ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఊరికి దూరంగా ఆ రైతుకు ఒక చిన్న పొలం ఉండేది. అతను అందులో కూరగాయలు వేసేవాడు.ఒకసారి రైతు ఆకుకూరలు వేసి, వాటి చుట్టూ ముళ్ల కంపలు నాటాడు. ఒక రోజున ఒక కుందేలు వచ్చి, ఆకుకూరలు తిన్నది. రైతు పొద్దున్నే వచ్చి చూసే సరికి, 'పొలంలోకి ఏదో జంతువు వచ్చి మేసి పోయింది' అని తెలిసింది- కానీ అది ఏ జంతువో మాత్రం తెలీలేదు.

ఎలాగైనా దాన్ని పట్టుకోవాలనుకున్నాడు రైతు. అందుకని కొన్ని త్రాళ్ళను తెచ్చి వల పన్ని పెట్టాడు పొలంలో. కానీ ఆ రోజు రాత్రి చేన్లో మేసేందుకు పోయిన కుందేలు ఆ ఉర్లను చూసి, "ఓహో! నన్ను పట్టుకోవడానికి వల పన్నాడన్నమాట, రైతు! నేను దొరుకుతానా!?" అని వెనక్కి వెళ్లిపోయింది.

రైతు ప్రొద్దునే ఉత్సాహంగా పొలానికి పోయి చూస్తే, ఉర్లు ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నై. వాటిలో ఏమీ చిక్కుకోలేదు! దాంతో అతని పట్టుదల పెరిగిపోయింది. ఈసారి అతను ఆ ఉర్లు కనబడకుండా వాటి మీద గడ్డి కప్పి పెట్టాడు.

ఆరోజు సాయంత్రం ఎప్పటిలాగే రైతు పొలంలోకి వచ్చిన కుందేలు "అహ్హహ్హ! ఒక్క రోజుతో రైతు పనైపోయింది, చూడు!" అనుకుని సంతోషంగా గెంతుతూ పరుగులు తీసి- చివరికి ఆ ఉచ్చులో చిక్కుకున్నది.

ప్రయత్నం చేసిన కొద్దీ దాని కాళ్లచుట్టూ త్రాళ్ళు బిగుస్తున్నాయి తప్ప, అది మాత్రం వలలోంచి తప్పించుకోలేకపోయింది. తెల్లవార వస్తూన్నది. రాత్రంతా పెనుగులాడిన కుందేలు ఇప్పుడు భయంతో కుదేలైంది- ఎంత ప్రయత్నించినా ఫలితం సున్న! తెల్లవారేసరికి అది పూర్తిగా అలిసిపోయింది. నిస్త్రాణంగా, నిశ్చలంగా, ఉండిపోయింది.

కొంత సేపటికి అటుగా వెళ్తున్న నక్క ఒకటి కనబడింది దానికి. అంతకుముందు అనేకసార్లు ఆ నక్క కుందేలును తినేందుకు ప్రయత్నించి భంగపడి ఉన్నది- దాన్ని చూడగానే కుందేలుకు ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లైంది. అది దీన్ని చూసేముందుగానే కుందేలు అరిచింది ఉత్సాహంగా- "నక్క మామా! నక్క మామా! ఎక్కడికి, వెళ్తున్నావ్?"అని. ఏదో ఆలోచించుకుంటూ, పరిసరాలను గమనించకుండా పోతున్న నక్క ఒక్క సారి ఆగి- "ఏంరా, అల్లుడూ! మా స్నేహితుడి పెళ్ళికని వెళ్తున్నాను" అని బదులిచ్చింది. ఆపైన అది చుట్టూ చూసి, "నువ్వేంటి, అట్లా ఆ గడ్డిలో కాళ్ళు పెట్టుకొని కూర్చున్నావు కులాసాగా, పనులేమీ‌లేవా?" అని అడిగింది.

"అయ్యో, నక్కమామా! నీకు గడ్డి కనబడుతోంది తప్ప, ఇక్కడున్న ఈ ఉరులు కనబడుతున్నట్లు లేదు- ఈ త్రాళ్ళలో కాళ్ళు పెట్టి పన్నెండు గంటలపాటు కూర్చుంటే కాళ్ల నొప్పులు పోతాయి. నేను తప్పిస్తే, మా వాళ్ళు అందరూ ఇప్పటికే దీన్ని వాడుకుని అంతగా చెంగు చెంగున గంతులు వేస్తున్నారు. ఇకనైనా నేను నా కాళ్లనొప్పులు పోగొట్టుకోకపోతే ఊరుకోమన్నారు అందరూ. అందుకని, నిన్న రాత్రినుండీ ఈ ఉర్లలోనే కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను" అన్నది కుందేలు.

నక్కకు ఆశ పుట్టింది. "ఒరేయ్, అల్లుడూ! నాకు కూడా విపరీతమైన ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నాయిరా! ఈ త్రాళ్ళతో అవి పోతాయంటావా?" అని అడిగిందది.

"ఓ, పోకేమి? నొప్పులు, కాళ్ళు అన్నీ పోతాయి- అయితే వీటిలో‌కాళ్ళు పెట్టుకొని కనీసం‌పన్నెండు గంటలు కూర్చోవాలి కదలకుండా. అది నీవల్ల ఎక్కడౌతుందిలే నక్క మామా!" అన్నది కుందేలు గడుసుగా.

"అయ్యో, అట్లా అనకు అల్లుడూ, నీకు తెలీదు- నేనెంత పట్టుదల గలదాన్నో! నీ తర్వాత ఈ‌త్రాళ్ళు ఇక నావే" అని నక్క కుందేలును ఉచ్చు నుండి తప్పించి, వాటిని తన కాళ్ళకు వేసుకుని కూర్చున్నది. తప్పించుకున్నది ఆలస్యం కుందేలు అక్కడి నుండి పారిపోయింది.

ఇక తెల్లవారుతూనే వచ్చి చూసిన రైతుకు తను పన్నిన ఉరుల్లో కులాసాగా కూర్చున్న నక్క కనబడింది. "అరే, ఇదేమి, ఉరుల్లో ఏ జింకో, కుందేలో చిక్కుకుంటుందని నేననుకుంటే, ఈ నక్క ఇక్కడ ఏంచేస్తున్నట్లు? ఇదిగానీ కాయగూరలు తిన మరగలేదు గద!" అని, రైతు ఓ బలమైన కర్రను తీసుకొచ్చి, నక్కను చితకబాదాడు!

దాంతో‌ కుందేలుకు నక్క బాధకూడా తప్పింది!