గోడమీద చెడిపోయిన గడియారం ఒకటి వేళ్ళాడుతున్నది.
రామారావు: ఏంరా, సుబ్బారావూ! ఆ గడియారం ఆడదా?
సుబ్బారావు: ఏమోరా, నాకూ తెలీదు సరిగ్గా. అది ఆడదో-మగదో. ఇంతకు ముందైతేమాత్రం ఎన్నడూ పిల్లల్ని పెట్టలేదు మరి!
('బాల', 1945 నవంబరు.)

ఒకే వరస!

టీచర్: రామూ! దశరధునికి ఎందరు కొడుకులు?
రాము: నలుగురు సార్!
టీచర్: (ఉత్సాహంగా) గుడ్! మరైతే వాళ్ళెవరో చెప్పెయ్, వరసగా!
రాము: నాకు తెలుసు సార్! మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు!
('బాల', 1945డిసెంబరు.)

సత్కార్యం!

రామువాళ్లు ఐదుగురు బడికి ఆలస్యంగా వచ్చారు.
మాష్టారు: ఒరేయ్ ఎందుకురా, ఇంత ఆలస్యం?
రాము: ఓ పండు ముసలాయన్ని రోడ్డు దాటించి వచ్చేసరికి లేటయింది సార్!
మాస్టారు: శభాష్! మంచి పనే చేశారు. కానీ ఒక్క ముసలాయన్ని రోడ్డు దాటించడానికి ఐదుగురు ఎందుకు?
పిల్లలు: మరేం చేయమంటారండీ! రోడ్డు దాటడానికి ఆ తాత ఎంతకీ ఒప్పుకోలేదు. ఐదుగురం కలిస్తేగానీ ఆయన్ని దాటించటం కుదర్లేదు సార్!

ఇబ్బంది!

మాష్టారు: ఒరేయ్ రామూ, అశోకుడు బాటకు ఇరుపక్కలా చెట్లను నాటించాడు. ఎందుకో చెప్పగలవా?
రాము: బాటకు మధ్యన నాటిస్తే ఇబ్బందవుతుందని కావచ్చు సార్..

యమ్మెస్ విండోస్!

కొడుకు: నాన్నా! రామూ వాళ్లింట్లో MS విండోస్ వాడుతున్నారట
తండ్రి: మనమే నయంగదరా! మనింట్లోవన్నీ అల్యూమినియం విండోసే!
(MS విండోస్ అంటే మైల్డ్ స్టీల్- అంటే ఇనుప కిటికీలు అని కూడా అర్థం.)

అవసరం!
రాముడు: డాక్టరుగారూ! మా అబ్బాయి తాళంచెవిని మింగేశాడండీ..
డాక్టరు: తాళం చెవినా!? అయ్యో! ఎప్పుడు?
రాముడు: ఓ మూడు నెలలు అయిందండీ...
డాక్టరు: మూడు నెలలా!?! మరయితే ఇన్నాళ్లనుండీ ఏం చేస్తున్నావయ్యా నువ్వు?
రాముడు: రెండోది ఉందిగదండీ, దాన్ని వాడుకుంటుండేవాణ్ణండీ.

ఏవీ రావు!

మాష్టారు: ఒరేయ్ రామూ.. ఇంత చిన్న లెక్కల్ని కూడా సరిగా చెయ్యలేకపోతే ఏమనాలిరా నిన్ను?
రాము: ‘లెక్కల్రావ్’ అనండి సార్...

పనైపోతుంది!

మాష్టారు: ఒరేయ్ రామూ, బడిలో గణితం మొదటి పీరియడ్ లో ఉంటుంది- ఎందుకో చెప్పు, చూద్దాం?
రాము: లెక్కలు కష్టం కదండీ. సార్లు- పాపం, రాత్రంతా శ్రమపడి నేర్చుకుంటారు గదండీ, లెక్కల్ని? వాటిని మర్చిపోకముందే చెప్పేస్తే ఓ పనైపోతుందని!

సంస్కారం!

ఓ తల్లి-కొడుకు దారి వెంబడి నడుస్తున్నారు. కొడుకు కాల్లో ఓ ముల్లు గుచ్చుకుంది. వాడు దాన్ని కాల్లోంచి లాగేసి, మళ్ళీ దాన్ని రోడ్డు మీదనే పడేశాడు.
తల్లి: ఒరేయ్, ఆ ముల్లును పక్కకు పడేయక, అట్లా అక్కడే పడేశావేంటి?
కొడుకు: ఎక్కడున్న దాన్ని అక్కడే పెట్టడం సంస్కారమని నువ్వేగదమ్మా , చెప్పావు!

ఇద్దరూ ఒకటే!

ఓ పెద్ద ఐఐటీలో రాత్రిపూట టీ తాగేందుకు బయటికొచ్చిన రీసెర్చ్ విదార్థికి కొత్త వ్యక్తి ఒకడు ఎదురయ్యాడు:
వ్యక్తి: బాబూ! గంటసేపటి నుండి ఇక్కడే తిరుగుతున్నాను - బయటికెళ్లేందుకు దారి ఎటో తెలీటం లేదు. కొంచెం దారి చూపించి పుణ్యం కట్టుకో, నాయనా!
విద్యార్థి: అయ్యో! ఐదేళ్లయింది- బయటికెట్లా వెళ్లాలో తెలీక, నేనూ ఇక్కడే తన్నుకులాడుతూ ఉన్నాను స్వామీ!

ఇనపవి!

కొడుకు: నాన్నా! రామూ వాళ్లింట్లో MS విండోస్ వాడుతున్నారట!
తండ్రి: పోనీలేరా, ఇనపవైతే గట్టిగానే ఉంటాయి!
(MS విండోస్ అంటే మైల్డ్ స్టీల్- అంటే ఇనుప కిటికీలు అని కూడా అర్థం.)

కనుగొంటినీ!

పేషంట్: డాక్టరుగారూ, నా చూపుడు వేలితో శరీరాన్ని ఎక్కడ ముట్టుకున్నా చాలా నొప్పిగా ఉంటున్నదండీ..
డాక్టర్: అవునా? ముక్కును ముట్టుకున్నా నొప్పేనా?
పేషంట్: అవునండీ.
డాక్టర్: మోకాల్ని ముట్టుకున్నా నొప్పేనా?
పేషంట్: అవునండీ. ఎక్కడ ముట్టుకున్నా నొప్పిగానే ఉంటుంది సార్.
డాక్టర్: అయితే నీ శరీరం మొత్తం ఒకసారి స్కాన్ చేసేస్తానుండు..
డాక్టరు:(స్కాన్ చేశాక..) "ఆ..! కనుక్కున్నానయ్యా! నీ శరీరమంతా బాగుంది! సమస్యల్లా నీ చూపుడు వేలిలోనే! నీ వేలు విరిగిందనిపిస్తోంది.