ఒక ఊళ్ళో తిప్పన్న, మారన్న అనే అన్నదమ్ములుండేవాళ్లు. వాళ్లిద్దరూ కూలీ నాలీ చేసుకొని పొట్టపోసుకునేవాళ్ళే. తిప్పన్న ఒక పెద్ద షావుకారు ఇంట్లో పని చేస్తుండేవాడు; మారన్న రోజుకొకరి పొలంలో పని వెతుక్కునేవాడు.

తిప్పన్నకు షావుకారు రోజంతా పని మప్పేవాడు. ఒక్క క్షణం కూడా‌ వృధా పోనీకుండా పని చేయించుకోవటమే ఆయన లక్ష్యంగా ఉండేది. దానికితోడు షావుకారు పిసినారితనం ఊరంతటికీ తెలుసు. అందరూ తిప్పన్నమీద జాలిపడేవాళ్లే.

తిప్పన్నకు షావుకారు రోజూ చెప్పే పనుల్లో అతి ముఖ్యమైనది, తొట్ల నిండుగా నీళ్లు తోడి పొయ్యటం. ఆ తొట్లలో ఒక పెద్ద తొట్టి ఉండేది. దానికి ఎన్ని నీళ్లు తోడి పోసినా, అది మాత్రం నిండేది కాదు. తొట్లు నిండనిదే తిప్పన్నకు షావుకారు భోజనం పెట్టేవాడు కాదు, మరి! తిండి లేక, చూస్తూండగానే తిప్పన్న సన్నగా, బలహీనంగా అయిపోయాడు.

ఇది విని, మారన్న తమ్ముడి దగ్గరకు వచ్చి సంగతేంటని అడిగాడు. ఎవ్వరిదగ్గరా బయట పడని తిప్పన్న, అన్న అడగ్గానే కళ్ల నీళ్ల పర్యంతమయ్యాడు. ఎన్ని రోజులుగా షావుకారు తనకు అన్నం పెట్టలేదో చెప్పాడు. మారన్నకు కోపం వచ్చింది. "నువ్వుండరా, తమ్ముడూ! ఈ షావుకారుకు బుద్ధి చెప్పటం నాకు వదిలెయ్. కొన్నాళ్ళు నీ బదులు నన్ను పోనియ్యి, షావుకారింట్లో పనికి" అని, మరుసటి రోజున మారన్న షావుకారింటి పనికి వెళ్ళాడు.

"ఏమిరా, మారన్నా! నువ్వొచ్చావు? నీ తమ్ముడేడి?" అని అడిగాడు షావుకారు.

"మా తమ్ముడికి జ్వరం వచ్చిందయ్యా, అందుకని, వాడి బదులు నేను వచ్చాను, పనికి" అన్నాడు మారన్న, తెచ్చిపెట్టుకున్న వినయంతో. "సరే, పోయి తొట్లనిండుగా నీళ్లు తోడిపోసి, ఆ తరువాత ప్లేటునిండా అన్నం పెట్టించుకొని తిను!" అన్నాడు షావుకారు.

మారన్న పనిలోకి దిగి, ముందు చిన్న తొట్లన్నిటిలోనూ నీళ్ళు నింపాడు. చివరికి పెద్దతొట్టిలో ఒక బిందెడు నీళ్ళు పోసి, రెండో బిందె నీళ్లు తోడేసరికి, పెద్ద తొట్టిలో నీళ్లన్నీ ప్రక్కన తోటలో ఉన్న చెట్లకు చేరుకున్నాయి! తెలివిగల మారన్న ఆ సంగతిని వెంటనే గుర్తించాడు. అతను పనిని ఆపి, చెరువుకు పోయి, ఇంత బంకమట్టి తెచ్చి, పెద్దతొట్టి అడుగున షావుకారు పెట్టిన రంధ్రాన్ని పూడ్చేశాడు. ఆపైన తొట్టి త్వరగా నిండిపోయింది.

"పనయిపోయిందయ్యా, ఇక అన్నం పెట్టించండి" అని మారన్న అనగానే షావుకారు అతన్ని ప్లేటు తీసుకొమ్మన్నారు. తీరా చూస్తే ఆ ప్లేట్లన్నీ‌మరీ చిన్నవి! తెలివైన మారన్నకు షావుకారు మోసం అర్థమైంది. అతను పోయి పెరడులో ఉన్న బాదాం చెట్టు నుండి పన్నెండు ఆకులు కోసుకొని, వాటిని పుల్లలతో కుట్టి పెద్ద విస్తరి చేసుకున్నాడు. షావుకారు భార్యను అడిగి, ఆ విస్తరినిండా కావలసినంత అన్నం పెట్టించుకొని కడుపునిండా తిని, త్రేన్చాడు!

అన్నం తిన్నాక షావుకారు "ఒరే, మారన్నా! వెళ్లి ఓ నాలుగు కట్టెలు కొట్టుకురారా!" అన్నాడు. మారన్న బాధ్యతగా వెళ్లి, సరిగ్గా లెక్కపెట్టి ఒక్క నాలుగు కట్టెలు కొట్టుకొచ్చి పెట్టాడు. "అదేంటిరా!" అన్న షావుకారుతో- "మీరే గదండయ్యా, నాలుగు కట్టెలు కొట్టుకు రమ్మన్నారు?" అనేసరికి, ఇక షావుకారు ఏమీ అనలేక ఊరుకొని, "ఒరే! నేను మా చెల్లి ఇంటికి పోవాలి. ఆమెకు సారెగా కర్జాయిలు, బాదుషాలు, రకరకాల తీయటి వస్తువులు తీసుకు పోవాలి. నువ్వు వాటిని మోసుకొని, ముందు నడు. నేను వెనకగా నడుచుకొని వస్తాను" అన్నాడు.

మారన్న వాటిని ఎత్తుకొని గబగబా ముందుకు నడిచి, మధ్యలో ఎక్కడో ఆగి, వాటిని అవికొన్నీ- ఇవికొన్నీ- ఇష్టంగా నమిలి, తిన్నాడు. ఆపైన ముందుగా షావుకారు చెల్లెలి ఇంటికి పోయి "అమ్మగారూ! మీ అన్న, మీకోసం సారె పట్టుకొని వస్తున్నాడు. ఆయన రాగానే, మీరు ఆయన్ని పసుపు నీళ్లల్లో నానబెట్టిన పరక (చీపురు)తో కొట్టుతూ "ఇదే ఆచారం, ఇదే గ్రహచారం" అనాలట, పదిసార్లు" అని చెప్పాడు. ఆమె "ఇదే ఆచారమేమో" అనుకొని, పరకను తయారుగా ఉంచుకొని, షావుకారు రాగానే పడేసి కొట్టింది. "ఇదే ఆచారం, ఇదే గ్రహచారం" అని దండకం చదువుతున్నది గనక, అన్నగారు కూడా ఇది వాళ్ళ ఇంటి ఆచారమేమో అని ఊరుకున్నారు!

ఆపైన మారన్న బయలుదేరి షావుకారు ఇంటికి వచ్చి, షావుకారు భార్యతో "అమ్మా! అయ్యగారు బయలుదేరి వస్తూ, దారిలో అవీ ఇవీ దాటారు. ఆ దోషం పోవాలంటే, మరి మీరు పసుపునీళ్ళలో ఇంత ఆవుపేడ కలిపి పెట్టుకొని, ఆయన రాగానే ఆ నీళ్లతో ఆయనకు స్నానం పోయించండి" అన్నాడు. షావుకారు భార్య "ఇదీ బాగానే ఉన్నది" అనుకొని, భర్త రాగానే ఆయన్ని వాకిట్లోనే నిలబెట్టి పేడనీళ్లతో స్నానం చేయించింది!

మారన్న కోపం అప్పటికి గానీ తీరలేదు. అతను వెళ్ళి తమ్ముడితో "ఒరే! నిన్నిట్లా చేసినందుకు షావుకారికి మా బాగా జరిగిందిలే. ఇకనైనా తెలివిగా పనిచేసుకో. అతని మోసానికి తలఒగ్గకు!" అని చెప్పాడు, నవ్వుకుంటూ!