అనగా అనగా రామాపురం అనే పల్లెటూరు ఉండేది. రామాపురం అంతా పచ్చని చెట్లు ఉండేవి. ఆ చెట్ల మధ్య రామాపురం చాలా అందంగా కనబడేది. ఆ ఊరికి 10 కిలోమీటర్ల దూరంలోనే ’మదనపల్లె’ అనే ఇంకొక పల్లెటూరు ఉండేది. కానీ ఆ పల్లెలో అసలు చెట్లనేవే ఉండేవి కావు.

రామాపురంలోని ప్రజలు సుఖసంతోషాలతో బ్రతుకుతున్నారు. వారికి ఏకష్టం వచ్చినా చెట్లనుండి పండ్లు కోసి పట్టణానికి వెళ్ళి, అమ్మి, వారి కష్టాలు తీర్చుకునేవారు. కాని మదనపల్లెకు మాత్రం కరువుకాటకాలు, దారుణాలు సంభవించేవి. జీవించటం కష్టంగా ఉండేది.

మదనపల్లెనుండి రామాపురం బడికి వెళ్ళేవారు చాలా మంది పిల్లలు. ఆ బడిలో చక్కగా చదువులు చెప్పేవారు. ఆ బడి అన్నా, అందులోని టీచర్లన్నా ఎనలేని అభిమానం ఉండేది చాలామంది పిల్లలకు. అందులో ఒక పిల్లవాడు తన స్నేహితుడితో ’ఒరే, మన పల్లె అంతటా ఎందుకురా, చెట్లే లేవు? రామాపురంలోని ప్రజలలాగా మనంకూడా మొక్కలు నాటి ఊరంతా పచ్చదనంతో నిండేలాచూద్దామా’ అని అడిగాడు. ’సరే’ అన్నాడు అతని స్నేహితుడు. ఇద్దరూ ఆరోజు సాయంత్రం బడిలో గుంతలు త్రవ్వి, మొక్కలను నాటారు. వారిని చూసిన ప్రజలుకూడా ప్రతి ఇంటిదగ్గరా రెండు మూడు చెట్లు నాటి, నీళ్ళు పోసి పెంచటం మొదలుపెట్టారు.

కొన్ని నెలలకు చెట్లన్నీ పెద్దవై నిలదొక్కుకున్నాయి. మూడు-నాలుగేళ్ళు గడిచేసరికి అవి పెద్ద పెద్ద మానులై, పూతపూసి, కాయలు కూడా కాయటం ప్రారంభించాయి. కాయలు తీయని పండ్లైనాయి. అప్పుడు స్నేహితులిద్దరూ "ఒరే, మనం మొక్కలను నాటినందుకు మన పల్లె అంతా పచ్చదనంతో అందంగా కనిపిస్తోంది. ఇలా ప్రతిఒక్కరూ ఒక మొక్కను పెంచితే అవే రేపటికి వృక్షాలై మన జీవనానికి ఆధారాలౌతాయి. అంతేకాదు చెట్లను పెంచితే మనం సంతోషంగా, ఆరోగ్యంగా బ్రతకగలం" అని మాట్లాడుకొని, కొంతమంది పిల్లలను ఊరు బయటికి తీసుకొని వెళ్ళి, రోడ్డు ప్రక్కన చెట్లను నాటారు. అవి పెద్దవై, అవీ కాయలు కాసాయి.

ఒకనాడు ఆ పల్లెటూరుకు వ్యవసాయ శాఖా మంత్రి, కలెక్టరు వచ్చి ఊరులోనికి ప్రవేశిస్తూ ఉండగా ఎక్కడచూసినా పండ్లతో నిండిన చెట్లే! వారు ఆ పల్లెను చూస్తుంటే అదంతా పచ్చని అడవిలాగా ఉంది. పచ్చదనం మధ్యలో కనబడుతున్న ఆ పల్లెను చూస్తుంటే వారి మనసులు గాలిలో తేలుతున్నట్లుగా ఉంది. ఆ పల్లెలో అంతటా తిరిగి మురిసిపోయిన వ్యవసాయ శాఖామంత్రి, కలెక్టరు ఆ పల్లె ప్రజలను, ఆ మార్పుకు కారకులైన స్నేహితులిద్దరినీ అభినందించారు.

అలాగే మీరుకూడా, రోడ్లవెంబడి వెళ్ళేటప్పుడు మొక్కల్ని గిల్లకుండా, ఆకుల్ని తుంచకుండా, చెట్లను నరకకుండా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇంటికి ఒక్కొక్క మొక్కను పెంచితే మన పల్లెలు ఎడారులు కావు. మనందరి భవిష్యత్తూ అలా మెరుగుపడుతుంది. అందువల్ల మనందరం కృషి చేసి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.