తుపాకులు

ఆరవ తరగతి పిల్లవాడొకడు ఆ మధ్య వాళ్ళ బడికి ఒక తుపాకీ తీసుకుపోయాడట.

ఆ తుపాకీ బొమ్మది కాదు. అందులో బుల్లెట్లు రబ్బరువీ కావు. అది నిజం తుపాకీ!

వాళ్ళ నాన్నదిట అది. వాళ్ళ ఇంట్లో మొత్తం రెండు తుపాకులుంటాయట- ఒకటి వాళ్ళ నాన్నది; ఒకటి వాళ్ళ అమ్మది. వాటితో వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. మొత్తానికి ఒక తుపాకీ ఈ పసివాడి చేతిలోకి వచ్చింది.

వాడు అప్పటికే చాలా వీడియో గేములూ, కంప్యూటర్ గేములూ ఆడి ఉన్నాడు. తుపాకీతో ఏంచేస్తారో వాడికి బాగా తెలుసు. తుపాకీని గురిపెట్టటం వాడికి చక్కగా వచ్చు. ఎందరో టి.వి. రాక్షసుల్ని పేల్చేసిన అనుభవం ఉన్నది వాడికి. బడిలో తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న కుర్రవాళ్ళు ఇద్దర్ని , పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పడెయ్యటం వాడికి ఏమాత్రం కష్టం కాలేదు.

వెయ్యిమంది విద్యార్థుల ఎదుట, విద్య గరపే టీచర్ల సాక్షిగా, వాడు తన తోటి పిల్లల్ని కాల్చి చంపేశాడు. తల్లిదండ్రులనుండి పిల్లలు చాలా సంగతులు నేర్చుకుంటారు. వాళ్ళని ఎంత దూరంగా, బోర్డింగు స్కూళ్లలో ఉంచినా సరే, పిల్లలు తల్లిదండ్రుల అలవాట్లని అంత తొందరగా మర్చిపోరు. తల్లి, తండ్రి తూటాలు, బాంబులు లేకుండా బ్రతకలేని అస్తవ్యస్త జీవితపు ప్రాణులైనప్పుడు, పిల్లలు శాంతసౌహార్ద్ర మూర్తులవ్వటం కాస్తంత కష్టమే.

అందుకని, పిల్లలున్న పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ అలవాట్లు, దురలవాట్లు పిల్లలకు సోకకుండా ఉండేందుకు శ్రమించాలి.

తండ్రి రోజూ గుప్పు గుప్పున సిగరెట్లుకాలుస్తూ, పిల్లలచేతే వాటిని తెప్పించుకుంటేనూ, త్రాగి రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ పడి దెబ్బలు తగిలించుకుంటుంటేనూ, గూండాగా అందరినీ బెదిరించుకొని బ్రతుకుతుంటేనూ, భార్యలను కొట్టి, గొడవపడుతుంటేనూ పిల్లల మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి పిల్లలు తల్లిదండ్రుల మాదిరే తుపాకులకు, సెల్ ఫోన్లకు, మోటారు బైకులకూ బానిసలై, తమకు ఇంట్లో దొరకని ప్రేమల్ని వీధుల వెంబడి, సారాదుకాణాల్లోను, పబ్బుల్లోను, డిస్కోథెక్కుల్లోను వెతుక్కుందామనుకుంటారు.

పిల్లలు సహజ సౌకుమార్యంతో, సంతోషంగా ఎదిగి, బాధ్యతగల పౌరులవ్వాలంటే, ముందుగా పెద్దలు బాగుపడాలి. "మనం వ్యసనాలకు దూరమైతే తప్ప, మన పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుపడవ"ని గ్రహించాలి- ఏమంటారు?

ఈమాసంలో పిల్లలందరూ వేసవి శలవల్లో ఉంటారు. ఇళ్లన్నీ హడావిడిగాను, గజిబిజిగానూ ఉంటై. పిల్లలు ఎండల్లో తిరిగి వడదెబ్బలు తినకుండా ఉండాలంటే, వాళ్ళు ఆడుకునేందుకు ఇష్టపడే ఆటలు వాళ్లకి అందాలి. ఆటల్లో గొప్పవి, తక్కువవి అంటూ ఏమీ లేవు- అన్నీ ఆటలే, అన్నీ పిల్లలకు ఏదో ఒక రకంగా పనికొచ్చేవే. రకరకాల ఆటల సమాహారంగా, ఈ నెల ముఖచిత్రం- "వేసవి" ని అందించిన చిత్రకారుడు అడవి రాముడికి అభినందనలు.

         వేసవి శలవల శుభాకాంక్షలతో,

        -కొత్తపల్లి బృందం.

4 వ్యాఖ్యలు


  1. సామాజిక రుగ్మతల్ని సున్నితంగా పరిచయం చేయాల్సినచోట మొరటుదనం వచ్చేసి ఇంతపని చేసింది. దీన్ని ఎత్తి చూపిన లలిత గారికి కృతజ్ఞతలు. ఇప్పటివరకూ వచ్చిన అన్ని సంపాదకీయాల్లోకీ ఇదే చెత్తదని నేనూ అంగీకరిస్తున్నాను.

    వ్రాసిన వారు: నారాయణ — May 14, 2010

  2. నాకు అర్థం కాలేదు అన్నాను. అర్థం చేసుకోవాలనే ఉద్దేశం ఉంది కనుక, ఏమైనా నేను కూడా కాన్ట్రిబ్యూట్ చెయ్యగలనేమో అని ప్రయత్నిస్తున్నాను కనుక అడిగాను. నచ్చిన వాటి గురించి కూడా ఎక్కడికక్కడ చెప్తున్నాను. రోజూ కొద్దిగా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మా పిల్లలకి ఉపయోగపడే వాటిని వారికి చూపిస్తున్నాను.

    సమాజంలో ఉన్న రుగ్మతలు చూపించే సాధనాలు చాలా ఉన్నాయి కదా? పిల్లల లెవెల్ కి ఇది ఎక్కువ అనిపించి అడిగాను. పోనీ ఇది తాజా వార్త అయితే, పిల్లలు దీని గురించి ఎలాగూ తెలుసుకుంటారు గనుక వారికి వార్త విని కలిగే ప్రశ్నలకు సమాధానంగానో, లేక ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఎలా స్పందించాలి, ఎలా ఆలోచించాలి అనే ఉద్దేశంతోనో ప్రస్తావిస్తే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆశయం గురించి అడిగాను. ఎవరు టార్గెట్ ఆడియెన్స్ అని. సంపాదకీయం ముఖద్వారం కదా? తప్పుగా అనిపిస్తే క్షమించగలరు. నా ఉద్దేశం అర్థమైతే సంతోషం.

    వ్రాసిన వారు: లలిత — May 5, 2010

  3. ఒక సంపాదకీయం నచ్చనంత మాత్రాన పత్రిక ఆశయాలనే ప్రశ్నించడం బాగ లేదనుకుంటున్నాను లలిత గారూ! పిల్లలకు పత్రికనందుబాటులో ఉంచే తలిదండ్రులు మంచి వారై ఉండొచ్చు. కానీ సమాజం గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా! సామాజిక రుగ్మతల గురించి పిల్లలకు సంపాదకీయంలో అయినా రాయడం బాగుందనిపిస్తోంది నాకు.

    వ్రాసిన వారు: కె. రాజారెడ్డి — May 5, 2010

  4. ఈ పత్రిక పిల్లల కోసం కదా. ఇది పిల్లలకు కొనే వారైనా, చదివి వినిపించే వారైనా పైన ఉదహరించిన తల్లిదండ్రుల కోవలోకి రారు కదా. భయపెట్టడానికి టీవీలూ, సినిమాలూ, వార్తా పత్రికలూ చాలవా? మీ పత్రిక కూడా మొదలు పెట్టాలా? ఆ తుపాకీ సంఘటనలు జరిగినది ఎక్కడ, ఎంత కాలం క్రిందట? దానిని ప్రస్తావిస్తూ ముందు మాట మొదలు పెట్టాల్సిన అవసరం ఎంత? మీరు ఈ పత్రిక కోసం ఎంతగా శ్రమిస్తున్నారో తెలిసీ ఇటువంటి విషయాలు మాత్రం అభినందించలేకపోతున్నాను. మీ పత్రిక ఆశయాలు అర్థం కావట్లేదు.

    వ్రాసిన వారు: లలిత — May 3, 2010


వ్యాఖ్య రాయండి