చాలా బిజీగా ఉండే న్యాయవాది ఒకడు తన దగ్గరకు వ్యాజ్యాల కోసం వచ్చేవారికి సలహా ఇచ్చేవాడు; " మీడబ్బును, మీసమయాన్ని ఇలా వ్యాజ్యాలలో వృధా చేసుకోకండి. మీ మీ వివాదాలను కోర్టుబయటే మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోండి. " అని. తనకుండే ఖాళీ సమయంలో అతను హిందూ, ఇస్లాం, క్రైస్తవ, పార్సీ, బౌద్ధ మతాల గురించిన పుస్తకాలు చదివేవాడు. ఆయన చదివిన ఈ పుస్తకాలవల్ల, తనలో తాను ఆలోచించుకున్నప్పుడు కలిగిన అవగాహన వల్ల కూడా ఆయన ఒక నిర్ధారణకు వచ్చాడు: " ప్రతివ్యక్తీ , ప్రతి రోజూ కొంతైనా శరీర కష్టం చేయాలి. కేవలం మానసిక శ్రమ చేస్తే చాలదు. చదువుకున్నవాడు- చదువురానివాడు; డాక్టరు, న్యాయవాది, మంగలి, పాకీపనివాడు- అందరికీ తమతమ పనులకై వేతనం లభించాలి."

మెల్లగా అతడు తన జీవన శైలిని మార్చుకున్నాడు, తనముందున్న ఎలాంటి పనిలోనైనా ఇతరులకు సహాయం చేయటం మొదలు పెట్టాడు. తనకుటుంబం , స్నేహితులతో కలిసి ఒక ఆశ్రమ జీవితాన్ని- సామూహిక జీవితాన్ని అవలంబించేందుకు నిశ్చయించుకున్నాడు. యూరప్ లో అతనికి స్నేహితులైన వారు కూడా కొందరు ఆ ఆశ్రమ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడ్డారు. వాళ్లందరూ కలిసి , నేలను దున్నుతూ, పండ్లతోటల్ని పెంచుతూ శరీర కష్టం చేసే రైతుల మాదిరి, స్వావలంబనతో జీవిస్తూ వచ్చారు. ఆ తోటలో కూలీ ఇచ్చి ఎవరినీ పనిలో పెట్టుకోలేదు. అక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. పార్శీలు, బ్రాహ్మణులు- శూద్రులు, శ్రమజీవులు - బారిస్టర్ చదువులు చదివిన మేధావులు, తెల్లవారు-నల్లవారు, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిలా కలిసి జీవించేవారు.

వాళ్ల ఆహారం సాధారణంగానూ, వాళ్ల బట్టలు ముతకగానూ ఉండేవి. తమ ఖర్చులకుగాను ప్రతిఒక్కరికి నెలకు 40 రూపాయలు లభించేవి. ఈ న్యాయవాది అప్పటికి నెలకు 4000 రూపాయలు సంపాదించేవాడు; కానీ అతను కూడా ఈ 40 రూపాయల వేతనంతోనే జీవించేవాడు. ఈ శ్రమ జీవితంలో అతను చాలా ఖచ్చితంగా సమయపాలన చేసేవాడు; రోజుకు 6 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు.

పొలంలో గుడిశ కడుతున్నారంటే, అందరిలోకీ ముందు గుడిశ పైకెక్కేది అతనే. అతనా సమయంలో పొడవైన ముదురు నీలంరంగు పని దుస్తులు వేసుకొనేవాడు- వాటికి చాలా జేబులుండేవి. ఈ జేబుల్లో నిండా చిన్నవి, పెద్దవి-మేకులు, స్కౄలు ఉండేవి ఎప్పుడూ. ఒక జేబులోంచి సుత్తి తొంగి చూస్తుండేది. అతని నడుము బెల్టుకు ఒక రంపం, ఒక డ్రిల్ మిషన్ వేళ్లాడుతుండేవి. రోజుల తరబడి అతను అలా మండే ఎండలో సుత్తి పనీ, రంపపు పనీ చేశాడు.

ఒకసారి, భోజనం తరువాత అతనొక పుస్తకాల అలమార తయారు చేసేందుకు ఉపక్రమించాడు. ఏడు గంటల్లో అతని శ్రమఫలం- ఆ అలమర, గది పైకప్పు తాకేంత పెద్దది, తయారైపోయింది. ఇంకోసారి, ఆ ఆశ్రమానికి దారితీసే రోడ్డుకోసం కంకర కావలసి వచ్చింది. కానీ ఆ కంకరకు సరిపడ డబ్బు లేదు- అతను మామూలుగా రోజూ క్రమం తప్పకుండా నడకకు వెళ్లేవాడు- తను వెనక్కి వచ్చేటప్పుడు బాట ప్రక్కనే పడిఉండే కంకర రాళ్లను శ్రద్ధగా రోజూ కొన్ని కొన్ని ఏరుకు రావటం మొదలుపెట్టాడు. అతని సహచరులు కూడా అతన్ని అనుసరించి అలాగే రాళ్లు ఏరటం ప్రారంభించారు. త్వరలో ఆశ్రమం ముందున్న రోడ్డుపై పరచేందుకు కావలసినన్ని రాళ్ళు కుప్పతేలాయి. అతను ఇతరులతో పనిచేయించే తీరు ఆ విధంగా ఉండేది. ఆశ్రమంలోని పిల్లలుకూడా తోటపనిలో, వంటపనిలో, ఊడ్చి శుభ్రం చేయటంలో, చెక్క పనిలో, తోట పనిలో, ముద్రణశాలలో అక్షరాలు కూర్చటంలో పాల్గొనేవారు.

"మేస్త్రీలను, చెప్పులు కుట్టేవారిని, వడ్రంగుల్ని, కమ్మరిపనివారిని, మంగలి పనివారినీ మనకంటే తక్కువగా చూడటం వల్లనే మనం ఈ దుర్దశను చేరుకున్నాం. మనం వారి మర్యాదను దోచుకున్నాం; వారి జ్ఞానాన్ని, వారి మంచితనాన్ని, వారి సంస్కృతిని దోచుకున్నాం- వారి ఇళ్లలోనుండి, వారి వృత్తుల్లోనుండీ. పని చేయటంలో నేర్పును మనం చిన్నచూపు చూశాం; కుర్చీల్లో కూర్చొని చేసే గుమాస్తాగిరీని గొప్పదనుకున్నాం. ఆ విధంగా మనకు మనమే బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నాం" అని అతను నమ్మాడు.

రోజూ ఉదయమే ఆ న్యాయవాది తిరగలిలో గోధుమలు పిండిచేసేవాడు. ఆపైన తయారై, 5 మైళ్లు నడిచి తన ఆఫీసుకు చేరుకునేవాడు. తన జుట్టును తానే కత్తిరించుకునేవాడు. తన బట్టలు తనే ఉతుక్కుని ఇస్త్రీ చేసుకునేవాడు. ప్లేగువ్యాధి సోకిన గని కార్మికులకు సేవచేస్తూ రాత్రంతా మేలుకొని ఉండేవాడు. కుష్టువ్యాధితో బాధపడేవారి పుండ్లను శుభ్రం చేసేవాడు; లెట్రిన్లు కడిగి అందులో దొడ్డిని ఎత్తి పారబోసేందుకు సిగ్గుపడేవాడు కాదు. బద్ధకం, భయం, అసహ్యం, అతని దరిదాపుల్లోకి కూడా వచ్చేవికావు.

అతను తన పత్రికకోసం వ్యాసాలు రాసేవాడు; వాటిని స్వయంగా టైపు చేసేవాడు; తన పింటింగు ప్రెస్ లో స్వయంగా అక్షరాలను కూర్చేవాడు; అవసరమైనప్పుడు, కరెంటు లేకుండా నడిచే ఆ ముద్రణా యంత్రపు చక్రం తిప్పే పనిలో కూడా పాలుపంచుకునేవాడు. అతను పుస్తకాల బైండింగ్ పని చక్కగా చేసేవాడు. అందరికీ స్ఫూర్తినిచ్చే సంపాదకీయ వ్యాసాలు రాసే సృజనాత్మకత కలిగిన అతని చేతులే రాట్నంపై నూలు వడికేవి; మగ్గంపై బట్టలు నేసేవి; కొత్త కొత్త వంటలు వండేవి; చక్కని సూది పని చేసేవి; పండ్ల చెట్లను, కాయగూరల పాదులను పెంచేవి; అంతే నైపుణ్యతతో నేలను దున్నేవి, బావిలోంచి నీరు తోడేవి, కట్టెలు కొట్టేవి, బండి మీది నుండి బరువైన వస్తువులు మోసేవి.

ఆ తరువాత ప్రభుత్వం వారు అతన్ని జైలులో పెట్టినప్పుడు, అతను గట్టిగా, రాయిలాగా ఉండే నేలను పికాసుతో త్రవ్వవలసి వచ్చింది; రోజుకు తొమ్మిది గంటలపాటు చినిగిన దుప్పట్లను కుట్టి రిపేరు చేయవలసి వచ్చింది. అతను బాగా అలసిపోయినప్పుడు, శక్తికోసం భగవంతుని ప్రార్థించేవాడు. తనకు నిర్దేశించిన ఏ పనినైనా చెయ్యలేకపోవటం అనేదే అతనికి ఇష్టమయ్యేది కాదు.

వారికి అతి దగ్గర్లో గల పట్టణం కూడ 40 మైళ్ల దూరంలో ఉండేది. అతను యువకుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు ఈ 40 మైళ్లను ఒక్కరోజులో నడిచి వెళ్లి సరుకులు కొనేవాడు. ఒకసారి అయితే అతను ఏకంగా 55 మైళ్లు నడిచాడు! ఒకప్పుడు, యుద్ధ సమయంలో గాయపడ్డ సైనికుల్ని స్ట్రెచర్ మీద పెట్టుకొని మోసుకుంటూ అతను ఏకబిగిన 30-40 మైళ్లు పోయేవాడు.

అతనికి 78 ఏళ్లు వచ్చాక కూడా అతను ప్రతిరోజూ 18 గంటలపాటు పనిచేసేవాడు. ఒక్కోసారైతే అతను రోజుకు 21 గంటలు పనిచేశాడు! ఆ వయసులో అతను పెద్దగా శారీరక శ్రమ చేయలేకపోయేవాడు- కేవలం రాట్నం పని మాత్రం చేయగల్గాడు. అయినా చలికాలంలోకూడా ప్రతిరోజూ ఉదయం మంచుతో తడిసిన గ్రామీణ మార్గాల్లో కాలికి చెప్పులు లేకుండా 3 నుండి 5 మైళ్లు నడిచేంత ఆరోగ్యం ఉండేది అతనికి. పనిపట్ల అతనికి అద్భుతమైన శ్రద్ధ ఉండేది; పని చేసేందుకు అతనికి అద్భుతమైన సామర్థ్యం ఉండేది. దక్షిణాఫ్రికాలో అతని సహచరులు అతనికి అందుకే "కర్మ వీరుడు" అని పేరుపెట్టారు.

కర్మవీరుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అక్టోబరు 2, 1869 న జన్మించాడు.