చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రాఘవయ్య, గోపాలయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తుండేవారు. వారిది వ్యవసాయ కుటుంబం. రెండెకరాల పొలం, ఇల్లు, కాడెద్దులు మాత్రమే వారికున్న ఆస్తులు. పెద్దవాడైన రాఘవయ్య కుటుంబ విషయాలు చూసుకుంటే, చిన్నవాడైన గోపాలయ్య వ్యవసాయం,పశువులు చూసుకునేవాడు. రాఘవయ్యకు ఇద్దరు ఆడపిల్లలు. గోపాలయ్యకు పెళ్లయి చాలాఏళ్ళు గడిచినా పిల్లలు కలగలేదు. కానీ తమ కాడెద్దులు-రామ లక్ష్మణులు రెండింటినీ అతను కొడుకుల కంటే మిన్నగా చూసుకునేవాడు. పొలంలో రాబడి తక్కువే అయినా పొదుపుగా సంసారం నెగ్గుకొస్తున్నారు అంతా.

కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా, మూడు సంవత్సరాల పాటు వర్షాలు సరిగా కురవలేదు. పంటలు ఏ మాత్రమూ పండలేదు. దేశమంతా కరువు ఛాయలు అలుముకున్నాయి. ప్రజలు చాలా కష్టాలకు గురయ్యారు. ఆకలిచావులు అనేకం సంభవించాయి. ఇక పశు పక్ష్యాదుల సంగతి చెప్పనలవికాదు. పశువులన్నీ కబేళాలకు, పక్షులన్నీ పైలోకాలకు వెళ్తున్నాయి. రాఘవయ్యకు సంసారం బండి నడపటం కష్టమైంది. పిల్లలు పస్తుంటున్నారు. పాపం చూడలేకుండా ఉన్నాడు. తమకున్న పశువులను మేపడం దండగ అనుకున్నాడు. వాటిని అమ్మేద్దామన్న ఆలోచన వచ్చింది. వెంటనే తమ్ముడితో ఆ సంగతి ప్రస్తావించాడు.

గోపాలయ్యకు గుండె ఆగినంత పని అయ్యింది. ఎద్దులు తనకు ప్రాణం కన్నా ఎక్కువని, ఆ సమయంలొ వాటిని అమ్మడమంటే కసాయికివ్వడమేననీ, తాను బ్రతికి ఉండగా అలా జరగదనీ తెగేసి చెప్పాడు గోపాలయ్య. అన్నకు తమ్ముని తీరు కోపం తెప్పించింది. తొలిసారిగా వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. వాటాలు పంచేసుకున్నారు అన్నదమ్ములు.

ఉన్న రెండెకరాల పొలాన్నీ తలా ఎకరా తీసుకున్నారు. తనకు ఇల్లు లేకున్నా పరవాలేదనుకొని, ఇల్లును పూర్తిగా అన్నకే వదిలేశాడు గోపాలయ్య. విలువ తక్కువయినవి అయినా, తాను ఎద్దులనే తీసుకొని, ఊరి బయట చావిడిలో కాపురం పెట్టాడు. తన వాటాగా వచ్చిన ఎకరం పొలాన్ని కరువు కాలంలో చాలా తక్కువ ధరకే అమ్మేసుకున్నాడు అన్న; కానీ గోపాలయ్య మాత్రం కష్టాలకు ఓర్చి, అడవిలో మిగిలి ఉన్న ఆకులు అలములనే పశువులకు మేపుతూ, దొరికిన కందమూలాలు తెచ్చేవాడు. రాజు ప్రవేశపెట్టిన "పనికి ఆహార పథకం" ద్వారా అతని భార్య కొన్ని ఆహారధాన్యాలు తెచ్చేది. ఇద్దరూ ఎలాగో తంటాలుపడి బ్రతుకును ఈడ్చసాగారు.

ఇలా ఉండగా మరుసటి సంవత్సరం తొలకరులు సమయానికి కురిశాయి. గోపాలయ్య సంతోషంతో తన పొలాన్ని దున్ని సేద్యం చేశాడు. అయితే ఎద్దులు లేక పోవటం వల్ల అనేకమందికి పనులు జరగలేదు. గోపాలయ్య ఎద్దులు ఇరుగు పొరుగు వారికీ దున్నించి పెట్టాయి. విత్తనాలు విత్తే సమయం వచ్చింది. వర్షాలు పడ్డాయి- కానీ రాజ్యంలో ఎవ్వరి దగ్గరా విత్తుకోటానికి విత్తనాలు లేవు, తగినంత ఎరువు లేదు. సమస్య రాజు దగ్గరికి వెళ్లింది. రాజు ప్రక్కదేశంనుండి విత్తనాలు అయితే తెప్పించి, సాగు చేసే రైతులకు ’విత్తన సరఫరా కార్యక్రమం’ చేపట్టాడు. తాము నిలవ ఉంచిన ఎరువును వాడి గోపాలయ్య దంపతులు సంతోషంగా పంట సాగుచేశారు. కష్టేఫలి అని మంచి పంట పండింది. ప్రజల కష్టాల్ని చూచి, వచ్చిన ధాన్యంలో తనకు అవసరమైనంత మాత్రం ఉంచుకొని మిగిలినదాన్ని పదిమందికీ పంచాడు గోపాలయ్య. రాఘవయ్యతో సహా అందరూ గోపాలయ్యను మెచ్చుకున్నారు; గోపాలయ్య రామలక్ష్మణుల్ని మెచ్చుకున్నాడు.
గోపాలయ్య చేసిన పనీ, అతని మంచితనమూ, దానగుణమూ రాజు చెవిన పడ్డాయి. రాజు తానే స్వయంగా ఆ గ్రామానికి వచ్చి, గోపాలయ్య చేసిన పనిని పరిశీలించి ఎంతో సంతోషపడ్డాడు. రాజ్యానికి అతనివంటి పౌరులు అవసరమని అభినందించాడు. అతని కృషిని ప్రోత్సహిస్తూ అతన్ని తన రాజ్యానికి వ్యవసాయశాఖా మంత్రిగా నియమించాడు. గోపాలయ్య మంత్రై "దేశానికి వెన్నెముక రైతు అయితే, రైతుకు వెన్నెముక పశువులు" అని గ్రామగ్రామాన శిలా శాసనాలు వేయించాడు.