రామాపురంలో గత ఐదేండ్లుగా అసలు వర్షాలే పడటం లేదు. ఆ ఊరి పెద్ద అయిన రామయ్యకు ఇది చాలా బాధ కలిగిస్తోంది. అతనికి రాత్రిపూట నిద్ర కరువైంది. ఊరి ప్రజలు కష్టాల పాలవ్వటం అతన్ని కలచివేస్తున్నది.

ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు. "మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలా చూస్తాను" అని అభయమిచ్చాడు స్వామి.

రామయ్య మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశ పరచి తనకు వచ్చిన కలను వివరించాడు. అందరూ ఆ కల నిజమౌతుందన్నారు. స్వామికి పాల అభిషేకం చేసితీరాల్సిందేనన్నారు. గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకుంటానన్నాడు. "ఈరోజున గుడిముందు ఒక డ్రమ్ము పెడతాను. ఊరిలో ఉన్న ప్రతి కుటుంబమూ తమ వంతుగా గ్లాసెడు పాలు అందులో పోయాలి" అని రామయ్య అందరికీ చెప్పాడు. అందరూ సరేనన్నారు.

మొట్టమొదటగా రామయ్యే డ్రమ్ములోకి పాలు పోశాడు. ఆ తరువాతి వాడైన శీనయ్యకు ఒక ఆలోచన వచ్చింది: "ఊళ్ళో వాళ్లంతా పాలు పోస్తారు. నేను ఒక్కడినీ గనక ఊరికే నీళ్లు పోస్తే ఎవరు చూడొచ్చారు? అన్ని పాలల్లో నేను పోసే గ్లాసెడు నీళ్ళు ఏపాటివి?" అనుకున్నాడు శీనయ్య. అలా అనుకొని అతను డ్రమ్ములోకి పాలబదులు నీళ్ళు పోసి ఊరుకున్నాడు. వింతేమిటంటే, ఊరిలోని అందరూ శీనయ్యమాదిరే ఆలోచించారు: ప్రతి ఒక్కరూ గ్లాసెడు నీళ్ళు తెచ్చి డ్రమ్ములో పోశారు! చివరికి చూస్తే డ్రమ్ములో పాలబదులు అన్నీ నీళ్ళే ఉన్నాయి!!

ఆరోజు రాత్రి రామయ్యకు కలలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు. "చూశావా, రామయ్యా, నీ ఊరి ప్రజలు ఎలాంటివారో? ధర్మం లేని ఊళ్ళో వర్షాలు పడవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రయత్నించి నీ ఊరి ప్రజల పిసినారి తనాన్ని దూరం చెయ్యి. అప్పుడు మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలమౌతుంది" అని చెప్పాడు.

నిద్రలేచిన రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు. అతని కృషి ఫలితంగా త్వరలో ఊరివారిలో మార్పు వచ్చింది. నీతి నిజాయితీలు పెరిగాయి. మరి, దాని ఫలితమో ఏమోగాని, రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. ఊరు తిరిగి పాడి పంటలతో తులతూగింది.