ఒక ఊరిలో రాజేష్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతను ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు. కానీ పద్యాలు, కవితలు, రచనలు వంటివి బాగా రాసేవాడు. అయినా అతనిని ఎవరూ ఏమంత మెచ్చుకునేవారు కాదు.

ఒకసారి రాజేష్ బడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఒక కొండను చూశాడు. అది చాలా విచిత్రంగా ఉంది. చూడగా అది ఒక మనిషి లాగా కనిపించింది! రాజేష్ కు ఆశ్చర్యం వేసింది. "భలే కొండ" అనుకున్నాడు.

ఇక ఆ రోజు చీకటిపడ్డాక ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆకాశంలోకి చూశాడు రాజేష్. అప్పుడతనికి ఆకాశంలో ఒక అందమైన విమానం కనపడింది. "అబ్బ! ఏం విమానం! ఇలాంటిది నా దగ్గర ఒకటుంటే ఎంత బాగుంటుంది!" అనుకున్నాడు.

తెల్లవారగానే చిన్న చిన్న అట్టముక్కలన్నీ సేకరించి, వాటితో ఒక చక్కని విమానం బొమ్మను తయారు చేసేశాడు కూడా. "ఇంత అందమైన విమానంలో దేన్నైనా ఉంచితే బావుంటుంది. దేన్నుంచాలబ్బా?.." అని ఆలోచిస్తుండగానే పక్కన బొమ్మల బండి ఒకటి వెళుతూ కనిపించింది అతనికి. వెంటనే తను కూడబెట్టిన డబ్బులోంచి ఐదు రూపాయలిచ్చి, చక్కని చేప బొమ్మనొకదాన్ని కొన్నాడు. అతనికి అది చాలా ముద్దుగా అనిపించింది. దాన్ని తీసుకెళ్లి విమానంలో కూర్చోబెట్టాడు భద్రంగా.

ఇక ఆ రోజు రాత్రి నిద్ర మధ్యలో లేచి, అనుకోకుండా ఆకాశంలోకి చూశాడు రాజేష్. చూస్తే, విమానం ఒకటి గిరగిరాలు కొడుతూ కనిపించింది. నక్షత్రాలతో ఆడుకుంటున్నట్లు ఎగురుతోంది, ఆ విమానం! ఒకసారేమో పైకి ఎగురుతుంది; మరోసారి కిందికి వచ్చినట్లు అనిపిస్తుంది; మరోసారేమో అక్కడే నిలబడినట్లు అనిపించింది! "ఇంత రాత్రి వేళల్లో కూడా విమానాలు ఇట్లా ఎగురుతాయా!" అని రాజేష్ కి ఆశ్చర్యం వేసింది. దానికి తను తయారుచేసిన విమానాన్ని చూపెడదామనిపించింది. ఇంట్లోకి పరుగెత్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ విమానం లేదు! వెంటనే బైటికి వచ్చేశాడు రాజేష్ "ఎటు వెళ్లింది, ఇది?" అనుకుంటూ.

అంతలోనే, ఎగురుతున్న ఆ విమానంలోంచి చేప ఒకటి సర్రున వచ్చి రాజేష్ ముందు నిలబడింది- గాలిలోనే.

"ఏంటి రాజేష్, అలా చూస్తున్నావు?" అని అది రాజేష్ ని అడిగింది.

అప్పుడు రాజేష్ "నువ్వు చేపవు. ఎలా మాట్లాడగల్గుతున్నావు?" అని అడిగాడు.

అప్పుడు ఆ చేప "నేను చేపను కాను". "మనిషి లాగే ఉండే ఒక కొండను" అంది.

"నువ్వు చేపవు..కొండవి ఎలా అవుతావు?" అని అడిగాడు రాజేష్.

అప్పుడు చేప "రాజేష్! నువ్వు మొన్ననే నన్ను చూశావు. గుర్తుందా?" అని అడిగింది.

"నిన్ను ఎప్పుడు చూశాను నేను?" అన్నాడు రాజేష్.

"మొన్న, బడి నుండి ఇంటికి వెళుతూ నువ్వు చూసిన మనిషి లాంటి కొండను నేనే!" అన్నది అది.

"ఆ... గుర్తొచ్చింది, కానీ ఆరోజు చూసినప్పుడు నువ్వు మనిషిలా ఉన్నావు; ఇప్పుడు చూస్తే చేపలా ఉన్నావు! నాకు ఏమీ అర్థం కావట్లేదు" అన్నాడు రాజేష్.

"ఇప్పుటి చేపనూ నేనే! అప్పటి కొండనూ నేనే! అంతే కాదు ఇప్పటిదాకా పైన ఎగిరిన విమానాన్ని కూడా నేనే! అన్నీ నేనే, హ హ హ!" అని నవ్వింది చేప.

"నేను చూసినవన్నీ నువ్వే అంటున్నావు. ఇంతకీ ఎవరు, నువ్వు?" అని అడిగాడు రాజేష్.

అప్పుడు చేప "నిజానికి దివ్యశక్తులు గల ఒక పక్షిని నేను!" అన్నది. అంటూండగానే దానికి రెక్కలు మొలిచాయి. ఇప్పుడు అది పక్షిలా మారిపోయింది.

ఆశ్చర్యంగా చూస్తున్న రాజేష్ తో అది మళ్లీ అంది. "రాజేష్, నువ్వు ఒక కోరిక ఏదైనా కోరుకో" అని.

అప్పుడు రాజేష్ "నేను మంచి స్కూల్ లో చదువుకోవాలని దీవించు" అని అడిగాడు.

అప్పుడు ఆ పక్షి "అలాగే. కానీ నాకు ఓ సంగతి చెప్పు, మంచి బడి అంటే ఏమిటి? ఎట్లా ఉంటే 'మంచి స్కూలు' అని తెలుస్తుంది?" అని అడిగింది.

"నాలా బాగా ఆలోచించే పిల్లలను మెచ్చుకునేదే మంచి బడి" అని చెప్పాడు రాజేష్.

"అంటే, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్న బళ్లో ఎవ్వరూ నిన్ను మెచ్చుకోవటం లేదా?" అని అడిగింది పక్షి.

మెల్లిగా తలవాల్చుకున్నాడు రాజేష్.

"అది సరేలేగానీ.. నువ్వు ఎవరెవర్ని మెచ్చుకుంటావు రోజూ?" అడిగింది పక్షి.

"ఎవరైనా నాతో మాట్లాడితేనేగా.. నేను మెచ్చుకోవడమూ, మరేదైనా చేయడం" అన్నాడు రాజేష్.

"అయినా, ఒకరు నిన్ను మెచ్చుకోవాలనే కోరిక నీకు ఎలా ఉందో, అలాగే అదే కోరిక మిగతా పిల్లలకూ ఉండవచ్చుగా?" అని రాజేష్ ను అడిగింది పక్షి.

'అవును, ఉండవచ్చు' అన్నాడు రాజేష్.

'ఇంకొకరు చేసిన మంచి పనిని నువ్వు మెచ్చుకోవడం మొదలుపెట్టు రాజేష్! అప్పుడు నిన్ను కూడా మెచ్చుకునే వాళ్ళు వస్తారు' అని రాజేష్ తో ఆప్యాయంగా చెప్పింది పక్షి.

విషయం అర్థమైన రాజేష్, తరువాతి రోజు నుండీ ఇతరులతో మంచిగా మాట్లాడడం, ఇతరులకు తన శక్తిమేర సహాయం చేయడం, తనకు కొత్త విషయాలు తెలిస్తే ఇంకొకరికి తెలియజెప్పటం మొదలు పెట్టాడు. కొన్ని రోజుల్లోనే తరగతిలోని మిగతా పిల్లలూ రాజేష్ తో స్నేహంగా మెలగసాగారు- చదువుల పరంగా కూడా సహాయం చేయటం మొదలుపెట్టారు. పిల్లలలో వచ్చిన మంచి మార్పు అందరినీ ఆనందింపజేసింది. అందరూ ఉపాధ్యాయుల మెప్పునొందారు.

దీన్నంతా గమనిస్తూండిన పక్షి సంతోషంతో ఎగురుకుంటూ పోయింది. మనిషిలాంటి కొండ ఎండకు బంగారం మాదిరి మెరిసింది.