అనగనగా, ఒక దేశం. ఆ దేశం పేరు మార్కాపురం. ఆ దేశాన్ని పాలించే రాజు చాలా మంచివాడు. చాలా కాలం వరకూ అతనికి పిల్లలు కలగలేదు. ఎన్నో నోములూ, వ్రతాలూ చేసిన పిదప అతనికో ఆడపిల్ల కలిగింది. పాప పుట్టిన కొంతకాలానికే రాణి చనిపోయింది. రాజు మరో పెళ్ళి చేసుకున్నాడు. రాజుగారి రెండవ భార్యకూ పిల్లలు కలిగారు.

రాజు పిల్లలందరినీ ఎంతో ప్రేమగా చూసుకొనేవాడు. రాణి మాత్రం, తన పిల్లలను మాత్రం బాగా చూసుకొంటూ, మొదటి భార్య కూతురిని నానా కష్టాలకూ గురిచేసేది. అయినా రాజు ముందు మాత్రం ఎంతో ప్రేమను నటించేది. రాకుమారి పడుతున్న కష్టాలను చూస్తున్న ఒక సేవకి, రాకుమారిని ఎలాగైనా తన పినతల్లికి దూరంగా పంపించేయాలనుకున్నది.

ఒక ఉపాయం ఆలోచించి, ఒక పెద్ద కుండను చేయించి అందులో రాకుమారిని ఉంచి, ఎవరూ లేని సమయంలో రాకుమారిని పొరుగు రాజ్యంలోని తనబంధువయిన ఒక పువ్వులమ్ముకుంటూ బ్రతికే ముసలవ్వ ఇంటికి పంపింది. కుండలోని రాకుమారి నడుచుకుంటూ వెళ్ళి అవ్వ ఇంటికి చేరింది. ’అవ్వా ! అవ్వా ! నేనుకూడా నీతో ఉంటానవ్వా!’ అని అడిగింది.

అవ్వ ఆశ్చర్యంతో ’కుండమాట్లాడుతున్నదేమిటి?’ అనుకొంది. ”ఓ మాట్లాడేకుండా! నేను పువ్వులు అమ్ముకొని కష్టపడుతూ బ్రతుకుతున్నాను. నువ్వూ నాతో ఉండాలంటే రోజూ పూలమొక్కలకు నీరు పోయాల్సి ఉంటుంది’ అని చెప్పింది. కుండలోని రాకుమారి ఒప్పుకుంది.

రోజూ అవ్వ పువ్వులన్నీ మాలలుగా కుట్టి ఆ ఊరి రాజు గారింట్లో ఇచ్చివచ్చేది. అవ్వ అలా వెళ్ళగానే రాకుమారి కుండలోనుండి బయటికి వచ్చి, పూలమొక్కలకి నీరు పోసేది.

ఇదిలా ఉండగా ఆ దేశపు రాజు తన కుమారునికి పెళ్ళి చేయాలనుకున్నాడు. ఎందరో రాజకుమార్తెలను రాకుమారునికి చూపించినా, రాకుమారుడు నచ్చలేదన్నాడు.

అంతలో ఒకసారి, అవ్వకు జ్వరం వచ్చి, పువ్వులను రాజుగారికి ఇచ్చి రమ్మని కుండతో చెప్పింది. కుండ పూలమాలలు తీసుకొని బయలుదేరి, నడుచుకుంటూ వెళ్ళి రాజుగారింట్లో పూలను ఇచ్చింది. అది రాకుమారుడు చూసి, ఇదేదో విడ్డూరంగా ఉన్నదే ? అనుకొని విషయాన్ని తెలుసుకోవాలనుకొన్నాడు. కుండను చాటుగా వెంబడించాడు. కుండ నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్ళి, అటూ ఇటూ చూసింది, దానిలోంచి రాకుమారి బయటకు వచ్చి నదిలోకి వెళ్ళి స్నానం చేసింది. ఆమె చాలా అందంగా ఉన్నది. అందమైన రాకుమారిని చూసి ఆమెను పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు యువరాజు.

ఇక ఆ యువరాజు ఇంటికెళ్ళి తనొక కుండను పెళ్ళి చేసుకొంటానన్నాడు. ఇంతమంది రాకుమార్తెలుండగా, కుండను పెళ్ళి చేసుకోవటమేమిటని అడిగారు వాళ్ళ పెద్దలు. కానీ రాకుమారుడు పట్టిన పట్టు విడవలేదు. తమ కుమారునికేదో పిచ్చి పట్టినట్లుందని, ఎలాజరిగితే అలా జరగనిమ్మని వాళ్లు అందుకు ఒప్పుకొని, అవ్వను కలిసి, కుండనూ ఒప్పించారు.

పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి. రాకుమారుడు ఒక కుండను పెళ్ళిచేసుకుంటున్నాడన్న విషయం విన్న ప్రజలంతా పెళ్ళిని చూడటానికి ఎగబడ్డారు. అందరూ చూస్తుండగా రాకుమారుడు కుండ మెడలో తాళి కట్టాడు. తర్వాత, కావాలని కాలు తడబడినట్టు నటిస్తూ కుండమీద పడ్డాడు.

కుండ పగిలి ఆశ్యర్యంగా అందులోనుండి అందమైన రాకుమారి బయటికి వచ్చింది. యువరాజు జరిగినదంతా వివరించాడు. రాజూ, రాణి, అక్కడున్నవారంతా చాలా సంతోషించారు. అప్పటినుండీ రాకుమారి అక్కడ చాలా సంతోషంగా జీవించింది.