ఒక ఊరిలో ఒక మహా రాక్షసిలాంటి అత్త, తన కొడుకూ, కోడలితో ఉండేది. ఆ అత్త తన కోడలిని నానా కష్టాలకూ గురిచేసేది. పాపం ఆ కోడలు అత్తపెట్టే కష్టాలన్నింటినీ ఓపికగా భరిస్తూ ఉండేది. రాను రానూ ఆ అత్త ఆగడాలకు అంతే లేకుండా పోయింది. తన కోడలికి సరిగ్గా అన్నం కూడా పెట్టకుండా వేధించసాగింది ఆ అత్త. ఒక నాడు వారి పెరట్లో కాసిన కాకరకాయలు అమ్ముకు రావడానికని అత్త ఊళ్ళోకి వెళ్ళింది. అప్పటికి అన్నం తినక చాలా రోజులయింది కోడలికి. అత్తలేని ఆ సమయంలో, ఆమె చకచకా ఒక బానెడు అన్నమూ, సగం బానెడు కాకరకాయ కూరా చేసుకున్నది - అత్తరాకనే వాటిని తినేయాలని. మొత్తం అన్నంలోకీ కూరను కలిపి రెండు పిడసలు(ముద్దలు) చేసి, ఒక్కో పిడసను ఒక్కోసారిచొప్పున రెండింటినీ రెండుసార్లకే మింగేసింది ఆ కోడలు. అది చూసిన ఆ ఊరి దేవత `పెద్దమ్మ' తన ముక్కుమీద వేలేసుకొంది.

ఊరంతా ఇదో మహాశ్చర్యకరమైన సంగతైంది. పెద్దమ్మ ముక్కుమీద వేలేసుకోవడం తెలిసిన ప్రజలంతా గుంపులు గుంపులుగా వెళ్లి చూడటం మొదలు పెట్టారు. ఇంకో గంటకల్లా సంగతి ఆ ఊరి పెద్ద వరకూ చేరుకున్నది. ’పెద్దమ్మ ముక్కుమీద వేలేసుకోవడం ఊరికి మంచిది కాదు; ఆ తల్లి తన ముక్కు మీదనుంచి వేలును తీసేట్టు చేసినవారికి వెయ్యిరూపాయలు బహుమతిగా ఇస్తామ’న్నారు ఆ గ్రామ పెద్ద . ’కానీ ముందుకొచ్చిన తర్వాత అలా చెయ్యలేకపోతే వారికి మరణ శిక్ష విదిస్తామనికూడా జోడించారు చల్లగా.

ఇక ఎవరూ ముందుకు వచ్చేసాహసం చేయలేదు. కానీ ఈ సంగతి తెలుసుకున్న అత్తకు మాత్రం చాలా సంతోషం కలిగింది. "వస్తే వెయ్యి రూపాయలొస్తాయి. లేకపోతే కోడలి పీడ వదిలిపోతుంద"ని తన కోడలిని ముందుకు తోసింది.

కోడలు బాధ పడింది. అయినా చేసేదేమీ లేదు. ఒక చాటా, ఒక పరకా, ఒక చెప్పు తీసుకొని వెళ్ళింది పెద్దమ్మ గుడికి. "ఏమమ్మా! పెద్దమ్మా! నేను నా కడుపాత్రంతో రెండు బానల అన్నం తింటే నీకెందుకంత మంట? అన్నది. అంతే! పెద్దమ్మ గాభరా పడింది. ఆతల్లి ముక్కు మీది వేలు క్రిందికి జారింది.

పెద్దమ్మ తన ముక్కు మీద నుంచి వేలు తీసేయడానికి కారణం ఆ కోడలే అని మర్నాటికల్లా ఊరంతా తెలిసింది. ఆమెకేవో గొప్ప శక్తులున్నాయని అందరూ చెప్పుకొన్నారు. అది విన్న అత్తకు గుండెల్లో గుబులైంది. ఈ మంత్రాల కోడలు తననేమి చేస్తుందోనని, కోడలిని చంపడానికి పూనుకున్నది. గుట్టుగా ఆమెను కట్టెతో వాయించింది. ఆ దెబ్బలకు తాళలేక కోడలు పడి మూర్ఛ పోయింది. ’కోడలు చని పోయిందో’ అని రాగాలు తీసింది అత్త.

చనిపోయిందనుకొన్న కోడల్ని ఆమె అత్తా, భర్తా స్మశానానికి తీసుకు వెళ్లారు. చితిపేర్చి, చితిమీద ఆమెను పడుకోబెట్టారు. తీరాచూస్తే చితిని అంటించడానికి అగ్గిపెట్టెలేదు. అగ్గిపెట్టె కోసమని ఆత్రంగా ఇంటికెళ్ళారు వాళ్లిద్దరూ. అంతలో కోడలికి స్పృహ వచ్చింది. చూసుకుంటే తను ఒంటరిగా చితిమీద ఉన్నది! వెంటనే ఆమె లేచివెళ్ళి, దగ్గర్లోనే ఉన్న ఒకపెద్ద చెట్టు పైకెక్కి కూర్చుంది. ఇంతలోనే అగ్గిపెట్టెను తీసుకొచ్చారు అత్తా, భర్తానూ. ఇద్దరూ వచ్చీ రాగానే చితిమీద శవం ఉన్నదీ, లేనిదీ కూడా చూడకుండా చితికి నిప్పుపెట్టి వెళ్ళిపోయారు.

ఇక చెట్టుమీదున్న కోడలు బాగా అలసిపోయింది; నిద్రకు తూగుతూ కూర్చున్నది. ఇంతలో ఎక్కడో దొంగతనం చేసుకొని, ఒక పెద్ద దొంగలముఠా అక్కడికి చేరుకున్నది. దొంగిలించిన సొమ్మును వాటాలేసుకోవడానికి అనువైన నిర్మానుషయ ప్రదేశంకోసం వెతుక్కున్నారు వాళ్లంతా. చివరికి అందరూ కోడలున్న చెట్టుకిందే కూర్చొని తమ దగ్గరున్న బంగారం మూటలను విప్పారు.

సరిగ్గా అప్పుడే చెట్టుమీద తూగుతూ కూర్చున్న కోడలు, పైనుండి దబ్బుమని కిందపడిపోయింది. ఒక్కసారిగా చెట్టుపైనుండి పడిన ఆమెను చూసిన దొంగలు అదేదో పెద్ద దెయ్యమనుకున్నారు. హాహాకారాలు చేస్తూ లేచి ఉన్నపళాన కాలికి బుద్ది చెప్పారు. మెలకువ వచ్చి తేరుకున్న కోడలు ఆ నగలన్నింటినీ ధరించి ఇంటికెళ్ళి, వాళ్ళ ఇంటి ముందు కూర్చుంది. ఆమెను చూసిన భర్త సంతోషపడ్డాడు. కానీ అత్తకు మాత్రం చెప్పరాని భయం వేసింది, కోడలు దయ్యమై తిరిగొచ్చిందని.

అప్పుడా కోడలు "నేను దెయ్యాన్ని కాలేదు. చనిపోయాక నరకానికి వెళితే దెయ్యాలవుతాము. కానీ నేను వెళ్ళింది స్వర్గానికి. అక్కడ నేను మీ చుట్టాలనూ, మా చుట్టాలనూ అందర్నీ పలకరించి వచ్చాను. అక్కడున్న మీ చుట్టాలకు నిన్ను చూడాలని ఉందట, ’నువ్వు వెళ్ళి మీ అత్తను పంపు’ అని వాళ్లంతా నాకీ ఆభరణాలు ఇచ్చి పంపారు. నువ్వుకూడా వెళితే నీక్కూడా చాలా సత్కారం చేస్తారట’ అన్నది.

అది విన్న అత్తకు ఆశ పుట్టింది. "అవునా! అయితే సరే, నేనూ వెళతాను. కానీ నేనక్కడికి వెళ్లడం ఎలా?’ అని ఆ అత్త అడిగింది.

"ఏముందీ? నువ్వుకూడా ఓసారి బడితతో పూజ చేయించుకుంటే సరి’ అన్నదా గడసరి కోడలు. "అయితే ఆలస్యం ఎందుకు? ఆమెను వాయించిన కట్టెతోటే నన్నూ బాదండి’ అన్నది ఆశపోతు అత్త.

సంగతి అర్దమైన కొడుకూ, కోడలు ఇద్దరూ కలసి అత్తను పైకి పంపారు. తిరిగొచ్చే అమ్మను తలుచుకుంటూ కొడుకూ, తిరిగిరాని అత్తను తలచుకుంటూ కోడలూ, ఉన్న సొమ్ముతో హాయిగా కాలం గడిపారు.