అనగనగా ఒక టేబుల్ ఉండేది. ఆ టేబుల్ మీద ఒక పుస్తకం ఉండేది.

పుస్తకం చాలా చాలా మంచిది. పెన్సిల్ మాత్రం చాలా కచ్చిది. అందంగా, చక్కగా ఉండే పుస్తకం అంటే దానికి చాలా కుళ్ళు. పుస్తకాన్ని అది ఎప్పుడూ హింసిస్తూండేది- దాన్ని ఎలా బాధ పెడదామా అని కుతంత్రాలు పన్నుతూ ఉండేది. అందమైన పుస్తకంమీద అసహ్యంగా పిచ్చి గీతలు గీసేయటం అన్నా, పుస్తకానికి నొప్పి పుట్టేట్లు గట్టిగా గీయటం అన్నా పెన్సిలుకు చాలా సరదాగా అనిపించేది.

ఒక రోజున పుస్తకం పెన్సిల్ తో అన్నది: "పెన్సిలన్నా,పెన్సిలన్నా! నువ్వు నామీద ఇట్లా గీసి నన్ను పాడు చేయవద్దు. అట్లా గీసేస్తే నేను చాలా గలీజుగా కనిపిస్తాను. అప్పుడిక నేను చూసేందుకు బాగుండను కదా?!” అది వినగానే పెన్సిల్ కి ఇంకా ఎక్కువ రోషం వచ్చి పుస్తకం మీద అనవసరంగా గీయడం మొదలు పెట్టింది. తట్టుకోలేని పుస్తకానికి ఏడుపు ఆగలేదు.

పుస్తకం ఇట్లా ఏడుస్తూ ఉంటే దగ్గర్లోనే ఉన్న రబ్బర్ దాన్ని చూసి జాలిపడింది. వెంటనే అది ఒక్క దూకు దూకి పుస్తకం మీదికి ఎక్కి కూర్చున్నది. పెన్సిల్ గీసిన చెత్త గీతలన్నిటినీ అది త్వరత్వరగా తుడిపెయ్యటం మొదలు పెట్టింది. పుస్తకానికి చాలా సంతోషం వేసింది.

రబ్బర్ చేస్తున్న పనిని చూసి పెన్సిల్ కి చాలా రోషం వచ్చింది. అది మరింత వేగంగా గీయటం మొదలు పెట్టింది.

అది ఏం గీసినా రబ్బర్ దాన్నంతా తుడిపేస్తున్నది. ఎంత వేగంగా గీసినా రబ్బర్ దానికంటే పది రెట్ల వేగంతో తుడిచేస్తూ పోతున్నది. ఇదంతా ఓ పెద్ద యుద్ధంలాగా జరుగుతోంది.

రాను రాను పెన్సిలుకు ఉక్రోషం పెరిగిపోతున్నది. "నేను సున్నితంగా , మామూలుగా ఏది రాసినా రబ్బరు దాన్ని తుడిచేస్తున్నది. అయితే నేను గానీ గట్టిగా, ఒత్తిపెట్టి, పుస్తకం చినిగేటట్లు రాస్తే- అప్పుడిక అది ఏం చేయగలదు?" అనుకున్నదది.

పైకి రబ్బరుతో, అది "అంత పని చేస్తావా , నువ్వు? అయితే ఇప్పుడు చూడు!' అని, చాలా కోపంతో, పుస్తకం చినిగిపోయేట్లు గట్టిగా ఒత్తిపెట్టి, ఒక గీత గీయబోయింది.

ఏమైందనుకుంటున్నారు? 'టక్' అని శబ్దం వచ్చింది. గట్టిగా ఒత్తి రాయబోయిన ఆ పెన్సిల్ ములుకు కాస్తా విరిగి క్రింద పడిపోయింది.

ములుకుతోబాటు పెన్సిలు అహంకారమూ విరిగింది. ఏమీ చేయలేక, అది సిగ్గుతో తల వంచుకుంది. అప్పటివరకూ పెన్సిలు గీసిందంతా తుడిపేస్తున్న రబ్బరు కూడా ఆ పనిని ఆపి కిసుక్కున నవ్వింది.

ఆ తరువాత పెన్సిల్ నిజంగా మారిపోయింది. అనవసరంగా అది పుస్తకం మీద ఒక్క గీతకూడా గీయటం లేదు. ఏది రాసినా అందంగా, ఇంపుగా, వరసగా రాస్తున్నది. చక్కని బొమ్మలు గీస్తున్నది. పుస్తకానికి చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు పెన్సిలూ, పుస్తకమూ, రబ్బరూ మంచి స్నేహితులైపోయాయి!