ఒకసారి నారదుడు, విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో `విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు?' అన్న ప్రశ్న తలెత్తింది. "గుమలాపురం గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తుల్లో అగ్రగణ్యుడు" అన్నాడు విష్ణుమూర్తి. నారదుడు అనుమానంగా చూశాడు. రంగప్ప పేరే అతను వినిఉండలేదు మరి! అందుకని అతను వెంటనే బయలుదేరి గుమలాపురం వెళ్ళి, రంగప్పను గమనించటం మొదలుపెట్టాడు.

రంగప్పకు ఐదుగురు పిల్లలు. రంగప్ప భార్య రాధమ్మ. పిల్లల్ని పెంచటంతో పాటు ఆమె ఇంటి బాధ్యతల్నీ, వాళ్ళకున్న పది పశువుల బాధ్యతనీ చక్కగానే నిర్వర్తిస్తున్నది. రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్లి సాయంత్రం చీకటిపడే వేళకు తిరిగి వస్తున్నాడు. పొలం పనులు లేని రోజున అతనికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులూ, ఊళ్లో చేయాల్సిన పనులూ ఉంటున్నాయి.

వీటన్నిటి మధ్యా అతను దేవుడిని రోజూ ఓ పదిహేను ఇరవై నిముషాల పాటు తలచుకుంటున్నాడు. రోజూ స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుని గూడు ముందు నిలబడి రాముడి పటానికీ, కృష్ణుడి పటానికీ పూజ చేస్తున్నాడు.

ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో ప్రత్యేకత ఏమున్నదో అర్థం కాలేదు. "అతను చేసే సాధారణ పూజలో ఏం గొప్పతనం ఉన్నది? దానికి అంత మెచ్చుకోలు దేనికి? రంగప్పలో ప్రత్యేకత ఏమీ లేదు." నారదుడు వెనక్కు పోయి విష్ణువుకు అదే చెప్పాడు.

"అట్లాకాదు. రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు. పైపెచ్చు జీవన నావను బాధ్యతతో నడుపుతూ సంసారపు ఆటుపోట్లన్నిటినీ ఎలాగూ అతను భరిస్తున్నాడు. అయినా కూడా అతను తన పూజను ఏనాడూ మరువడు. పరిపూర్ణమైన భక్తితో, ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజూ పూజచేస్తాడు. అది కొంచెం సేపే అయితే మాత్రం ఏమిటి? అతనికంటే తక్కువ పని ఉండే జనాలు కూడా అతనిచ్చేపాటి సమయాన్నివ్వరు ఆత్మశుద్ధికి" అన్నాడు విష్ణుమూర్తి.

అయినా నారదుడికి ఆ సమాధానం తృప్తినివ్వలేదు. అప్పుడు విష్ణువు "స్వయంగా అనుభవిస్తే తప్ప, ఇలాంటివన్నీ సరిగా అర్థం కావు. ఏదో ఒకనాడు నీకా అనుభూతి తప్పక కలుగుతుంది" అన్నాడు నవ్వుతూ.

తర్వాత నారదుడు భూసంచారానికి బయలుదేరాడు. ఏమైందో ఏమో, అక్కడ ఆయనకు ఒక అందమైన యువతి కనబడింది. నారదుడు ఆమెను పెండ్లాడి అక్కడే ఉండిపోయాడు. ఆపైన నారదుడి మామగారు అతనికి కొంత నేలనిచ్చారు. ఆ నేలను సాగుచేస్తూ నారదుడు మంచి రైతయ్యాడు. మెల్లగా అతను వ్యవసాయంలో కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఆలోగా అతని భార్య ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. ఇక నారదుడి పనిభారం మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో అతనికున్న సామాజిక బాధ్యతలు రెట్టింపయ్యాయి. వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. కాలం ఎటుపోతున్నదీ తెలియలేదు.

ఒకరోజున నారదుడు, అతని భార్య సుధ, వాళ్ల ఇద్దరు కొడుకులు - అందరూ వేరే ఊరునుండి వెనక్కి తిరిగి వస్తున్నారు. దారిలో అకస్మాత్తుగా విపరీతమైన వాన మొదలైంది.

వాళ్లు తడిసి తడిసి, ఊరి చివరనున్న వాగును చేరుకునే సరికి, మామూలుగా నీళ్లంటూ ఉండని ఆ వాగు ఇప్పుడు మహా ఉధృతంగా ప్రవహిస్తున్నది! వాళ్లు నలుగురూ వాగు ఒడ్డున కొంతసేపు వేచిచూశారు, కానీ ప్రవాహం తగ్గేటట్లు లేదు. `ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదో ఏమో?' కొన్ని గంటలు అలాగే వేచి చూసిన మీదట నారదుడు ఇక ఆగలేకపోయాడు. ఇద్దరు కొడుకుల్నీ భుజాలకెత్తుకున్నాడు. భార్య సుధను తన వెనుకనే నడవమన్నాడు. జాగ్రత్తగా వాగులోకి దిగి నడవటం మొదలెట్టాడు. ఇంకా వాగు నడుమకు చేరుకున్నాడో లేదో, కాళ్లకు ఏదో చుట్టుకున్నట్లై బోర్లా పడిపోయాడు నీళ్ళల్లో! పిల్లలిద్దరూ ఒక్క క్షణ కాలంలో కనుమరుగయ్యారు - నీళ్లలో పడి కొట్టుకుపోయారు. అదే సమయంలో పట్టుతప్పిన సుధ జారి నీళ్లలో పడింది. నారదుడు అరుస్తూ చేయి అందించేలోగా ఆమె కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది!! నారదుడొక్కడే అతి కష్టంమీద ఒడ్డు చేరుకోగలిగాడు. దు:ఖంతో, నిస్పృహతో అతని గుండెలు అవిసిపోయాయి. "అయ్యో! భగవంతుడా! ఏమిటీ విపరీతం!" అని బిగ్గరగా ఏడ్చాడు.

ఆ క్షణాన విష్ణువు ప్రత్యక్షమై, నారదుడిని తట్టి లేపాడు. మాయకు లోనై తాను సంసార సాగరంలో ఎలా ఈదులాడిందీ గుర్తొచ్చి ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు నారదుడు. ఆ వలయంలో చిక్కుకుని, తను ఒక్కసారికూడా భగవంతుడిని స్మరించలేదని కూడా గుర్తొచ్చింది నారదుడికి! `రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు' అని అట్లా అనుభవ పూర్వకంగా గ్రహించిన నారదుడు సంశయ రహితుడై, విష్ణుమూర్తి ముందు సాగిలపడ్డాడు!