సులో పిల్లన గ్రోవి మ్రోగుతూనే ఉన్నది. ఆరోజు తాను ఎంత గొప్ప సంగీతం విన్నాడో వాడు వాళ్ళ అమ్మా-నాన్నలకు చెప్పి, మురిసిపోయాడు.

మరునాడు ఆదివారం. రాజు వాళ్ళ అమ్మ వాడిని అడవికి పోయి కట్టెపుల్లలు ఏరుకు రమ్మన్నది. రాజుకు అడవి అంటే చాలా ఇష్టం. అడవిలో‌ఒక మూలన అందమైన వాగు ఒకటి ఉన్నది. వాడు కట్టెలు ఏరేందుకు వెళ్ళినప్పుడల్లా ఆ వంకలోకి దిగి, ఈతకొట్టనిదే వెనక్కి రాడు. ఆ రోజున వాడు అడవిలోకి వెళ్ళగానే వంక దగ్గరినుండి చక్కని పిల్లనగ్రోవి పాట వినబడ్డది. రాజు సంతోషంగా ఆ వైపుకు పరుగు తీశాడు.

పిల్లనగ్రోవి పాట బరువుగా ఉన్నది. ఆ దు:ఖపు పాటను వాయిస్తున్నది, రాజు అంతకు ముందు చూసిన పిల్లవాడే. రాజు వాడి దగ్గరికి వెళ్ళి పాటను సాంతం విన్నాక, ఆ పిల్లవాడిని మెచ్చుకొని, వాడి పేరు అడిగాడు. వాడు తన దగ్గరున్న తెల్లకాగితంపైన 'గోవిందు' అని రాసి చూపాడు. రాజు ఏ ప్రశ్నలు వేసినా వాడు జవాబుల్ని రాసి చూపించాడు- గోవిందు మూగవాడు, మరి!

గోవిందుకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరనీ, చక్కగా చదువుకునేవాడనీ, అయినా ఆరవ తరగతి మధ్యలో చదువు ఆపేయవలసి వచ్చిందనీ, బంధువులు పట్టించుకోలేదనీ, బ్రతుకు తెరువుకోసం ఇలా పిల్లన గ్రోవిని ఊదుకుంటూ కాలం గడుపుతున్నాడనీ తెలుసుకున్నాడు రాజు.

కొంచెం సేపు ఆలోచించి, రాజు వాడిని వెంటబెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. రాజు తల్లిదండ్రులు గోవిందు పిల్లనగ్రోవి పాటను విని పరవశించి పోయారు. వాడి కష్టాన్ని చూసి చలించిపోయారు. "రాజుతో బాటు గోవిందునీ పెంచుకుందాం. ఏమున్నది?” అనిపించింది వాళ్ళకు.

అదే సంగతిని వాళ్ళు రాజుతోటీ, గోవిందుతోటీ అంటే, గోవిందు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆనాటినుండి గోవిందు రాజుతోబాటు బడికి వెళ్ళటం మొదలు పెట్టాడు. రాజు గోవిందు దగ్గర పిల్లనగ్రోవి ఊదటం నేర్చుకున్నాడు. ఇద్దరూ చక్కగా చదివి, డాక్టర్లయ్యారు. తమను కలిపిన పిల్లనగ్రోవిని వాళ్ళిద్దరూ ప్రతిరోజూ సాధన చేస్తూనే ఉన్నారు, ఇంకా!