అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేదకుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని సీతయ్య. ప్రతి రోజూ అతను దగ్గరలోని అడివికి పోయి, కట్టెలు కొట్టుకొచ్చి, వాటిని గ్రామంలో అమ్మి, తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆంత పేదరికంలోకూడా అతను, తనకున్నదాంట్లో ఇతరులకు సాయపడేవాడు. ఒక ఏడాది కరువు వచ్చి, పంటలు సరిగ్గా పండలేదు. ఊళ్ళోని జనాలదగ్గర డబ్బులు తక్కువవడంతో, ఆ ప్రభావం సీతయ్య కట్టెల వ్యాపారంమీద కూడా పడింది. డబ్బులులేని కారణంగా కట్టెలు కొనే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. సీతయ్య కుటుంబానికి పూటగడవడమే కష్టమయిపోయింది.

ఒకనాడు సీతయ్య కట్టెలకోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొడుతూండగా మధ్యలో దాహంవేసింది. దగ్గర్లోని నీటి చెలమకు పోయి, నీళ్ళు తాగి, "అమ్మా! ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు!" అని నిట్టూర్చాడు. వెంటనే ఒక వనదేవత ప్రత్యక్షమయింది. ’ఏమికావాలో కోరుకొమ్మం’ది. సీతయ్య తన కష్టాలనన్నింటినీ చెప్పుకొన్నాడు. అప్పుడు వన దేవత సీతయ్యకు మూడు టెంకాయలిచ్చి, "ఈ మూడూ టెంకాయలనూ కొడుతూ నీవు ఏమి కోరుకొంటే అది జరుగుతుంది నాయనా" అని చెప్పి మాయమయిపోయింది.

సీతయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళి మూడు టెంకాయలనూ కొడుతూ, తనకు ఓ పెద్ద భవనమూ, దండిగా సంపదా, తమ ప్రాంతం మొత్తానికీ సకాల వర్షాలూ కావాలని కోరుకొన్నాడు. అతని కోరిక ప్రకారమే అన్నీ జరిగాయి.

సీతయ్య ఇంటిపక్కనే పిసినారి పుల్లన్న ఒకడు ఉండేవాడు. అతను వ్యాపారంలో బాగా సంపాదించి కూడబెట్టాడు. అతనికి రెండు గాడిదలుండేవి. అవంటే అతనికి ఎంతో ఇష్టం. వడ్డీ కట్టనందుకు గానూ తను చాకలివాని దగ్గరనుండీ బలవంతంగా లాక్కొన్న బాపతువి అవి. సీతయ్య ఒక్క రోజులో షావుకారి అయిపోవడం పిసినారి పుల్లన్నకు ఆశ్చర్యం కలిగించింది. సీతయ్య దగ్గరికెళ్ళి విషయమేమిటని అడిగాడు. సీతయ్య జరిగినదంతా చెప్పాడు.

మరుసటి రోజు పిసినారి పుల్లన్న అడవికి బయలుదేరి నీటి చెలమ దగ్గర కూర్చొని "అమ్మా! ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు!" అని మొత్తుకున్నాడు. వనదేవత ప్రత్యక్షమైంది. సీతయ్యకు ఇచ్చినట్లే మూడు టెంకాయలనూ ఇచ్చింది. మాయమైంది.

పుల్లన్న ఇంటికెళ్ళి, మొదటి టెంకాయను కొట్టబోతున్నాడు. అంతలో ఒక బిక్షగాడు వచ్చి, "బాబూ! ధర్మం బాబూ!" అని అడిగాడు. ’శుభమా, అని టెంకాయ కొడుతుంటే వీడొకడ’ని కోపగించుకున్న పుల్లన్న కొబ్బరికాయను కొడుతూనే, "నువ్వొక్కడివీ వస్తే ఎలా సరిపోతుంది గాడిదా!" అన్నాడు. టెంకాయ మహాత్యంతో, అంతలోనే పుల్లన్న ఇల్లంతా గాడిదలతో నిండిపోయింది. "ఇదేమిటి, ఇలా జరిగింది?" అని కంగారు పడ్డాడు పుల్లన్న. ఆ కంగారులో రెండవ టెంకాయను కొడుతూ, "అమ్మా! ఈ గాడిదలన్నింటినీ తీసేసుకోమ్మా!" అన్నాడు. తన సొంత గాడిదలతో సహా గాడిదలన్నీ మాయమయ్యాయి. "అయ్యో! నా ప్రియమైన గాడిదలు! అవి పోతే ఎలా?" అంటూనే మూడవ టెంకాయను కొట్టాడు పుల్లన్న. తన రెండు గాడిదలూ తిరిగి వచ్చాయి. మూడు టెంకాయలూ అయిపోయాయి, కానీ వనదేవత టెంకాయల వల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు పాపం, పుల్లన్నకు!