పైన్ వృక్షాలూ, సెడార్ వృక్షాలూ, పర్ చెట్లూ మన మామిడి చెట్ల మాదిరి ఎప్పుడూ పచ్చగా ఉంటాయని అనుకుంటారు అందరూ. అయితే చాలాచాలా సంవత్సరాల క్రితం అవి అలా ఉండేవి కావు. మిగిలిన చెట్లమాదిరే అవికూడా శిశిర ఋతువు రాగానే ఆకుల్ని పూర్తీగా రాల్చేసి బోడిబోడిగా తయారయ్యేవి. ఆ కాలపు కథన్న మాట ఇది.

ఆ రోజుల్లో తోఫాలర్ అనే పట్టణం నుండి ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు, వేటాడటం కోసం.

అట్లా వేటాడుతూ వేటాడుతూ అడవిలో చాలా లోపలికి వెళ్లిపోయాడు అతను. పోతూపోతూ ఉంటే అతనికి ఒక పెద్ద ఊబి అడ్డం వచ్చింది. అతను కష్టపడి దాన్ని దాటుకొని ఇంకా ముందుకు పోతే ఒక చదునైన ప్రదేశం ఎదురైంది. అక్కడ కనిపించిన దృశ్యం అతన్ని ఆశ్చర్యచకితుణ్ని చేసింది. ఏడు కుందేళ్లు, పైన ఎక్కి కూర్చునేందుకు వీలుగా జీను వేసుకొని అక్కడ వరసగా నిలబడి ఉన్నాయి!

వేటగాడు చూస్తుండగానే ఏడుగురు మరుగుజ్జులు - ఒక్కొక్కరూ ఒక్కొక్క కుందేలంత ఉంటారేమో - వాళ్లు భూమినుండి ఏడు కన్నాల ద్వారా బయటకొచ్చి కుందేళ్ల వైపుకు నడవటం మొదలెట్టారు. వాళ్లంతా తోఫాలర్ మనిషిని చూడగానే ఆగి, అన్నారు " జీవ జలం త్రాగటం వల్ల మేం అమరులం అయ్యాం. మరి నువ్వెవరు? " అని.

"నేనొక వేటగాడిని " అన్నాడు తోఫాలర్ మనిషి.

"మా రాజ్యంపైకి ఎలా వచ్చిందో ఏమో, ఒక భయంకర మృగం వచ్చి పడింది. మా అంతట మేము ఎన్నటికీ మరణించం. కానీ ఆ జంతువు ఈ మధ్యనే మాలో ఒకడిని చంపేసింది. నువ్వు చూడబోతే బలశాలి మాదిరి ఉన్నావు. కాస్త దాన్ని చంపి పుణ్యం కట్టుకోరాదూ? " అన్నారు మరగుజ్జు మనుషులు.

"సరే" అని వేటగాడు తన ధనస్సూ , బాణమూ చేతబూని ముందుకు సాగాడు ఆ కౄరమృగం కోసం వెదుకుతూ. కానీ ఎంత వెదికినా అలాంటిదేమీ తారసపడలేదు. నేలమీద కుందేళ్ల కాలి జాడలూ, ఒక అడవి దుప్పి కాలి జాడలూ ఉన్నాయంతే. ఎంతవెదికినా అతనికి ఆ బయంకర మృగం కనబడలేదుగానీ, ఒక చోట అడవి దుప్పే ఎదురైంది. వెంటనే అతను దాన్ని చంపి, చర్మం ఒలిచి పట్టుకొని , ఇంకా వెదకటం కొనసాగించాడు. రాత్రయింది కానీ భయంకర మృగం జాడలేదు! చివరికి అతను నిరాశగా వెనుదిరిగి, మళ్ళీ ఏడుగురు మరగుజ్జుల్ని కలుసుకున్నాడు.

"నన్ను క్షమించాలి. ఎంత వెదికినా మీరన్న భయంకర జంతువు నాకు కనబడలేదు. " అన్నాడతను. వాళ్లతో బాధగా.

కానీ అతని భుజంమీది దుప్పి చర్మాన్ని చూడగానే వాళ్లు సంతోషంతో ఎగిరి గంతులేశారు - " అదే, అదే. ఆ చర్మపు జంతువు గురించే మేం చెప్పింది!" అని. వాళ్ల పెద్ద వేటగాడి దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా అభినందించాడు. "నువ్వు మమ్మల్ని కాపాడావు. కరుణతో నువ్వుచేసిన ఈ పనికి మేం ప్రత్యుపకారం చేయకుండా ఉండం. మీరు మీ రాజ్యానికి వెళ్లి, మాకోసం ఎదురుచూడండి. మేం మీకోసం జీవజలం తెస్తాం. అది త్రాగి మీరూ, మీరాజ్యపు ప్రజలు కూడా మామాదిరే అమరులు కాగలరు" అని చెప్పాడు.

వేటగాడు తన ఊరికి తిరిగివచ్చాడు. ఊబి దాటిన తర్వాత అడవిలో తాను చూసిన వింత మరుగుజ్జులను గురించీ, వాళ్ళు చెప్పిన జీవజలం గురించీ ఊళ్లో అందరికీ చెప్పాడు.

తోఫాలర్ ప్రజలు మరగుజ్జు వాళ్లు వస్తారేమో అని చాలా నెలలపాటు ఎదురుచూశారు. కానీ వాళ్లెవరూ రాలేదు! క్రమంగా అందరూ వాళ్ల గురించి మరచిపోయారు.

ఒక రోజున తోఫాలర్ నుండి కొందరు ఆడవాళ్లు కట్టెపుల్లలు ఏరుకురావడానికని అడవికి వెళ్ళారు. అకస్మాత్తుగా వాళ్లకో అధ్బుత దృశ్యం కనబడింది. కుందేళ్లు ఏడు- దుముక్కుంటూ,గెంతుకుంటూ వాళ్లవైపే వస్తున్నాయి! ఒక్కొదానిమీద ఒక్కో మరగుజ్జు కూర్చొని ఉన్నాడు! ఒక్కొక్కని చేతిలోనూ ఒక్కొక్క కూజా ఉన్నది!

ఆ దృశ్యం చూసిన స్త్రీలందరూ ఒక్క సారిగా పగలబడి నవ్వారు.

ఆ అవమానానికి ఏడుగురు అమరులూ చిన్నబుచ్చుకున్నారు. కూజాల్లో తాము తెస్తున్న జీవజలాన్ని అక్కడే ఒంపేసి వెనుదిరిగారు. గెంతుకుంటూ తమకు వీలయినంత వేగంగా వెళ్ళిపోయారు.

తోఫాలర్ ప్రజలకు జీవజలం అందకుండా పోయింది. వాళ్లంతా అమరులయ్యే అవకాశం చేజారిపోయింది. అయితే ఆ నీరు అందిన సెడార్ , ఫర్, పైన్ చెట్లు మాత్రం అమరత్వాన్ని సంతరించుకొని, ఎప్పటికీ ఎండకుండా అలరారుతున్నాయి నేటికీ!