అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఉన్నత పాఠశాల ఒకటి ఉండేది. ఆ బళ్లో పదో తరగతిలో నలభై మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్లలో చిన్నా అనే అబ్బాయికి చదువు పట్ల ఆసక్తి తక్కువ.

ఒకరోజున వాళ్ల తెలుగు టీచరు కొన్ని ప్రశ్నలిచ్చి, "రేపు వీటిలోంచి తెలుగు పరీక్ష పెడుతున్నాను. అందరూ చక్కగా చదువుకొని రావాలి!" అని చెప్పింది.

'పరీక్ష' అన్న మాట వినగానే చిన్నాకు భయం వేసింది- ఎందుకంటే, పరీక్షలో ఫెయిల్ అయితే టీచర్ కోప్పడుతుంది మరి! 'ఎలాగైనా సరే పరీక్ష బాగా రాయాలి' అనిపించింది చిన్నాకు. కానీ వాడు అప్పటివరకూ ఏమీ చదవలేదాయె! మరెలాగ?

అందుకని, వాడు ఇంటికి వెళ్లి, ఒక తెల్ల కాగితం తీసుకొని, టీచరు ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు కాపీగా రాసుకోవడం మొదలుపెట్టాడు. మరునాడు టీచరు పరీక్ష పెట్టినప్పుడు ఆవిడకు తెలీకుండా ఈ కాగితంలోంచి చూసి రాసేద్దామని వాడి ఆలోచన.

అంతలో వాళ్ల నాన్న అక్కడికి వచ్చాడు. "ఏమి రాస్తున్నావురా, చిన్నా" అని అడిగాడు.

చిన్నాకు అబద్దం చెప్పడం రాదు. "రేపటి తెలుగు పరీక్షకోసం కాపీ తయారుచేసుకుంటున్నాను నాన్నా" అని చెప్పాడు.

"ఏదీ, ఇలా చూపించు" అన్నాడు వాళ్ల నాన్న.

చిన్నా, వాళ్ల నాన్నకు తను రాసుకుంటున్న కాపీని చూపించాడు.

"చిన్నా, నువ్వు కాపీని చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాశావు. చిన్నగా రాసుకుంటే మంచిదేమో" అన్నాడు చిన్నా వాళ్ల నాన్న.

"సరే"నని మరో కాగితం తీసుకొని, చిన్న అక్షరాలతో రాసి చూపించాడు చిన్నా.

"అక్షరాలైతే చిన్నగా ఉన్నాయి కానీ, ఈ కాగితం చాలా పెద్దదిగాఉంది. ఇలా అయితే మీ టీచరుకు నీ కాపీ విషయం సులభంగా తెలిసిపోతుంది. ఇంకో చిన్న కాగితం తీసుకొని రాసుకుంటే బాగుంటుంది కదా చిన్నా" అన్నాడు తండ్రి.

`అవునుకదా' అనిపించింది చిన్నాకు. వెంటనే వాడు ఇంకో కాగితం తీసుకుని రాసుకున్నాడు. అప్పటికి తను కాపీకోసమని, ఒకే ప్రశ్నలు-జవాబుల్ని మూడుసార్లు రాసినట్లయింది. ఇప్పుడు వాడికి ఆ ప్రశ్నలు, జవాబులు నోటికి వచ్చేశాయి!

అంటే మూడుసార్ల సాధన పూర్తయిందన్న మాట!

ఇక చిన్నాకు కాపీ అవసరం లేదనిపించింది. ఆ మర్నాడు తను కాపీ లేకుండానే బడికెళ్లి పరీక్షరాశాడు. అన్ని జవాబులూ సరిగా రాశాడని టీచరు వాడిని చాలా మెచ్చుకున్నది కూడా.

అప్పుడు అర్థమైంది చిన్నాకు, `పరీక్ష అంటే భయపడనవసరం లేదు, కొంచెం సాధన చేస్తే సరిపోతుంది' అని. అదే స్ఫూర్తితో వాడు బాగా చదివి, సంవత్సర పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించాడు.

తన ప్రయత్నం ఫలించినందుకు వాళ్ళ నాన్న ఎంతో సంతోషించాడు.