"ఆఁ ! ఇవి ఎక్కడి మాటలు? ఏదైనా కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్లు చెప్పే మాట వినాలి. వినండి. సరైన చోటున ఉన్నామా, తగని చోటున ఉన్నామా అన్నది పట్టించుకోకుండా అన్ని సందర్భాలలోనూ ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. పనికిరాని సందేహాలతో భోజనం మానుకోవచ్చునా? మానుకొని ఇక బ్రతికేదెలాగ? 'ఈర్ష్య పడేవాడు, అసహ్య పడేవాడు, సంతోషం లేనివాడు, కోపం మీద ఉన్నవాడు, ఎల్లప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడు, ఇతరులమీద ఆధారపడి బ్రతికేవాడు అనే ఈ ఆరుగురూ దు:ఖజీవులు' అని నీతిశాస్త్రం తెలిసిన పెద్దలు చెబుతుంటారు" అని ముసలిపావురం అనగానే, దాని మాటలు విని, పావురాలన్నీ నేలమీద వ్రాలాయి.

చూడండి, గొప్ప శాస్త్రాలు చదివి, చాలా తెలివితేటలుండి, ఇతరుల అనుమానాలన్నీ తీర్చగల నేర్పు ఉన్నవారుకూడాను, దురాశలో పడితే వివేకం కోల్పోయి, దు:ఖాల పాలౌతారు. అబ్బ! లోభం ఎంత చెడు గుణం! అన్ని కష్టాలకూ కారణం దురాశే.

అలా నేలమీద వ్రాలిన పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. అప్పుడు అవన్నీ ముసలి పావురాన్ని చూసి "అయ్యో! నువ్వు 'ముసలివాడివి, తెలిసినవాడివి' అని భ్రమపడి, నీ మాటలు విని, ఈ ఆపదను కొనితెచ్చుకున్నాం. తెలివి తేటలు కలవాడే పెద్దవాడు గానీ, ఊరికే వయసు మీరినవాడు పెద్దవాడౌతాడా, ఎక్కడన్నా?" అని నిందించాయి.

చిత్రగ్రీవుడు వాటి మాటల్ని విని, "ఇది ఇతని తప్పు కాదు. ఆపదలు వచ్చే సమయంలో మంచికూడా చెడు అవుతుంది. మన కాలం బాగాలేదు. ఊరికే ఇతనిని ఎందుకు నిందిస్తారు? తనకు తోచిందేదో తను చెప్పాడు. అప్పుడు మన తెలివి ఎటు పోయింది? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొనే మార్గాన్ని ఆలోచించాలి గానీ, ఇలాంటి మాటలవల్ల ప్రయోజనం ఏముంటుంది? విపత్తు వచ్చినప్పుడు తెల్లబోవటం మూర్ఖుల లక్షణం. కాబట్టి ఇప్పుడు మీరంతా ధైర్యం తెచ్చుకొని, ఏమి చేయాలో ఆలోచించండి. ప్రస్తుతానికి నాకు ఒకటి తోస్తోంది- ఏమరుపాటు లేకుండా అందరూ శ్రద్ధగా వినండి. ఒక్కసారిగా మనం అందరం ఈ వలను ఎత్తుకొని ఎగిరిపోదాము. 'మనం బలహీనులం కదా, ఇంత పెద్దపని మనవల్ల అవుతుందా?' అని అనుమానపడకండి. కలసి పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చు. కలిసి త్రాడుగా ఏర్పడి, గడ్డి పరకలుసైతం మదపుటేనుగును బంధించగల్గుతున్నాయి. మీరు కూడా ఆలోచించి చెప్పండి. దీనికంటే మంచి ఉపాయం ఏదైనా మీకు తోచినట్లైతే, అలాగే చేద్దాము" అన్నది.

వెంటనే ఆ పావురాలన్నీ "మీరు చెప్పినదే బాగుంది. ఇంతకంటే మంచి ఉపాయం లేదు" అని, ఒక్కసారిగా అన్నీ కలిసి ఆకాశంలోకి ఎగిరాయి. అప్పుడా వేటగాడు ఆ వింతను చూసి నివ్వెరపోయి, "అరే! ఈ పక్షులన్నీ ఒక్కటై వలను ఎత్తుకుపోతున్నాయి. నేను వాటిని వెంబడించి, ఎక్కడో ఒకచోట అవి నేల వ్రాలగానే వాటిని పట్టుకుంటాను" అనుకొని, ముఖాన్ని పైకెత్తుకొని, రెప్పవాల్చకుండా చూస్తూ, అవి పోయే దిశలో నేలపైనే పరుగుతీయటం మొదలుపెట్టాడు. ఈ వింతను చూసేందుకని కాకి-లఘుపతనకం కూడా పావురాలను వెంబడించి పోయింది.

పక్షులు వేగంగా ఎగురుతూ చివరికి కనుచూపుమేరను దాటి పోగానే వేటగాడిని నిరాశ ఆవరించింది. వాడు ఇక మనసు మరల్చుకొని, వెనుతిరిగి పోయాడు. అది చూసుకొని, పక్షులు "ఇప్పుడు ఇక మనం ఏం చేద్దాం?" అని అడిగాయి చిత్రగ్రీవుణ్ని. చిత్రగ్రీవుడు వాటితో "ఈ ప్రపంచంలో తల్లి,తండ్రి, స్నేహితుడు' అనే ముగ్గురే నిజంగా మన మేలు కోరేది. మిగిలినవాళ్ళు అందరూ అవసరాన్ని బట్టి మేలు కోరుతుంటారు. అలా ఎల్లప్పుడూ నా మేలు కోరే మిత్రుడు ఒకడు ఉన్నాడు-అతనొక గొప్ప ఎలుక. పేరు హిరణ్యకుడు. గండకీ నది ఒడ్డున గల విచిత్ర వనం అతని నివాసస్థానం. అతని పండ్లు చాలా బలమైనవి. వాటితో ఈ వల త్రాళ్లను తెగకొరికి, అతడు మనల్ని కాపాడగలడు. మనం ఇప్పుడు అక్కడికి పోదాం!" అన్నది. అది విని పావురాలన్నీ చిత్రగ్రీవుడు చెప్పిన గుర్తులను అనుసరించి పోయి, హిరణ్యకుడి కలుగు దగ్గరగా వ్రాలాయి.

పావురాలు వాలిన శబ్దం వినబడగానే హిరణ్యకుడు భయపడి, తన కలుగులోనికి పోయి, మెదలకుండా కూర్చున్నది. అప్పుడు చిత్రగ్రీవుడు ఆ కలుగు దగ్గరకు పోయి, బిగ్గరగా -"ఓ నేస్తమా, హిరణ్యకా, ఎందుకు, నాతో మాట్లాడటం లేదు?" అన్నాడు. ఆ గొంతును గుర్తుపట్టిన హిరణ్యకుడు "ఆహా! ఈరోజు ఎంత మంచి రోజు! నా ప్రియమిత్రుడు చిత్రగ్రీవుడు నా ఇంటికి వచ్చి నిలిచాడు, నాకిది పండుగే!" అంటూ వెంటనే కలుగులోంచి బయటికి వచ్చింది. బయట వలలో చిక్కుకొని ఉన్న పావురాలను చూసి అది ఒక్క క్షణకాలంపాటు నిర్ఘాంతపోయి, ఆ తరువాత విచారంగా "మిత్రమా, ఇదేమిటి?" అని అడిగింది. "నేస్తమా, ఇది పూర్వ జన్మలో మేము చేసిన పని యొక్క ఫలితం. ఎంతవారికైనా తాము చేసిన పని వల్ల కలిగే ఫలితాన్ని అనుభవించక తప్పుతుందా?" అన్నది చిత్రగ్రీవుడు.

వెంటనే హిరణ్యకుడు చిత్రగ్రీవుడిని విడిపించేందుకుగాను అతని దగ్గరకు పోయింది. అప్పుడు చిత్రగ్రీవుడు "మిత్రమా! ఇలా కాదు, చేయవలసినది. ముందుగా నామీద ఆధారపడి ఉన్నవారిని విడిపించు. ఆ తరువాత నన్ను విడిపింతువు గాని!" అన్నది.

అప్పుడు హిరణ్యకుడు "నా పళ్లు చాలా సున్నితమైనవి. వలను మొత్తంగా కొరికి, అందరినీ విడిపించటం నా వల్ల కాదు. నా పళ్లలో బలం ఉన్నంతమేరకు, ముందుగా నీ కట్టు త్రాళ్ళు తెంచుతాను. ఆ తరువాత ఇంకా శక్తి మిగిలి ఉంటే మిగిలిన వారిని విడిపిద్దాం" అన్నది, చిత్రగ్రీవుడితో. అప్పుడు చిత్రగ్రీవుడు తన స్నేహితునితో "అట్లాగే కానియ్యి. శక్తికి మించి ఎవరైనా ఏమి చేయగలరు? ముందు నీ శక్తి కొలదీ వీళ్ల బంధాలను తొలగించు. ఆపైన ఎప్పటికైనా నా సంగతిని చూడవచ్చునులే!" అన్నది.

మిత్రుడి మాటలు విని హిరణ్యకుడు "తనను వదిలి ఇతరులను రక్షించాలనటం సరికాదు. 'తన్ను మాలిన ధర్మము- మొదలు చెడ్డ బేరము' అని వినలేదా? తాను బ్రతికితేనేకదా, 'మంచి చేయటం, సంపదను కూర్చటం, కోరికలు తీర్చుకోవటం, మోక్షం పొందటం' అనే నాలుగు పురుషార్థాలనూ సాధించేది? తాను చనిపోయిన తరువాత, దేనితోనైనా ఇక పని ఏముంటుంది?" అన్నది.

అప్పుడు చిత్రగ్రీవుడు "స్నేహితుడా! నువ్వు చెప్పిన నీతిని కాదనను. అయినా, నావాళ్ళ దు:ఖాన్ని నేను భరించలేను. అందుకనే ఇంత గట్టిగా చెబుతున్నాను. వివేకవంతుడు తన జీవితాన్ని త్యాగం చేసైనాసరే, మంచివాళ్లకు ఎదురైన కష్టాన్ని తొలగించాలని నీతిశాస్త్రం తెలిసినవాళ్ళు చెబుతారు. అయినా దాన్ని వదిలి పెట్టు- నాలాంటి వాళ్లే, వీళ్లు. వీరిలాంటి వాడినే నేను. ప్రస్తుత స్థితిలో కాపాడేందుకు పనికిరాని నా అధికారం వల్ల, వీళ్లకు ఒరిగేది ఏమిటి? మిత్రమా, ఈ శరీరం ఏనాటికైనా నశించేదే- ఆ రకంగా ఇది నిందనీయం కూడాను. అలాంటి ఈ శరీరం పట్ల వ్యామోహాన్ని వదిలిపెట్టి, నాకు చిరకాలం మిగిలే కీర్తిని సంపాదించి పెట్టు. నానుండి వీళ్లకు జీతమూ లేదు; భత్యమూ లేదు- అయినా వీళ్లంతా ఏనాడూ విడువకుండా, నన్నే రాజుగా కొలుస్తున్నారు. వీళ్ల ఋణం నేను ఎప్పటికి తీర్చుకోగలనో తెలీదు. 'నా జీవితం ముఖ్యం' అని చూడకు. వీళ్ల ప్రాణాలను రక్షించితే చాలు. అశాశ్వతమూ, మలినమూ అయిన ఈ శరీరంవల్ల, నిత్యమూ, నిర్మలమూ అయిన కీర్తి లభించనున్నదంటే, ఇక దానికంటే మరేమి కావాలి? సాధారణంగా ఈ శరీరానికి, సద్గుణాలకూ ఆమడ దూరం ఉంటుంది. శరీరం ఒక్క క్షణంలో నశిస్తుంది-కానీ సద్గుణాలు యుగాల తరబడి నిలచి ఉంటాయి. ఇలాంటి శరీరంపై వ్యామోహంతో శాశ్వతమైన కీర్తిని పోగొట్టుకోవచ్చా, నువ్వే చెప్పు!" అన్నది.

మిత్రుని మాటలు విన్న హిరణ్యకుడు సంతోషంతో పులకించిపోయి, "మిత్రమా! బాగు, బాగు! చక్కగా చెప్పావు. నిన్ను ఆశ్రయించినవాళ్ళ పట్ల నీకున్న ప్రేమానురాగాలను మెచ్చుకునేందుకు నేనెంత వాడిని? నీ ఈ సద్గుణం ఒక్కటి చాలు -నీకు ముల్లోకాలకూ ఆధిపత్యం లభింప జేసేందుకు!"అని, వెంటనే పావురాలన్నింటి బంధాలనూ తెగ కొరికింది. ఆపైన అది ఆ పావురాలన్నింటినీ చక్కగా ఆదరించి, "మిత్రమా, చిత్రగ్రీవా! ఎంతటివారికైనా గతంలో చేసిన పనుల ఫలితాన్ని అనుభవిచక తప్పదు. 'వలలో చిక్కుబడ్డానే!' అని నొచ్చుకోకు. అంతా తెలిసినవాడివి. నీకు నావంటివాళ్ళం ఏం చెప్పగలం?" అని ఊరడించింది. ఆపైన అది చిత్రగ్రీవుడికి ఆతిధ్యమిచ్చి, కౌగిలించుకొని, సాగనంపింది. చిత్రగ్రీవుడు, తోటి పావురాలు హిరణ్యకుడి మంచితనాన్ని మెచ్చుకుంటూ తమదారిన తాము వెళ్ళిపోయాయి.

కాబట్టి, తెలివిగలవాడు అనేకమంది స్నేహితులను సంపాదించుకోవాలి. ఒక్క ఎలుకతో చేసిన స్నేహం పావురాలకు ఎంత లాభం కలిగించిందో చూశారుగద!" అని, విష్ణుశర్మ కథను కొనసాగించాడు.. (..తరువాయి వచ్చే మాసం)