పూర్వం చైనాలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఒట్టి పిసినారి. ఖర్చు చేస్తే డబ్బులు అయిపోతాయని వాటిని ఖజానా నుండి బయటికికూడా తీసేవాడు కాదు. దానితో ఇంకేముంది, ప్రజలంతా సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడేవారు. కానీ రాజుగారు మాత్రం అవేమీ పట్టనట్లుగానే ఉండేవారు.

ఒకసారి ఆ పిసినారి రాజుకు గొప్ప జ్వరం వచ్చి పట్టుకుంది. ఎంతగానంటే, అది రాజవైద్యుల వైద్యానికి ఏమాత్రమూ లొంగలేదు. రానురానూ రాజుగారి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. ఆయనకిక ప్రాణభయం పట్టుకుంది.

పిసినారి రాజుగారి అనారోగ్యం గురించి ఆ దేశ ప్రజలందరికీ తెలిసింది. ఒకనాడు వైద్యుడు ఒకడు రాజుగారి దగ్గరికి వచ్చి "నేను అడిగింది ఇస్తే మీ జ్వరాన్ని ఒక్క వారం రోజుల్లో పోగొడతాను" అని చెప్పాడు. "ఏమడుగుతావో అడుగు" అన్నాడు రాజు.

"ఏముంది మహారాజా, నాది చాలా చిన్న కోరిక. మీకు తెలుసుకదా, చదరంగం పటంలో మొత్తం అరవై నాలుగు గళ్లుంటాయి. మొదటి గడికి గాను నాకు ఒక బస్తా బియ్యం ఇవ్వండి. రెండవగడికి రెండు బస్తాలు, మూడవగడికి నాలుగు బస్తాలు, నాలుగవ గడికి ఎనిమిది బస్తాలు, ఇలా పటంలోని ప్రతి గడికిగాను ముందుగడికి రెండితల బియ్యపుబస్తాలు లెక్కగట్టి ఇస్తే చాలు" అన్నాడు ఆ వైద్యుడు.

రాజుగారు వెంటనే ’సరే’ అన్నారు. అన్నట్లుగానే వైద్యుడు రాజుగారి జ్వరాన్ని ఒక్క వారం రోజుల్లో తగ్గించాడు. అప్పుడుగాని రాజుగారికి ఆ వైద్యుడు అడిగిన బహుమానం ఎంతవుతుందో లెక్క వేసే వీలు చిక్కలేదు. తీరా లెక్క తేలే సరికి రాజుకు మళ్లీ జ్వరం వచ్చినంత పనైంది!

మీరే చెప్పండి!

రాజుగారు వైద్యుడికి ఎన్ని బస్తాల బియ్యాన్ని ఇవ్వాలో!