అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో పెద్దవాళ్లంతా ఒకరోజున పనిచేయటానికి వెళ్ళారు. ముసలివాళ్ళు మాత్రం ఇంట్లో ఉండగా, పిల్లలంతా కలిసి బయట ఆడుకుంటున్నారు.

అంతలో కిడ్నాపు వాళ్ళు కారు వేసుకొని వచ్చేశారు! పిల్లలంతా "కారు వచ్చింది! కారు వచ్చింది!" అని అరుచుకుంటూ కారు దగ్గరికి పరుగెత్తారు. "ఏం పిల్లలూ! బాగున్నారా! ఇదిగో ఇవి మీకోసమే తెచ్చాం! తినండి తినండి!" అంటూ కిడ్నాపు వాళ్ళు వాళ్లందరికీ‌ తిన్నన్ని చాక్లెట్లు ఇచ్చారు.

అయితే అవి మామూలు చాక్లెట్లు కావు! మత్తు చాక్లెట్లు! అవి తినగానే పిల్లలందరూ ఎవరికి వాళ్ళు మత్తులోకి జారుకున్నారు.

కిడ్నాపువాళ్ళు పిల్లలందరినీ బస్తాలమాదిరి ఎత్తి, కారులో వేసుకొని హైదరాబాదు వైపుకు బయలుదేరారు. అలా కొన్ని గంటలపాటు ప్రయాణించిన తరువాత, ఒక్కొరొక్కరుగా పిల్లలందరూ లేచి, "అమ్మ కావాలి! నాన్న కావాలి!"అని ఏడవటం మొదలెట్టారు. కిడ్నాపు వాళ్ళు కఠినంగా అందరినీ బెదిరించి , "అమ్మ లేదు, నాన్న లేడు! చప్పుడు చేయకుండా పడుకోండి" అని, మళ్ళీ పడుకోబెట్టారు.

కారు అలా పోతూనే ఉన్నది. పిల్లలందరూ "ఆకలి! ఆకలి!" అని ఏడుస్తున్నారు. అప్పుడా దొంగలు ఒక కొండ దగ్గర కారును నిలబెట్టి, వెళ్ళి ఎక్కడినుండో అరటిపళ్ళ గెల ఒకటి తెచ్చారు. పిల్లలంతా అరటిపళ్ళు తిని కొంచెం సమాధానపడ్డారు. అయితే కిడ్నాపు వాళ్ళు అక్కడా ఎక్కువసేపు ఆగక, కారును ముందుకు పోనిచ్చారు.

పిల్లల్లో చదువుకున్న పిల్లవాడొకడున్నాడు. వాడి దగ్గర ఎప్పుడూ పెన్నూ, కాగితం ఉంటాయి. పిల్లలందరూ అరటిపళ్ళు తింటుండగా వాడు కారు నెంబరును చూసి గుర్తు పెట్టుకున్నాడు. మళ్ళీ కారెక్కగానే, వాడు ఎవ్వరూ చూడకుండా తన దగ్గరున్న కాగితం బయటికి తీసి, "మమ్మల్ని కిడ్నాపు వాళ్లు ఎత్తుకు పోతున్నారు. కారు నెంబరు xyz3239. రక్షించండి" అని రాసి పెట్టుకున్నాడు. ఆ తరువాత కొంతసేపటికి కారు ఏదో పట్టణంలో ఎర్రలైటు వద్ద ఆగింది. అక్కడ కారు కిటికీకి దగ్గర్లోనే ఒక పోలీసాయన నిలబడి ఉండటం చూసి, ఆ పిల్లవాడు ఎవరూ చూడకుండా ఆ కాగితం పోలీసుకు అందేటట్లు విసిరేసాడు!

పోలీసు ఆ కాగితం చదవగానే తమ పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆ దారిలో ఉండే అన్ని పోలీసు స్టేషన్లకూ కబురు అందింది. మరో అర్థగంట ప్రయాణం అయ్యేసరికి, పోలీసులు కారుని ఆపి, కిడ్నాపువాళ్లను పట్టుకొని, పిల్లలందర్నీ విడిపించారు!

కిడ్నాపయినాగానీ తెలివిని కోల్పోక, ధైర్యంగా పోలీసులకు సమాచారాన్నందించి, కిడ్నాపువాళ్ళను పట్టించినందుకు, ఆ తెలివైన పిల్లవాడిని అందరూ మెచ్చుకున్నారు.