ఏప్రిల్ నెలలో వికసించే అద్భుతమైన పూలు అనగానే- తెల్లగా, సంగీత వాద్యం ట్రంపెట్ మాదిరి ఉండే లిల్లీలు గుర్తుకు వస్తాయి. ఈస్టర్ లిల్లీ గురించిన ఈ కధ చదవండి:

చాలా సంవత్సరాల క్రితం, జెరూసలేం నగర శివార్లలో చాలా అందమైన తోట ఒకటి ఉండేది. చాలా పెద్దవైన ఆలివ్ చెట్లనుండి, దృఢమైన అత్తి పండ్లచెట్ల నుండి, ప్రకాశిస్తూ విప్పారే డెయిసీ పూల వరకు అనేకరకాల చెట్లకు, మొక్కలకు ఆ తోట నెలవుగా ఉండేది. వసంత ఋతువు వచ్చిదంటే చాలు- తోటలోని పూలన్నీ- డెయిసీలు, జెరేనియం- చేమంతులు, లిల్లీలు , చిన్నగా పసుపచ్చగా మెరిసే ఆవపూలు- అన్నీ విరగబూసేవి. ఎర్రగా మెరిసే పాపీ పూలు తలలు ఊపుతుండగా ఆ పూలన్నిటి పరిమళాల్ని మోసుకొని గాలి మత్తుగా, మెల్లగా వీస్తుండేది.

అలాంటి ఒక మధ్యాహ్నం పూట పూలన్నీ కలసి ముచ్చటించుకుంటున్నాయి. వాతావరణం ఉత్సాహభరితంగా ఉంది. సంగతేమంటే, ఆ రోజులో గొప్ప ధనికుడు, జెరూసలేం కౌన్సిల్ లో చాలా పలుకుబడి గల సభ్యుడు అయిన జోసెఫ్ అరిమేధియా తన కోసం తాను, నాటి ఆచారం ప్రకారం , ఒక అద్భుతమైన సమాధిని నిర్మించుకున్నాడు ఆ తోటలోనే. తమ చుట్టూ జరుగుతున్న ఆ కళాత్మక నిర్మాణం పూలన్నిటికి చాలా ఉత్సాహన్నిచ్చింది. తమకున్న ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తూ, పూలన్నీ నవ్వులాటగా, ఒకరిదానినొకటి ఎత్తిపొడుచుకుంటూ, వెక్కిరించుకుంటూ సంతోషపడుతున్నాయి.

ఆ సమయంలో గులాబీరంగు డైసీ తన రెక్కల్లో పొడుగాటిదానిని ఎత్తి లిల్లీవైపుకు చూపిస్తూ పెదవి విరిచింది: "నేను అనేదేమంటే, ఈ లిల్లీలున్నాయే, అవి అన్నిట్లోకీ అతి బద్ధకపు పూలు ! మనలాగే ఏదో ఒక ఋతువులో వచ్చే పూలన్నిటికీ ఇవి చాలా చెడ్డపేరు తెలుస్తున్నాయి నిజంగా" అన్నది తీవ్రంగా. ఈ మాటలు విని లిల్లీలన్నిటికంటే ముందుగానే వచ్చేసిన లేత నారింజరంగు లిల్లీ, సిగ్గుతో తల వాల్చుకున్నది. అంతలోనే గంజాయి పువ్వు అందుకున్నది - " చూడండి చూడండి, ఎంత ఘోరమైన రంగో చూడండి దీనిది. ఇలాంటిది మన మధ్య పెరుగుతున్నాయంటేనే సిగ్గు పడాలి మనందరం!" ఈ మాటలువిన్న ఆ ఒంటరి లిల్లీ , పాపం దాదాపు ముడుచుకొని , వాడి పోయింది. " సువాసన లేదు, రంగులేదు. కనీసం తోడు కూడా లేదు ఇవీ పూలేనా," అని ముద్దుగా మెరిసే జెరేనియం చామంతి అరిస్తే, ’తను అంత త్వరగా వికసించకుంటే బాగుండేది’ అని లిల్లీ పువ్వు బాధపడింది. అది నిస్సహాయంగా అన్ని వైపులా కలయ జూసింది; మిగిలిన లిల్లీలేమైనా కనిపిస్తాయోమోనని- కానీ మిగిలినవాటి జాడలేదు, ఎక్కడా.

రోజులు గడుస్తున్నాయి; కానీ దానికి తోడుగా ఇంకొక్క లిల్లీ కూడా రాలేదు. త్వరలో ఆ నారింజరంగు లిల్లీ కూడా ముసలిదైంది, మొక్క నుండి ఊడిపోయి కిందపడింది, గాలికి కొట్టుకుపోయింది. " అమ్మయ్య" అని మిగిలిన పూలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. " ఇప్పుడు ఇక తోటమాలి వచ్చి ఇంకా చాలా డెయిసీ లు నాటుతాడు" అనుకున్నాయి తోటలోని పూలన్నీ. డెయిసీలు గర్వంగా నవ్వాయి, మురిసిపోతూ.

మధ్యాహ్నపు చీకటి:

అప్పుడొకనాడు ఒక ఘోరం జరిగింది. మధ్యాహ్నంపూటే సూర్యుడు మాయమయ్యాడు.. గాఢాంధకారం నలువైపులా అలుముకున్నది. పూలన్నీ మూగవోయాయి. మళ్లీ సూర్యుడు వెలువడేంతవరకు పూలన్నీ తమ అందం గురించి ఆలోచించటం కూడా మరచాయి.

ఆరోజు సాయంత్రం అవన్నీ ఒక అద్భుతాన్ని చూశాయి. జోసెఫ్ అరిమేథియా ఆ తోటకు వచ్చాడు. అతని చేతుల్లో ఒక యువకుని మృతదేహం. ఆ శరీరం నిండా గాయాలు. ఆ మేకుల గాయాలనుండి ఇంకా రక్తం స్రవిస్తున్నది.

ఆ దృశ్యాన్ని చూసిన తెలివితక్కువ పూలకు కూడా తెలిసిపోయింది- ఈ వ్యక్తి ఎవరోకాదు! ఈ సృష్టిమొత్తానికీ ప్రభువు! ప్రపంచపు జనులందరి పాపాలను పరిశుద్ధి చేయటం కోసం శిలువనెక్కిన మహనీయుడు, కరుణామయుడు- ఏసు ప్రభువే ఈయన! పూలు నిశ్శబ్దంగా చూస్తున్నాయి.. జోసెఫ్, అతని మిత్రుడు నికోడెమస్ ఇద్దరూ కలిసి ప్రభువు శరీరాన్ని కొత్త బట్టలో చుట్టారు. ఆ పైన దాన్ని సమాధిలోకి దింపారు. త్వరలో చాలామంది సైనికులు వచ్చారు అక్కడికి. వారు దాన్ని మట్టితో నింపి, పెద్ద బండరాయిని ఆ సమాధిపైకి జరిపారు. ఆ తరువాత రాత్రంతా వారు అక్కడే కాపలా ఉన్నారు.

ఇలాంటి దృశ్యాన్ని తాము చూడవచ్చునన్న ఊహకూడా ఏనాడూ పూల మనస్సుల్లోకి రాలేదు. జరిగిన పనినంతా అవి విడ్డూరంగా చూశాయి. అప్పటికి సరిగా మూడవనాటి రాత్రి, ఇంకా చీకటిగా ఉండగానే అవి ఇంకో అద్భుతం చూడవలసి వచ్చింది. భూమి క్రిందినుండి భడభడమనే మహాశబ్దం వెలువడి, పూలన్నిటినీ నిద్రలేపింది: తెల్లగా మెరిసే బట్టలు ధరించి, వెలుగును ప్రసరిస్తున్న రెక్కలతో, సుందరమైన దేవదూత ఒకడు బండరాయిని సమాధినుండి ప్రక్కకు జరువుతుండటం చూసి పూలన్నీ నోర్లు వెళ్లబెట్టాయి. ఆ సమాధినుండి కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతి వెలువడింది. పూలన్నీ చూస్తుండగానే ఆ సమాధి తెరచుకొని, అందులోనుండి పరిశుద్ధ ప్రభువు నడచుకొని బయటికి వచ్చాడు! ఆయన శరీరంపై మేకుల గాయాలు ఇంకా క్రొత్తవి మాదిరే కనబడుతున్నాయి.

ఆ కాంతిలో పూలు చూసిన దృశ్యం ఒకటి వాటన్నిటి తలలూ వంగిపోయేలా చేసింది: అంతకు క్రితం వరకు చీకటిగా, నిస్తేజంగా, ఎడారిగా ఉన్న లిల్లీ పొదల్లో ఇప్పటివరకు అవి ఏనాడూ కనీ, వినీ ఎరుగనంత అందమైన, మంచులాంటి తెల్లటి లిల్లీపూలు అద్భుతంగా విరిసి ఉన్నాయి. ప్రభువు రక్తం చిందిన చోటంతా ఇప్పుడు ఆ లిల్లీలు వికసించి ఉన్నాయి. తిరిగివచ్చిన ఆ కరుణామయుడు తమప్రక్కగా నడుచుకుంటూ పోతుంటే, పరమానందం వెల్లువెత్తిన ఆ లిల్లీలు సగౌరవంగా ఆయనముందు తలలు వంచాయి.