అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కుటుంబం. అమ్మా, నాన్న, వారి ఇద్దరి కొడుకులూ. పిల్లలిద్దరినీ తల్లి దండ్రులు ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పెద్దవాళ్ళయ్యాక, కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళూ చేశారు. కొడుకులిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు. తల్లి తండ్రులు ఇప్పుడు ముసలివాళ్లయ్యారు. వారి శక్తులు సన్నగిల్లాయి. పొట్టకూటికోసం కొడుకుల పైననే ఆధారపడాల్సి వస్తున్నది. చిన్నవాడు తల్లితండ్రుల్ని, బాగా చూసుకొనేవాడు. పెద్దవాడు మాత్రం వారిని అస్సలు పట్టించుకొనేవాడు కాదు.

ఒకసారి చిన్నవాడు ఏదో పనిమీద పక్క ఊరికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ తండ్రికి జబ్బు చేసింది. తల్లి వెళ్ళి విషయాన్ని ఊళ్లో ఉన్న పెద్దకొడుక్కి చెప్పింది. అది వినికూడా పెద్దకొడుకు తనకేమీ పట్టనట్లుగా, "నాకేమీ తెలియదు . నా వద్దకు రాకు, పో! వెళ్ళిపో!" అన్నాడు. అంతలోనే వాళ్ల నాన్న పరిస్థితి విషమించింది. ఆయన చనిపోయాడు. విషయం తెలుసుకున్న చిన్నవాడు వచ్చి దహన సంస్కారాలు జరిపించాడు. భర్త చనిపోయిన బాధతో ఆ తల్లి కూడా చనిపోయింది. పోయేముందు ఇలా అన్నది: "ఒరేయ్! కన్నవాళ్ళని చూడని పెద్దోడా! నువ్వు నిరంతరం భగభగ మండే సూర్యుడివి అయిపో... చిన్నోడా! నువ్వు చల్లని వెన్నెలనిచ్చే చంద్రుడివయిపో నాయనా!" అన్నది.

అలా ఏర్పడ్డారట సూర్య చంద్రులు....

(నిజమేనంటారా?)