ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకుండేవాడు. ఆ అబ్బాయి పేరు సురేష్. రామయ్య తన కొడుకయిన సురేష్ ను బడికి పంపక రోజూ తనతో పాటు పనికి తీసుకెళ్ళేవాడు. అందుకు సురేష్ ఏమీ బాధపడేవాడు కాదు- సాయంత్రం పని నుండి ఇంటికి రాగానే తన మిత్రుడయిన రమేష్ దగ్గరికి వెళ్ళి చదువుకొనేవాడు. స్వతహాగా చురుకైన రమేశ్ కూడా సురేశ్ కు తాను నేర్చినవన్నీ నేర్పిస్తుండేవాడు.

ఒకనాడు రామయ్య తన కొడుకును తీసుకొని సంతకు వెళ్ళాడు. సంతలో అతను ఒక వ్యాపారిదగ్గర నలభై రూపాయలకు సరుకులను కొని, అతనికి 50 రూపాయల నోటును ఇచ్చాడు. ఆ వ్యాపారి దాన్ని తీసుకొన్నాడు, కానీ వ్యాపారపు ఒత్తిడిలో పడి చిల్లర ఇవ్వ మరచాడు. అప్పుడు సురేష్ ’అదేమిటి , మా నాన్న మీకు ఇచ్చిందెంత? మీరు మాకు పది రూపాయలు తిరిగివ్వాలిగా?’ అని గుర్తుచేయటం, అప్పుడా వ్యాపారి ’అవున’ని సురేశ్ ని మెచ్చుకొని, పది రూపాయలు తిరిగి ఇవ్వటం జరిగాయి. రామయ్యకు అప్పటికి గాని తన కొడుకు తెలివి తేటలు తెలిసిరాలేదు. ఆక్షణాన్నే రామయ్య ఎన్ని కష్టాలైనా భరించి తన కొడుకును బడికి పంపాలనుకున్నాడు. ఆ మర్నాడే సురేష్ ను ప్రభుత్వ బడిలో చేర్పించాడు.

ఇక ఆనాటినుండీ సురేష్ ఇంకా చాలా బాగా చదువుకున్నాడు. రామయ్యకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఒకనాడు సాయంత్రమైనా సురేష్ ఇంటికి తిరిగి రాలేదు. ’ఏమయి ఉంటుదబ్బా!’ అని వాళ్ళ నాన్న కొడుకుకోసం ఎదురు చూస్తుండగా సురేష్ చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ’ఎందుకు ఇంత ఆలస్యమయింద’ని రామయ్య సురేష్ ను అడిగాడు. అప్పుడు సురేష్ ’నాన్నా! నేనొచ్చే దారిలో ఒక అబ్బాయికి ప్రమాదంలో చాలా పెద్ద గాయాలయ్యాయి. నేనా అబ్బాయిని లేపి, ప్రథమ చికిత్స జరిపి, వాళ్ల ఇంటిదగ్గర దింపి వచ్చే సరికి ఇంత సమయమయ్యింద’ని చెప్పాడు. అందుకు వాళ్ల నాన్న కూడా సంతోషపడి, ’నువ్వు చాలా మంచిపని చేశావు బాబూ. నువ్వెప్పుడూ ఇలాగే మంచి పనులు చేస్తూండాలి’ అని చెప్పాడు . అందుకు సురేష్ సరేనన్నాడు.

ఇప్పుడు సురేష్ తన మిత్రుడైన రమేష్ తో సమానంగా చదువుతున్నాడు. ఇద్దరూ పదవ తరగతికి వచ్చారు. అన్ని పరీక్షలలోనూ మంచిమార్కులు తెచ్చుకుంటున్నారు. ఒకనాడు బడిలో పరుగు పందెం పెట్టారు. పరుగు పందెంలో రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి.
అందులో సురేష్ ఫష్ట్ వచ్చాడు. బహుమతిని కూడా అందుకున్నాడు. అప్పుడు పరీక్షలకు ఇంకా ఐదు నెలల సమయమే ఉంది. మిత్రులిద్దరూ బాగా చదువుతున్నారు. పరీక్షలు దగ్గర పడ్డాయి. ఇద్దరూ బాగా చదివారు. ఆ రోజు పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ఇద్దరూ చాలా బాగా రాశారు. పబ్లిక్ పరీక్షలు అయిపోయాయి. కొన్నాళ్ళకు పరీక్షా ఫలితాలు వచ్చాయి. రమేష్, సురేష్ లు ఇద్దరూ స్టేట్ ఫష్ట్ వచ్చారు. వాళ్ళ ఫోటోలు అన్ని పేపర్లలోనూ వచ్చాయి. వాళ్ల అమ్మా నాన్నలు ఆనందం పట్టలేకపోయారు. మరుసటిరోజు ముఖ్యమంత్రి వాళ్లకు బహుమతికూడా అందించాడు. పై చదువుల్ని ప్రభుత్వం సొంత ఖర్చుతో చదివించగలదని మాట ఇచ్చాడు. రమేశ్ సురేశ్ ల ఆనందానికి మేరలేదు.

పనికి వెళ్ళే సురేష్ అతని మిత్రుడైన రమేష్ తో చదువు చెప్పించుకొని ఎంతటివాడయ్యాడో చూశారా? పొలం పనులకు వెళ్ళేవాడు ఇప్పుడు ముఖ్యమంత్రితోనే బహుమతి అందుకున్నాడు. అలా ఎదుగుతూ, ఎదుగుతూ పట్టుదలతో శ్రమిస్తూ ముందుకు దూసుకెళ్లి ఒకరు కలెక్టరూ, మరొకరు ఎస్పీ అయ్యారు. దేశానికి ఉపయోగపడే మంచి పౌరులయ్యారు. పట్టుదల, నిజాయితీ, తగిన కృషి ఉంటే ఎంతటి పనినైనా సాధించవచ్చు. సమాజానికి మేలు చేకూర్చే మంచిపనులు చేయవచ్చు.