ముత్తుకు ఐదేళ్ళు. ఆ పాపవాళ్ల ఇల్లు ఉండేది కొత్తపల్లికి దగ్గరే, కొండ పక్కన- తోటలో. ఆ పాపకు ఆకాశంలో నక్షత్రాలంటే చాలా ఇష్టం. రోజూ చీకటి పడే సమయానికి వాళ్ళ నాన్న సేద్యం పనులు ముగించుకొని, స్నానం చేసి, ఇంటి ముందర బయల్లో నులక మంచం వేసుకొని పడుకుంటాడు. ముత్తు రోజూ ఆ సమయానికి పరుగెత్తుకొచ్చి, నాన్న పక్కన పడుకుని, బడిలో సంగతులన్నీ నాన్నకు చెబుతుంది. నాన్న బొజ్జ మీద పడుకొని కథలు వింటుంది. తరువాత కొంచెం సేపు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉంటుంది. అవి ఆమెకు చాలా అందంగా అనిపిస్తుంటాయి. 'వాటిని అందుకోగలిగితే ఎంత బాగుంటుందో' అనుకుంటూ ఉంటుంది.

ఒక సారి క్రిస్మస్ పండుగకు ఊళ్లో తెలిసినవాళ్ల ఇంటికి వెళ్లింది ముత్తు. అక్కడ వాళ్ల ఇంటి ముందు ఒక చెట్టుకు కరెంటు దీపాలతో నక్షత్రాలు, తోరణాలు తగిలించి ఉన్నాయి! తళతళా మెరుస్తున్న ఆ నక్షత్రాలను చూడగానే, పాప 'నక్షత్రాలు! నక్షత్రాలు!’ అని అరుస్తూ వాటి దగ్గరకు పరుగెత్తింది. ముందు వాటిని మెత్తగా తాకింది; నిదానంగా వాటిని అటూ ఇటూ ఊపింది; ఆపైన వాటిని ఇష్టంగా తిప్పింది. తను ఆ నక్షత్రాలను గుండ్రంగా తిప్పుతుంటే, వాటిని వేలాడదీసిన దారాలకు పురులు పడి, ఆపైన వాటంతట అవి చాలా సేపటివరకూ గిర్రున వెనక్కి తిరుగుతున్నాయి! వెనక్కి వస్తూ, దార్లో అంతా ముత్తు ఆ నక్షత్రాల గురించే ఆలోచించింది. 'చెట్టుకు నక్షత్రాలను వేలాడదీసినట్లే, ఆకాశానికి కూడా నక్షత్రాలను వేలాడదీసి ఉంటారేమో..' అనుకున్నది.

ఇక ఆరోజునుండి రాత్రి అవుతూనే, చాలా సార్లు ముత్తు మేడ మీదకెళ్లి, నక్షత్రాలను తాకేందుకు ప్రయత్నించేది. అయినా అవేవీ ఆ పాపకు అందలేదు. ఒక సారి బెంగుళూరులో వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు, వాళ్ల మిద్దె మీది నుండి కూడా ప్రయత్నించింది. చూసేందుకు మాత్రం ఆ మిద్దె ఆకాశాన్ని తాకుతున్నట్లుండేది, కానీ దాని మీది నుండి కూడా ఆకాశం అందలేదు. బెంగుళూరులో ఆకాశం చాలా ఎత్తులో ఉంటుందేమో, మరి. అంతే కాదు, ఆ ఆకాశానికి చాలా తక్కువ నక్షత్రాలు వేలాడదీసి ఉన్నాయి!

అంతలో నక్షత్రాలను తాకడానికి ముత్తుకు ఒక మంచి అవకాశం వచ్చింది. ముత్తు, అమ్మ, నాన్న తిరుపతి కొండకు బయలుదేరారు. అలిపిరి దగ్గర బస్సు దిగే సరికి సాయంత్రం ఆరు గంటలయింది. అలిపిరి దగ్గర నుండి నామాల కొండను చూసేసరికి ఆ పాపకు భలే ఉషారొచ్చేసింది. అంత ఎత్తైన కొండను తనెప్పుడూ చూడలేదు. ఆ కొండ నిజంగా ఆకాశాన్ని తాకుతున్నది. నామాల కొండను ఎక్కే సరికి చీకటి పడుతుంది. తప్పకుండా నక్షత్రాలను తాకొచ్చు!

ఉత్సాహంగా కొండ ఎక్కింది ముత్తు. మెట్లమీద అంతటా పై కప్పు బిగించి ఉంది. దాంతో పాపకు ఒక సొరంగంలో పోతున్నట్లుంది. ’సొరంగం’ పక్కన్నుంచి ఆకాశంలో అద్భుతంగా మెరిసిపోతున్నాయి, నక్షత్రాలు! 'తొందర్లో నామాల కొండ పైకి చేరుకుంటాను, నక్షత్రాలతో ఆడుకుంటాను ' అని ఎంతో సంతోషపడింది ముత్తు.

కానీ, పాపం! నామాల కొండ మీదకు పోయినా ముత్తుకు నక్షత్రాలందలేదు. ఆ కొండమీదకు పోయిన తర్వాత కూడా దారి ఇంకా పైకి పోతోంది. పాపకు బాధ వేసింది. అయినా 'ఇంకొంచెం పైకి పోతే అకాశం అందుతుందేమోలే' అని ఆశ పడింది. నాన్న తనను అప్పుడప్పుడూ భుజాల మీద కూర్చోబెట్టుకొని ’దేవుడమ్మ, దేవుడు’ అని పాడుతూ నడుస్తున్నాడు. అప్పుడు తను ఒక చేయి పైకి చాచి ఆకాశాన్ని తాకడానికి ప్రయత్నించింది. అయినా ఏమీ లాభం లేదు.. నక్షత్రం ఒక్కటీ అందలేదు.

ఇంతలో మరొక ఎత్తైన కొండ కనబడింది. ’ముత్తూ, అదిగో అది మోకాళ్ళ మెట్ల కొండ!' అది ఎక్కేసామంటే మనం దేవుని దగ్గరకు చేరుకోవచ్చు’ అని నాన్న చెప్పాడు. ఈ కొండెక్కిన తర్వాతయినా నక్షత్రాలను తాకేకి వీలవుతుందని ముత్తు ఆశ పడింది. తను చాలా గట్టి ప్రయత్నం చేసి ఎక్కింది. చివరికి మోకాళ్ల మెట్ల కొండ ఎక్కినా నక్షత్రాలు అందలేదు.

పొద్దున్న గుడికెళ్లి బయటకొచ్చినపుడు పడమర పక్కన ఇంకో పెద్ద కొండ కనిపించింది. దానిమీద ఒక పెద్ద టవరు కూడా కనిపిస్తోంది. ’ఇదేంటో, కొండ మీద కొండ, కొండమీద కొండ... ఇక్కడ ఆకాశం నిజంగా చాలా ఎత్తులో ఉంది. కొత్తపల్లిలోనే మేలు. మాతోటకానుకొని ఉండే చిన్న కొండను తాకుతూ ఉంటుంది ఆకాశం’ అని ఆ యాత్రలో తన కోరికను పూర్తిగా పక్కన పెట్టేసింది.

వెనక్కి వచ్చాక, ముత్తు బడికి పోతూ దారి పక్కన పూల చెట్ల మీద సీతాకోకచిలుకలను చూసింది. చాలా ముచ్చటేసింది. వాటిని పట్టుకుందామని చాలా ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నం చేస్తే అవి తనకు అంత దూరంగా పోతున్నాయి. చివరికి కొంచెం సేపు గమ్మునే నిల్చుకున్నది. చూస్తూండగానే ఒక సీతాకోకచిలుక ఎగిరివచ్చి, ఆ పాప లంగా మీద వాలింది!

ఆరోజు రాత్రి మంచం మీద పడుకొని నక్షత్రాలను చూస్తున్నప్పుడు ముత్తుకు సీతాకోకచిలుకలు గుర్తుకొచ్చాయి. ’సీతాకోకచిలుకలు మన దగ్గరికి రావాలంటే అవి మనల్ని చూసి భయపడకూడదు..నక్షత్రాలు కూడా అంతే. నేను పట్టుకుంటానని భయపడి, అవి నా నుంచి దూరంగా పోతున్నాయి’ అనుకున్నది. ఇక నక్షత్రాలను పట్టుకోవాలన్న ఆలోచనను పక్కన పెట్టి, గమ్మునే వాటిని చూస్తూ ఉండి పోయింది... కొంతసేపటికి, అద్భుతం జరిగింది! నక్షత్రాలు నిజంగానే దగ్గరవడం మొదలెట్టాయి! ..నెమ్మదిగా అవి తన చేతికి అందేంత ఎత్తుకు చేరుకున్నాయి. ముత్తు ఇప్పుడు వాటిని తాకుతున్నది! ఊపుతున్నది! గిరగిరా తిప్పుతున్నది! అద్భుతంగా ఉంది! ముత్తుకు సమయం తెలీలేదు. ఇంతలో అమ్మ పిలుపు వినబడింది - "ముత్తూ, లేరా నాన్నా, అన్నం తిని పడుకుందువు గానీ" అని.

ముత్తు చాలా పెద్దయిన తర్వాత కూడ చిన్ననాటి ఈ సంగతులు కళ్లకు కట్టినట్లు గుర్తుండి పోయాయి. ఆనాటి ఆలోచనలు తన బుర్రకు బాగా పదును పెట్టాయి. ఆ తరువాత ఆ పాప చాలా చదివింది, చాలా ఆలోచించింది. అదేంటో మరి, ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఆకాశం అంత ఎక్కువ ఎత్తుకు వెళ్లి పోయింది! నక్షత్రాలూ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. అయితే ముత్తు కూడా ఇప్పుడు చాలా పెద్దదయింది. ఆమె ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్త!