ఒకప్పుడు, ఒక చిన్న ఎర్ర కోడి పెట్ట ఉండేది. దానితోపాటే, ఒక పందీ, ఒక బాతూ, ఒక పిల్లీ ఉండేవి. ప్రతి రోజూ కోడిపెట్ట ఇంటిని శుభ్రం చేసేది. తక్కినవన్నీ సోమరిపోతులు. ఏ పనీ చేసేవికాదు. ఏరోజూ కోడిపెట్టకు సాయపడేవి కాదు.

ఒకసారి కోడిపెట్ట ఒక మొక్కజొన్న గింజను తెచ్చింది. ’దీనిని ఎవరైనా నాటుతారా?’ అని తక్కినవాటిని అడిగింది. మిగిలినవన్నీ”మావల్ల కాద’ని చెప్పాయి. కోడిపెట్టే దానిని నాటింది. అది మొలకొచ్చి, పెరిగి పెద్దదై మంచి పంటనిచ్చింది.

ఈసారి, ’ధాన్యం కోయడానికి ఎవరు సాయపడతార’ని అడిగింది కోడిపెట్ట. ఎవ్వరూ ముందుకు రాలేదు. కోడిపెట్ట ధాన్యమూ కోసింది; వాటిని ఆరపెట్టి పిండీ చేసింది.

పిండితో రొట్టె చేయాలనుకొని, రొట్టె చేయడానికి ఎవరినైనా సాయం రమ్మంది. అప్పుడవన్నీ సాకులు చెప్పాయి. ఏవీ సాయం పట్టలేదు. ఏం చేస్తుంది, ఇక కోడిపెట్టే రొట్టెలూ కాల్చింది.

ఈసారి కోడిపెట్ట ’రొట్టెలు తినడానికి ఎవరొస్తార’న్నది. ’నేనంటే , నేన’న్నాయి తక్కినవన్నీ.

"గింజ నాటిందీ నేను. పంట కోసిందీ నేను. పిండి చేసిందీ నేను. రొట్టెను కాల్చిందీ నేను. కనుక రొట్టెను తినేదీ నేనే" అని కోడిపెట్ట రొట్టెను తినేసింది.