అనగనగా ఒక ఊరు . ఆ ఊరిలో ఒక పాప ఉండేది. ఆ పాపకు కేకులంటే చాలా ఇష్టం. ఒకనాడు ఆ పాప నిద్రపోతూండగా కేకులు కలలోకి వచ్చాయి. ఆ కలలో పాప కేకుల కోసం వెతుక్కుంటూ ఒక అడవిలోకి వెళ్ళింది. అడవిలో పాపకొక పెద్ద ఎలుగుబంటి కనిపించింది. పాప ఎలుగుబంటిని ’కేకులెక్కడుంటాయి?’ అని అడిగింది. ’కేకులు ఒక పెద్ద కొండమీద ఉన్న పెద్ద మర్రిచెట్టుకింద ఉంటాయ’ని ఎలుగుబంటి చెప్పింది. అంతలోనే పాపవాళ్ల అమ్మ వచ్చి పాపను నిద్రలేపేసింది. అప్పుడు పాప ’ఏంటమ్మా! నా నిద్రంతా పాడుచేశావు?’ అని రుసరుసలాడింది. ’సరేగానీ, వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా! స్కూలుకు వెళుదువుగాని!’ అని వాళ్ల అమ్మ అన్నది.

పాప స్కూలుకు వెళ్ళి, రాత్రి తనకొచ్చిన కలను తన మిత్రులందరికీ చెప్పింది. ఇతరులకు చెప్పినకొద్దీ ఆ పాపకు తన కల నిజందే అని ఇంకా ఇంకా అనిపించసాగింది. మరునాడు ఎలాగైనా అడవికి వెళ్ళి కేకులు సంపాదించాలనుకొంది. రాత్రయింది. అందరూ పడుకున్నాక పాప లేచి అడవిలోకి వెళ్ళింది. అడవిలో నిజంగానే పాపకు ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురైంది. తాను కలలో చూసి ఉన్నదే కనుక ఎలుగుబంటిని చూసి పాప భయపడలేదు. బదులుగా ’మర్రిచెట్టుండే కొండ ఎక్కడుంటుంద’ని పాప ఎలుగుబంటినే అడిగింది. ఎలుగు బంటికి పాప దైర్యం నచ్చింది. అది ముచ్చటపడి, పాపకు ఒక కొండను చూపించింది. పాప కొండెక్కి మర్రిచెట్టుకింద చూస్తే అక్కడ ఒక్క కేకు కూడా కనిపించలేదు. పాపకు చాలా బాధ కలిగింది. గట్టిగా ఏడ్చింది. అంతలోనే మర్రిచెట్టులో ఉండే దేవతలు ప్రత్యక్షమయి, ’ఏమి కావాలో కోరుకో’మన్నారు. పాప ’రెండు బండ్ల కేకులు కావాల’ని కోరుకొంది. దేవతలు రెండు బండ్ల కేకులిచ్చారు. పాప సంతోషపడింది. కానీ తనేమో చిన్నది. అన్ని కేకుల్ని తను ఇంటికెలా తీసుకెళ్ళాలి? ’నువ్వెలా వెళితే బండ్లుకూడా అలాగే నీవెంట వస్తాయ’న్నారా దేవతలు. పాప ముందు నడిస్తే, కేకుల బండ్లు వెనక వెళ్ళాయి. దారిలో పాప ఒక ఎలుగుబంటిని కలిసి, దానికి ఒక బండెడు కేకులను బహుమానంగా ఇచ్చి వెళ్ళింది.

అప్పటికి తెల్లవారింది. పాప వాళ్ల అమ్మా నాన్నలు లేచి అప్పటికే పాప కోసం వెతుకుతున్నారు. పాప ఇంటికి చేరుకొని, జరిగినదంతా వాళ్ళకు వివరించింది. కేకులకు బదులుగా బంగారాన్ని కోరుకొని ఉంటే బాగుండునని అన్నారు వాళ్ల అమ్మా, నాన్నలు. అంతే, కేకులన్నీ బంగారంగా మారిపోయాయి! వారందరూ చాలా సంతోషించారు.

అంతలో వాళ్ల పక్కింటావిడ అక్కడికి వచ్చింది. అంతా అడిగి తెలుసుకుంది. ఇంటికెళ్ళి తన భర్తకు చెప్పింది. వాళ్లిద్దరూ మహా ఆశపోతులు. తాము కూడా వెళితే తమకూ బంగారం దొరుకుతుందని ఇద్దరికీ తెగ ఆశ పుట్టింది. మర్నాటి రాత్రి భర్త బయలుదేరి అడవికి వెళ్ళాడు. అతనికీ ఒక ఎలుగుబంటి కనిపించింది. తెలిసిన సంగతే గనక అతను దానిని ’మర్రిచెట్టు ఎక్కడుంటుంద’ని అడిగాడు. కొండపై ఉంటుంద’ని చెప్పింది ఎలుగుబంటి. ఆశకొద్దీ కొండపైకి వెళ్లిన అతన్ని ఒక సింహం చూసి, అతని మీదికి దూకి, చంపి తినేసింది. ఆ విషయం పాప తల్లిదండ్రులకు, ఊళ్ళోని వారందరికీ తెలిసింది. అందరూ బాధ పడ్డారు. అదే ప్రమాదం పాపకు జరిగి ఉంటే ఏం చేసేవాళ్లమని పాప ఇంట్లో వాళ్లు అనుకున్నారు. ’దురాశ దు:ఖానికి చేటు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మా దురాశకు తగిన శాస్తి జరిగింది’ అని ప్రక్కింటావిడ దు:ఖించింది. ఏది ఏమైనా, అటు తరువాత పాప మళ్ళీ ఎన్నడూ అలాంటి దుస్సాహసం తలపెట్టలేదు.