పూర్వం జమ్మూ కాశ్మీర్ లో బ్రెనీ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు భార్యా - భర్తలుండేవారు. వారికి ఒక కూతురు ఉండేది. భర్త చాలా సోమరిపోతు. ఒక నాడు అతని భార్య అతన్ని బాగా తిట్టింది. అందుకు సణుక్కుంటూ వాడు తన వేటకుక్కనూ, తన పాత తుపాకీని తీసుకొని వేటకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉదయం నుండి సాయత్రందాకా వేటకోసం వెదికాడు. కానీ వాడికేం దొరకలేదు. సాయంత్రం అయ్యేసరికి వాడికి ఎక్కడలేని అలసట వచ్చింది.

అలవాటులేని ప్రాణం కదా, ఊరికే పచ్చని గడ్డిపైన పడుకున్నాడు అక్కడే. ఒక గంట అయ్యాక లేచి ఊరివైపు నడక సాగించాడు. ఇప్పుడిక సోమరివాడికి దాహం అవ్వటం మొదలుపెట్టింది. శరీరం, మనస్సు సారాయి కావాలని గోలపెడుతున్నాయి.

వాడు అలా పోతూఉండగా వెనుక నుండి ఒక ముసలివాడు నెత్తిమీద ఒక డబ్బానిండా ద్రాక్ష సారాయి తీసుకుని వస్తున్నాడు. సోమరిపోతు ఆలోచనల్ని చదివినట్లే, వాడు అతన్ని కేకవేసి పిలిచాడు. వేటగాడు ఆశగా ముసలివాని దగ్గరకి వచ్చాడు. ముసలివాడు ఆ డబ్బాను అతని భుజంపై పెట్టి అతన్ని లోయలోనికి పిలుచుకుని పోయాడు. వీడూ మారుమాట్లాడకుండా ముసలివాడిని అనుసరించాడు.

అక్కడ కొంతమంది ఏదో ఒక ఆట ఆడుతూ ఉన్నారు. వీరిని చూడగానే వారంతా ఆ ఆటను ఆపి వాళ్ల చుట్టూ మూగారు. ఆ ముసలివాడు, "ఓయీ! వారికి ఆ డబ్బాలోని ద్రాక్షరసం పోయి" అని అన్నాడు. వాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాసులో ఆ ద్రవాన్ని పోసి ఇచ్చాడు. వాళ్లు తొందర తొందరగా దాన్ని తాగి, తిరిగి ఆట మొదలు పెట్టారు.

వేటగాడు ఇక ఆగలేకపోయాడు. తానుకూడా ఆ ద్రాక్షరసం తాగిచూశాడు. పులిసిపోయి, సారాయి కంపు కొడుతున్నప్పటికీ అది అతనికి చాలా బాగుందనిపించింది. అతడు ఆ డబ్బాలోని ద్రాక్షరసాన్నంతా తాగేసి, అక్కడే పడుకున్నాడు. ఆ తరువాత ఏమైందో అతనికే తెలీదు.

తిరిగి లేచి చూసుకునే సరికి, అతనికి చాలా నీరసంగా అనిపించింది. మోకాళ్ళు సహకరించటంలేదు. అతని తుపాకీ తుప్పుపట్టి అతని ప్రక్కనే పడి ఉన్నది. వాడు ఆశ్చర్యపోతూ, ఆ తుప్పుపట్టిన తుపాకీనే తీసుకుని తన కుక్క కోసం చుట్టూ గాలించాడు. కుక్క జాడలేదు.

తర్వాత ఊరిలో నడుచుకుంటూ పోతూ ఉంటే కుక్కలు మొరుగుతున్నాయి. పిల్లలు అతనిని చూచి, "ఏయ్ గడ్డం! ఏయ్ గడ్డం!" అని వెక్కిరిస్తున్నారు. అప్పుడు అతను తన గడ్డాన్ని చూసుకున్నాడు. అది చాలా పొడవుగా పెరిగిఉన్నది.

తర్వాత అతను వాళ్ల ఇంటికి వెళ్లి చూశాడు. తమవాళ్ళు ఎవరూ కనబడలేదు. అతను ప్రక్క ఇంటికి వెళ్లి చూశాడు. ఆశ్చర్యం! వాళ్ళూ మారిపోయి ఉన్నారు. "మీ ప్రక్క ఇంట్లో ఒక ఆమె, ఒకపాప ఉండాలి, వాళ్లు ఎక్కడికి వెళ్లారు?" అని అడిగాడు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆమె ఒక చెట్టు కిందవున్న ఒక యువతిని అతనికి చూపించి లోపలికి వెళ్ళిపోయింది. ఆ యువతిని చూస్తే సోమరిపోతుకు తన భార్య గుర్తుకు వచ్చింది. ’కానీ ఆమె ఇంత చిన్నగా, సన్నగా ఎలా అయింది?.’

సోమరికి తల తిరిగినట్లుగా అయ్యింది. తన మెదడు చెడిపోయిందని అతడు అనుకున్నాడు. మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి " నీవెవరమ్మా? నీ పేరేమిటి? మీ తల్లిదండ్రులెవరు?" అని అడిగాడు. అప్పుడు ఆ పాప "20 సంవత్సరాలకు ముందు వేటకోసం అని అడవికి తుపాకీని, కుక్కని తీసుకుని అడవికి వెళ్లాడు మా నాన్న. ఇక తిరిగి రాలేదు. ఏమైనాడో తెలీదు. కానీ కుక్క మాత్రం తిరిగొచ్చింది" అని తెలిపింది.

అప్పటికిగానీ సోమరికి పరిస్థితి అర్థం కాలేదు. తాను సారాయి త్రాగిన తరువాత దాదాపు ఇరవై సంవత్సరాలపాటు పడిపోయి ఉన్నాడు! తన మత్తు వదిలేసరికి లోకం అంతా మారిపోయింది! తన భార్యా బిడ్డలు తనను గానక ఎన్ని కటకటల పాలైనారో పరమాత్మునికే ఎరుక!

"అమ్మా! నేను మీ నాన్నను" అని ఏడుస్తూ చెప్పాడు అతను. జాగ్రత్తగా పరిశీలించి తన తండ్రి పోలికల్ని గుర్తుపట్టిన ఆ అమ్మాయి, అతన్ని సమీపించి గట్టిగా ఏడ్చింది. ఆమెద్వారా సోమరికి తన భార్య చనిపోయి చాలా సంవత్సరాలే అయిందని తెలిసింది. తన త్రాగుడు కారణంగా తనకు వాస్తవలోకపు స్పృహే లేకుండా పోయిందన్నమాట! బయట ఏం జరుగుతున్నదో కూడా తెలీకుండా తన జీవితంలోని విలువైన ఇరవై సంవత్సరాల సమయం వ్యర్థమైంది! ఇప్పుడిక తను ఏమి చేయగలడు? ముసలివాడై, శక్తియుక్తులు క్షీణించి, తోటివారెవరూ లేని ఈ ప్రపంచంలో ఇకపై తాను ఏకాకిలా ఒంటరిగా జీవించాలి!

ఆ తరువాత అతను తన సోమరితనాన్ని వదలిపెట్టాడు. త్రాగుడు మానివేశాడు. శ్రమిస్తూ, బాధ్యతగా జీవించాడు.